తైవాన్ కంపెనీపై ఉద్యోగుల దాడి.. ఉద్రిక్తం

Update: 2020-12-12 12:46 GMT
ఇండియాలోని తైవాన్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులే కంపెనీపై  దాడి చేశారు. దాడిలో కంపెనీ ఆస్తులు ధ్వంసం అయ్యింది. చివరకు పోలీసుల రంగం ప్రవేశంతో పరిస్దితి కాస్త అదుపులోకి వచ్చింది. అయితే ముందు ముందు ఏం జరుగుతుందో అనే టెన్షన్ అయితే కంటిన్యు అవుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే కర్నాటక, కోలార్ జిల్లాలోని నర్సాపుర ప్రాంతంలో తైవాన్ కు చెందిన విస్ట్రాన్ మాన్యుఫాక్షరింగ్ ప్లాంట్ ఉంది.

ఈ ప్లాంటులో ఐఫోన్ విడిభాగాలు తయారవుతాయి. ఈ ప్లాంటులో కొన్ని వందలమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే వీరిలో కొందరికి నాలుగు నెలలుగా జీతాలు రావటం లేదట. మరి కొందరికి అరాకొరా జీతాలు అందాయి. ఇంకొంతమందికి తాము పనిచేసిన గంటలకు తగ్గట్లుగా వేతనాలు అందలేదు. ఇలాంటి మూడు వర్గాలకు చెందిన ఉద్యోగుల్లో కంపెనీ యాజమాన్యంపై ఒళ్ళు మండిపోయింది.

తమకు రావాల్సిన జీతాల కోసం యాజమాన్యం ప్రతినిధులతో చర్చలు జరిపిందుకు సమావేశమయ్యారు. అయితే సమస్యలకు పరిష్కారాలు చూపాల్సిన చర్చల్లో రెండువైపుల ప్రతినిధుల మధ్య మాట మాట పెరిగి పెద్దదై చివరకు గొడవకు దారితీసింది. దాంతో యాజమాన్యం వైఖరిపై ఉద్యోగుల్లో ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దాంతో తాము పనిచేస్తున్న కంపెనీపైనే ఉద్యోగులు దాడికి దిగారు.

 తమ చేతికి దొరికిన కర్రలు, రాడ్లు తీసుకుని కంపెనీ ఫర్నీచర్ ను ఉద్యోగులు ధ్వంసం చేసేశారు. కంపెనీ వాహనాలకు నిప్పంటిచారు. చివరకు కంపెనీ నేమ్ బోర్డును కూడా తగలబెట్టేశారు. దాంతో కంపెనీ కాంపౌండ్ లో పెద్ద విధ్వంసమే జరిగిందని చెప్పాలి. ఎప్పుడైతే ఉద్యోగుల గొడవ మొదలైందో విషయం పోలీసులకు చేరింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగటంతో గొడవ సద్దుమణిగింది.

ఉద్యోగులు మాట్లాడుతూ తమతో యాజమాన్యం 12 గంటలు పనిచేయిస్తోందంటూ మండిపోయారు. తమ పనిగంటలు రోజుకు 7, 8 గంటలే అయినా నిబంధనలకు విరుద్ధంగా 4 గంటలు ఎక్కువగా పనిచేయిస్తోందంటు ఆరోపించారు. కానీ వేతనాలు చెల్లించాల్సి వచ్చినపుడు మాత్రం తమకు 8 గంటలకు ఇచ్చే వేతనాన్ని మాత్రమే ఇస్తున్నట్లు మండిపోయారు. రికార్డుల్లో 8 గంటల పనిని నమోదు చేసినా నాలుగు గంటలు అదనంగా పనులు చేయిస్తోందన్నారు. మరి ఈ సమస్యను ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.
Tags:    

Similar News