గచ్చిబౌలిలోని మాల్ లో షాకిచ్చిన బజరంగ్ దళ్ కార్యకర్తలు

Update: 2020-02-15 08:30 GMT
ప్రేమికుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ మహానగరంలో అనూహ్య పరిణామం ఒకటి చోటు చేసుకుంది. వాలెంటైన్ డే అన్నంతనే కళకళలాడే పార్కుల తీరుకు ఈసారి భిన్నమైన సీన్ కనిపిస్తూ.. వెలవెలబోయింది. అదే సమయంలో మాల్స్ కళకళలాడాయి. ప్రేమికులు సరదాగా ఎంజాయ్ చేయటం కనిపించింది. దీనికి తోడు.. మాల్స్ లోని ప్రేమికుల దినోత్సవం పేరుతో అందంగా ముస్తాబు చేయటం కనిపించింది.

ఇదిలా ఉంటే గచ్చిబౌలిలోని ఎఎంబీ మాల్ (అదేనండి కొండాపూర్ లోని శరత్ సిటీ మాల్) లో బజరంగ్ దళ్ కార్యకర్తలు కొందరు ఆగమాగం చేసిన వైనం సంచలనంగా మారింది. సదరు మాల్ లోని ఫుడ్ కోర్ టులో ప్రేమికుల దినోత్సవానికి తగ్గట్లుగా కలర్ బెలూన్స్ తో అందంగా అలంకరించారు. ఈ తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన వారు.. ఫుడ్ కోర్ టుపై దాడి చేశారు. సుమారు పాతిక మంది వరకు బజరంగ్ దళ్ కార్యకర్తలు ఈ దాడిలో పాల్గొన్నట్లుగా చెబుతున్నారు.

కుర్చీలు.. బల్లలు ఎక్కి బెలూన్స్ ను పగలకొట్టటంతో పాటు.. ఫర్నిచర్ కూడా విరగొట్టినట్లుగా తెలుస్తోంది. దీంతో.. ఫుడ్ కోర్టుకు వచ్చినోళ్లతో పాటు.. మాల్ లోని పలువురు భయాందోళనలకు గురయ్యారు. అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి చోటు చేసుకుంది. ప్రేమికుల దినోత్సవాన్ని వ్యతిరేకిస్తూ.. పెద్ద ఎత్తున నినాదాలు చేసిన బజరంగ్ దళ్ కార్యకర్తలు దాడిని పలువురు జీర్ణించుకో లేకపోతున్నారు.

మాల్ సెక్యురిటీ ఇన్ చార్జి శశికాంత్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారం గా చేసుకొని పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ కెమరాల పుటేజ్ తో నిందితుల్ని గుర్తించి.. అదుపులోకి తీసుకుంటామని చెబుతున్నారు. ఈ పరిణామంగా సంచలనంగా మారింది. నగరంలోని ఒక మాల్ లో ఈ విధమైన తీరును ప్రదర్శించటం ఇదే తొలిసారని చెబుతున్నారు.
Tags:    

Similar News