ఎన్నికల బరిలో ఎవర్ గ్రీన్ హీరోయిన్?

Update: 2018-12-06 15:52 GMT
సినీ తారలు తమ రంగంలో మంచి స్థాయి అందుకుని.. నటన నుంచి నిష్క్రమించాక రాజకీయాల వైపు చూడటం సహజం. ఈ కోవలో ఎందరో తారలు రాజకీయారంగేట్రం చేశారు. ఎమ్మెల్యేలు.. ఎంపీలు అయ్యారు. మంత్రి పదవులూ చేపట్టారు. ఒకప్పటి బాలీవుడ్ అందాల తార మాధురీ దీక్షిత్ సైతం ఈ జాబితాలో చేరబోతున్నట్లు సమాచారం. ఆమె కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తరఫున రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. పుణె నుంచి ఆమె ఎంపీగా పోటీ చేయనుందట. ఆమె పేరును దాదాపుగా భాజపా ఖరారు చేసినట్లు సమాచారం.

2014 ఎన్నికల్లో పుణె నియోజకవర్గంలో భాజపా అభ్యర్థి అనిల్ శిరోల్ విజేతగా నిలిచాడు. అంతకుముందు అది కాంగ్రెస్ సీట్. భాజపా అభ్యర్థి 3 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీ సాధించడం విశేషం. అనిల్ స్థానంలోకి ఇప్పుడు మాధురిని తెస్తుండటం విశేషమే. కొన్ని నెలల కిందటే భాజపా అధ్యక్షుడు అమిత్ షా మాధురి ఇంటికి వెళ్లి ఆమెను పార్టీలోకి తీసుకురావడంపై చర్చించినట్లు సమాచారం. మాధురి కూడా పార్టీలోకి రావడానికి సుముఖత వ్యక్తం చేశాడట. ఎన్నికల కోసం చాలా ముందు నుంచే సన్నాహాల్లో ఉన్న భాజపా నాయకత్వం ఇప్పటికే చాలా స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసింది. మాధురిని పుణెకు ఖరారు చేస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరి మాధురి ఆకర్షణ రాబోయే ఎన్నికల్లో ఏమేరకు పని చేస్తుందో చూడాలి.


Tags:    

Similar News