ముంబైలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు...

Update: 2016-09-28 04:25 GMT
ఈ మధ్యకాలంలో కాస్త పెద్ద నగరాల్లో ఉన్న అతిపెద్ద సమస్యల్లో ట్రాఫిక్ ఒకటి. రోడ్డు సైజుతో ఏమాత్రం సంబందం లేకుండా ట్రాఫిక్ జాం అవుతూ ఉంటుంది. కొన్ని చోట్ల అయితే... జనాలు పెరిగారు - కార్లు పెరిగాయి కానీ కొన్ని దశాబ్ధాలుగా రోడ్ల విస్తీర్ణం మాత్రం జరగలేదు. ఇన్ని సమస్యల మధ్య సగటు వాహనదారుడు నడిరోడ్డుపై నరకం చూస్తున్నాడు అనేది తెలిసిన విషయమే. అయితే ఈ సమస్యపై తాజాగా ముంబై హైకోర్టు సంచలన నిర్ణయం దిశగా నిర్ణయం తీసుకుంటుంది. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదేమిటంటే... "కుటుంబానికి ఒకటే కారు ఉండాలి" అని!

వాణిజ్య రాజధాని ముంబైలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు హైకోర్టు నూతన విధానం అమలుపై చర్చించింది. ఇందులో భాగంగా కుటుంబానికి ఒకే కారు ఉండాలన్న విధానాన్ని రాష్ట్రంలో అమలు పరచాలంటూ మహరాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విషయంలో ట్రాఫిక్ రద్దీని అధిగమించేందుకు సమగ్ర విధానాన్ని అమలు చేయాలని మహరాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఇందులో భాగంగా కుటుంబంలో కార్ల శాతాన్ని పరిమితం చేసే విషయంపై దృష్టి పెట్టాలని తెలిపింది. నగరంలో పార్కింగ్ స్థలాల కొరతపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై కోర్టు విచారణ జరిపిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రతి కుటుంబానికి రెండు, అంతకు మించి కార్లు ఉండటం కనిపిస్తోందని, ఈ సమయంలో కుటుంబానికి ఒకే కారు ఉండేట్లు పరిమితం చేస్తే ముంబైలో తీవ్రమైన సమస్యగా మారిన ట్రాఫిక్ రద్దీ, అనధికార పార్కింగ్ సమస్యలను అధిగమించొచ్చని కోర్టు అభిప్రాయ పడింది.

ముంబైలో పార్కింగ్ పెద్ద సమస్యగా మారిందని, ఇకపై ప్రభుత్వం పట్టించుకోకుండా కూర్చుంటే సరిపోదని కోర్టు సూచించింది. పదేళ్ళ క్రితం ముంబైలో దాదర్ నుంచి దక్షిణ ముంబై ప్రయాణానికి కేవలం 20 నిమిషాల సమయం పట్టేదని, ఇప్పుడు ఆ పరిస్థితిలో అనూహ్య మార్పు వచ్చిందన్న కోర్టు తెలిపింది. ఈ విషయం తెలిసినవారు "హైదరాబాద్ లో కూడా ఈ రూల్ వస్తే బాగున్ను" అని భావిస్తున్నారట!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News