మరోసారి బండి నోట అదే మాట.. గులాబీ దండుకు ‘అరెస్టు’ భయం

Update: 2020-12-15 05:35 GMT
రాజకీయాల్లో ఉత్తి పుణ్యమానికి వ్యాఖ్యలు చేయటం ఉండదు. అందులోకి కీలకస్థానాల్లో ఉన్న వారి నోటినుంచి ఒకేలాంటి మాట అదే పనిగా రావటం చాలా సంకేతాల్ని ఇస్తుందన్నది మర్చిపోకూడదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జైలుకు వెళ్లటం ఖాయమన్న మాట తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నోట అదే పనిగా రావటం రాజకీయ సంచలనంగా మారింది. గ్రేటర్ ఎన్నికల ప్రచార సమయంలో ఆయన నోటి నుంచి తొలిసారి.. సీఎం కేసీఆర్ జైలుకు వెళ్లటం ఖాయమని వ్యాఖ్యానించి కలకలాన్ని రేపారు.

మొదట్లో ఆయన మాటల్ని చాలామంది సీరియస్ గా తీసుకోలేదు.ఎందుకంటే.. బీజేపీనేతల్లో బండి మాటల్ని లైట్ తీసుకోవాలనే వర్గం ఉంది. సంచలనం కోసం.. వార్తల్లో కనిపించటం కోసం ఇలాంటివి ఆయన మాట్లాడతారన్న చిన్నచూపు ఉంది. వాస్తవానికి ఇలాంటి మాటలతో బండి సంజయ్ ను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేని నేతగా కొన్ని వర్గాల వారు  తరచూ ప్రచారం చేస్తుంటారు. దుందుడుకుగా మాట్లాడటం.. అదే పనిగా నోరు పారేసుకుంటారన్న చెడ్డపేరు ఆయనకు ఉంది. అన్నింటికి మించి.. మిగిలిన వారి మాదిరి విషయ పరిజ్ఞానం తక్కువన్న మాట వినిపిస్తూ ఉంటుంది.

నిజానికి కొన్ని సాంకేతిక అంశాల్ని పక్కన పెడితే.. మొత్తంగా బండి సంజయ్ మాటల్లో తప్పులు పెద్దగా ఉండవు. కానీ..ఆయన్ను మేథోతనానికి చిహ్నంగా చూడకపోవటం కూడా.. ఆయన్ను తక్కువ చేయటం ద్వారా.. ఆయన చేసే కీలక వ్యాఖ్యలకు ప్రాధాన్యత లేకుండా చేసే దుర్మార్గపు ఎత్తుగడగా చెబుతారు. ఢిల్లీ టూర్ ముగించుకొని హైదరాబాద్ కు కేసీఆర్ వచ్చినంతనే.. బండికి హస్తిన నుంచి పిలుపు రావటం తెలిసిందే.

తన ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్ జైలుకు వెళ్లటం ఖాయమన్న మాట రావటంతో గులాబీ దళం ఉలిక్కిపడింది.  అప్పటివరకు ఢిల్లీకి వెళ్లిన గులాబీ బాస్.. ఇష్యూస్ ను చక్కదిద్దారన్న భావనను బండి తన మాటలతో తేల్చేశారని చెప్పాలి. కేసీఆర్ అంటే నమ్మే పరిస్థితుల్లో ఎవరూ లేరని.. ఆయన త్వరలోనే జైలుకు వెళ్లటం ఖాయమన్న మాటను చెప్పారు. సీఎం కేసీఆర్ అక్రమాలపై భరతం పడతామని వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన నోటి నుంచి వచ్చిన కొన్ని మాటలు మరింత ఆసక్తికరంగా మారాయి.

వంగి.. వంగి.. పొర్లి దండాలు పెట్టినా క్షమించమని చెప్పిన ఆయన.. ప్రజల చూపును మరల్చటానికి కేసీఆర్ ఢిల్లీ పర్యటన చేసినట్లు చెప్పారు. లోపల జరిగేది ఒకటైతే.. బయటకు చెప్పేది మరొకటి ఉంటుందన్న ఆయన కేసీఆర్ పాలనా తీరుపై తీవ్ర విమర్శలు చేయటం గమనార్హం. మొత్తంగా బండి నోటి వెంట మరోసారి కేసీఆర్ అరెస్టు మాట రావటం.. గులాబీ దళానికి కొత్త టెన్షన్ పుట్టినట్లుగా చెబుతున్నారు.
Tags:    

Similar News