మీకు తెలుసా? చిరు మాదిరే బొత్స కష్టపడి పైకొచ్చాడట!

Update: 2019-09-15 05:03 GMT
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. అవకాశం చిక్కినప్పుడు ఏ మాత్రం వదిలిపెట్టకుండా పవన్ తీరును కడిగిపారేస్తున్నారు. పవన్ వ్యాఖ్యలపై కచ్ఛితమైన కౌంటర్ ను వేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు తాజాగా.. పవన్ పై విమర్శలకు చిరు సెంటిమెంట్ ను తేవటం ఆసక్తికరంగా మారింది.

నవరత్నాలు బాగున్నాయని.. కాకుంటే జగన్ వంద రోజుల పాలనతో ఏపీ ప్రజలకు ఒరిగిందేమీ లేదంటూ పవన్ విమర్శలు చేయటం తెలిసిందే. దీనిపై జగన్ పార్టీ నేతలు రియాక్ట్ అయ్యారు. పవన్ వ్యాఖ్యలపై మంత్రులు అవంతి శ్రీనివాస్.. బొత్స సత్యానారాయణలు తప్పు పట్టారు.

టీడీపీ ట్రాప్ లో పవన్ పడొద్దన్న సూచన చేసిన అవంతి శ్రీనివాస్.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అమరావతి.. పోలవరంలో జరిగిన అవినీతికి పవన్ అనుకూలమా? వ్యతిరేకమా? అన్నది తేల్చాలన్నారు. ఇసుక దోపిడీ ఎలా సాగిందో తెలీదా? అని ప్రశ్నించిన ఆయన.. మంత్రి బొత్సపై పవన్ విమర్శలు చేయటం సరికాదన్నారు.

పవన్ సోదరుడు చిరంజీవి సినిమా ఇండస్ట్రీలో ఎలా అయితే స్వశక్తితో కష్టపడి పైకి వచ్చారో.. బొత్స సత్తిబాబు సైతం రాజకీయాల్లో సొంతంగా ఎదిగారన్నారు. జగన్ ప్రభుత్వాన్ని తప్పు పడుతున్న పవన్ కల్యాణ్.. తనను ఓడించిన గాజువాక నియోజకవర్గ ప్రజల్ని ఇప్పటివరకూ వెళ్లి కలిశారా? అని సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని విమర్శించే ముందు పవన్ ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. తన అన్న మాదిరి కష్టపడి పైకొచ్చిన బొత్సను ఎలా విమర్శిస్తారంటూ పవన్ తీరును తప్పు పట్టారు అవంతి.

ఇదిలా ఉంటే మంత్రి బొత్స సత్తిబాబు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముంచిన బాబును సమర్థించేలా పవన్ మాటలు ఉన్నాయన్నారు. రాస్ట్రాన్ని దోచుకుతిన్న బాబును వెనకేసుకు వచ్చేలా పవన్ మాటలు ఉన్నాయన్నారు. పసలేని వ్యాఖ్యలు చేయటం.. చవకబారు స్పీచులు ఇవ్వటం.. పెయిడ్ ఆర్టిస్ట్ లతో కార్యక్రమాలు చేయటం తమకు చేతకాదని చెబుతూనే.. పవన్ కు అవసరమైన పంచ్ లన్ని వేశారని చెప్పక తప్పదు. 
Tags:    

Similar News