వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్లకు ఈడీ బిగ్ షాక్ .. ముంబైలో ఏకకాలంలో దాడులు

Update: 2021-07-17 09:30 GMT
ఆర్థిక నేరాలకి అడ్డుకట్ట వేయడానికి ఉద్దేశించిన ఎన్‌ ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు వీడియో కాన్ గ్రూప్ ప్రమోటర్లకు బిగ్ షాక్ ఇచ్చారు. ముంబైలోని వారి నివాసాలు, కార్యాలయాల్లో ఏకకాలంలో దాడులకి దిగారు. ఈ దాడులు ప్రస్తుతం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వీడియో కాన్ ప్రమోటర్లు విదేశాల్లో ఏర్పాటు చేసుకున్న కార్యాలయాలపైనా ఈడీ పూర్తి నిఘా పెట్టారు. వాటికి సంబంధించిన కొన్ని కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన ప్రకటన ఈ సాయంత్రానికి విడుదల చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

మనీ ల్యాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఈడీ అధికారులు ఈ దాడులకు దిగారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలతో మొజాంబిక్‌ లో చమురు, సహజవాయు రంగంలో పెట్టుబడులు పెట్టారంటూ వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్లపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని పెట్రోలియం మంత్రిత్వ శాఖ నుంచి అందిన ఆదేశాల మేరకు ఎన్‌ ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈ దాడులకు దిగినట్లుగా తెలుస్తుంది. వీడియోకాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గ్రూప్ కంపెనీల్లో ఒకటైన వీడియోకాన్ హైడ్రోకార్బన్స్ హోల్డింగ్ లిమిటెడ్.. మొజాంబిక్‌ లో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ బ్లాక్‌ కు సంబంధించిన రొవుమా ఏరియా 1ను కొనుగోలు చేసింది.

ఇందులో భాగంగా అమెరికాకు చెందిన అనడార్కో కంపెనీలో 10 శాతం మేర వాటాలను తీసుకుంది. ఆ తర్వాత ,దీన్ని ఓఎన్‌ జీసీకి చెందిన విదేశ్ లిమిటెడ్ అండ్ ఆయిల్ ఇండియా లిమిటెడ్ కొనుగోలు చేసింది. మొజాంబిక్ బ్లాక్‌ ను కొనుగోలు చేయడంలో వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్లు మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు సీబీఐ అధికారులు నిర్ధారించారు. దీనిపై కేసు నమోదు చేశారు. ఇదివరకు సీబీఐ దాడులు సైతం చేపట్టింది. కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అదే మనీ లాండరింగ్ వ్యవహారంలో తాజాగా ఈడీ అధికారులు సోదాలు చేస్తోన్నారు.

ముంబైలోని వీడియోకాన్ ప్రమోటర్ల నివాసాలు, కార్యాలయాలపై ఏకకాలంలో దాడులకు దిగారు. ఈ దాడులు కొనసాగుతోన్నాయి. పెట్రోలియం మంత్రిత్వ శాఖ నుంచి అందిన ఆదేశాల మేరకు ఈ దాడులను చేపట్టినట్లు ఈడీ అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. సీబీఐ నమోదు చేసిన ఎఫ్ ఐ ఆర్, మంత్రిత్వ శాఖ నుంచి అందిన సమాచారం ప్రకారం.. ప్రమోటర్ల మీద దాడులు కొనసాగిస్తున్నట్లు చెప్తున్నాయి. వీడియోకాన్ గ్రూప్ ఛైర్మన వేణుగోపాల్ ధూత్, ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈఓ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌లు ఇదివరకే మనీ ల్యాండరింగ్ ఆరోపణలను ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే.

వీడియోకాన్, ఐసీఐసీఐ బ్యాంకు మధ్య ఏం జరిగిందన్న సంగతి ఇదమిద్ధంగా తెలియకున్నా, అసలు కథ 2008 డిసెంబర్‌ లో మొదలైంది. వీడియోకాన్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ వేణుగోపాల్‌ ధూత్‌, చందా కొచ్చర్‌ ల మధ్య క్విడ్‌ ప్రో కో జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేణుగోపాల్‌ ధూత్‌, చందాకొచ్చర్‌ భర్త దీపక్‌ కొచ్చర్‌ లతో పాటు కొచ్చర్ కుటుంబానికి చెందిన మరో ఇద్దరు బంధువులు కలిసి 2008లో న్యూపవర్‌ రెన్యూవబుల్స్‌(ఎన్‌ ఆర్‌ పీఎల్‌ )ను నెలకొల్పారు. 2009లో ఎన్‌ ఆర్‌ పీఎల్‌ డైరెక్టర్‌గా ధూత్‌ రాజీనామా చేసి దీపక్‌ కొచ్చర్‌ కు తన 25వేల షేర్లను బదిలీ చేశారు. 2010లో వేణుగోపాల్ ధూత్‌ తన కంపెనీ సుప్రీం ఎనర్జీ నుంచి ఎన్‌ఆర్‌పీఎల్‌కు రూ.64 కోట్ల రుణం ఇవ్వడం గమనార్హం. ఆ తర్వాత జరిగిన షేర్ల బదిలీ నేపథ్యంలో ధూత్‌కు చెందిన సుప్రీం ఎనర్జీ.. ఎన్‌ఆర్‌పీఎల్‌లోని మెజారిటీ షేర్లను కొనుగోలు చేసింది.

అటుపైన వాటిని మహేశ్‌ చంద్ర పుంగ్లియాకు బదిలీ చేశారు. సుప్రీం ఎనర్జీలో పుంగ్లియా తనకున్న మొత్తం వాటాను దీపక్‌ కొచ్చర్‌కు చెందిన పినాకిల్‌ ఎనర్జీకి రూ.9 లక్షలకే విక్రయించారు. రూ.64 కోట్ల పెట్టుబడులు ఉన్న కంపెనీ రూ.9 లక్షలకే వచ్చిందన్నమాట. ఇప్పటిదాకా కథ బాగానే సాగింది. ఇది జరిగిన ఆరు నెలలకు 2012లో ఐసీఐసీఐ బ్యాంక్‌ నుంచి రూ.3250 కోట్ల రుణం మంజూరైన తర్వాతే న్యూపవర్‌ కంపెనీ చేతులు మారడం అనుమానాలను రేకెత్తిస్తోంది. కన్సార్టియం రూ.40 వేల కోట్ల రుణం ఇలా దీపక్ కొచ్చర్, ఇద్దరు బంధువుల ఆధ్వర్యంలోని న్యూపవర్ రెన్యూవబుల్స్ సంస్థకు రుణం మంజూరు ప్రామాణికతను సీబీఐ పరిశీలిస్తోంది. ఈ మొత్తం విషయంలో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ చందాకొచ్చర్‌ పాత్ర ఉందేమోనన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి.



Tags:    

Similar News