ఓటుకు నోటు కేసులోకి చినబాబు?

Update: 2016-08-31 09:42 GMT
ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు.. ఆయన కుమారుడు లోకేశ్ ను లాగాలన్న ప్రయత్నం జరుగుతుందా? అంటే అవుననే మాట వినిపిస్తోంది. దీనికి తగ్గట్లే తాజాగా ఏపీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత.. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపణలు ఉన్నాయి. ఓటుకు నోటు అంశంపై మంగళగిరి ఎమ్మెల్యే ఏసీబీ కోర్టులో ప్రైవేటు కేసు దాఖలు చేయటం.. దీనిపై దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలంటూ కోర్టు పేర్కొన్న నేపథ్యంలో.. కొద్దినెలలుగా ఎలాంటి కదలిక లేని ఈ అంశం ఒక్కసారిగా తెరపైకి వచ్చింది.

అవకాశం దొరికిందే అన్న చందంగా జగన్ పార్టీ నేతలు చెలరేగిపోతున్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబునాయుడ్ని నిందితుడిగా చేర్చే అవకాశం ఉందన్న వాదనల్ని వినిపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఇష్యూలో టీడీపీ యువనేత లోకేశ్ కు సైతం పాత్ర ఉందన్న రీతిలో బొత్స తాజా వ్యాఖ్యలు ఉండటం గమనార్హం.

తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్ సన్ కు రూ.50లక్షలు ఇస్తూ రేవంత్ రెడ్డి దొరికిపోయిన వేళ.. ఆయన ప్రయాణించిన కారును నడిపింది లోకేశ్ కారు డ్రైవర్ గా బొత్స ఆరోపణలు చేశారు. తెలంగాణ తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డి వచ్చిన కారును లోకేశ్ డ్రైవర్ నడిపారంటూ తీవ్ర ఆరోపన చేసిన ఆయన.. ఈ కేసు నుంచి తప్పించుకోవటానికి తెలుగు దేశం నేతలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఓటుకు నోటు కేసుకు సంబంధించి లోకేశ్ ప్రస్తావన ఇప్పటివరకూ లేకున్నా.. తాజాగా మాత్రం బొత్స తన ఆరోపణల ద్వారా చినబాబును కూడా ఈ ఉదంతంలోకి తీసుకురావాలన్నఆలోచనలో ఉన్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.  అందులో భాగంగానే బొత్స తాజా ఆరోపణలని చెబుతున్నారు.
Tags:    

Similar News