తమ్ముడు కాదన్న ప్రతిపాదనకు అన్నయ్య అవునంటున్నాడా?

Update: 2019-08-17 07:02 GMT
జనసేన పార్టీని విలీనం చేయాలని ఎన్ని రాయబారాలు పంపుతున్నా బెట్టు చేస్తున్న పవన్ కల్యాణ్‌ కు బీజేపీ భారీ షాక్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. పవన్ రానంటే ఆయన అన్ననూ తీసుకెళ్తాం అంటున్నారు బీజేపీ నేతలు. అవును.. మెగాస్టార్ చిరంజీవితో బీజేపీ చర్చలు గతం కంటే కాస్త ముందుకువెళ్లాయని.. చిరంజీవిలో కాషాయ ఆలోచనలు మొలిపించడంతో ఓ బీజేపీ కీలక నేత సఫలమయ్యారని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ నేత, ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవి ఆ పార్టీని వీడతారని, ఆయనతో బీజేపీ అగ్రనేతలు టచ్ లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. బీజేపీ ఆపరేషన్ ‘ఆకర్ష్’ లో భాగంగా కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన లీడర్లపై ఆ పార్టీ అధిష్ఠానం కన్నేసింది. ఇందులో భాగంగా చిరంజీవిని తమ పార్టీలోకి లాక్కోవాలని చూస్తోంది. బీజేపీ నేత రాంమాధవ్ కేంద్రంగా ఈ వ్యవహారం నడుస్తున్నట్టు తెలుస్తోంది.

అయితే, చిరంజీవి బీజేపీలో చేరడానికి మరికొంత సమయం పడుతుందని సమాచారం. తన 151వ చిత్రం ‘సైరా’ విడుదల తర్వాత చిరంజీవి బీజేపీలో ఆయన చేరే అవకాశాలున్నట్టు చెబుతున్నారు. ఈలోగా ఈ నెల 18న హైదరాబాద్ లో బీజేపీ బహిరంగ సభ ఎలా జరగబోతోంది.. బీజేపీలోకి వెళ్తే తనకు ఎలాంటి లాభం కలగబోతోంది వంటివన్నీ చిరంజీవి బేరీజు వేసుకోవడానికి సమయం దొరుకుతుంది.

కాగా ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో కలిపేసినప్పుడు ఆ పార్టీ చిరంజీవికి ఇచ్చిన ఆఫరే బీజేపీ కూడా ఇస్తున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ సభ్యత్వంతో పాటు కేంద్ర మంత్రి పదవి కూడా ఇవ్వడానికి బీజేపీ సుముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఆయన్ను ప్రధానంగా ఏపీలో సీఎం అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేస్తూ పవన్ కల్యాణ్‌ను ఏపీలో మినిమైజ్ చేసి ఎన్నికల నాటికి బీజేపీలో కలవడమో.. పొత్తు పెట్టుకోవడమే చేస్తూ చిరంజీవి- పవన్ ఇద్దరినీ ముందుపెట్టి ఎన్నికలకు వెళ్లాలన్నది బీజేపీ ఆలోచనగా తెలుస్తోంది. చిరంజీవిని ముందుపెడితే కాపుల ఓట్లు హోల్ సేల్‌ గా పడడంతో పాటు వైసీపీకి బలమైన ఓట్ బ్యాంకుగా ఉన్న వర్గాలనూ కొల్లగొట్టొచ్చని.. ప్రజారాజ్యం, జనసేన పార్టీలతో చిరంజీవి, పవన్‌ లు విఫలమైనా బలమైన రాజకీయ వ్యూహాలు, వ్యవస్థ అన్నీ ఉన్న తాము దన్నుగా ఉంటూ వారిని ముందుంచి ఏపీలో అధికారం పొందొచ్చని బీజేపీ భావిస్తున్నట్లుగా సమాచారం.


Tags:    

Similar News