విచారణకు ముందే ఆర్నాబ్ కు సుప్రీంలో చిక్కులు

Update: 2020-11-11 06:00 GMT
ఉన్నత స్థానాల్లో ఉండే వ్యక్తులు కొన్ని విషయాల్ని చాలా తేలిగ్గా తీసుకుంటారు. తర్వాతి రోజుల్లో అదే అంశం వారి కొంప ముంచేలా చేస్తుంది. తాజాగా అలాంటి పరిస్థితినే ఎదుర్కొటున్నారు రిపబ్లిక్ పార్టీ చీఫ్ కమ్ సెలబ్రిటీ జర్నలిస్టు ఆర్నాబ్ గో స్వామి. ఒక ఇంటీరియర్ డిజైనర్ కు రిపబ్లిక్ చానల్ స్టూడియో కోసం చేసిన పనికి రూ.5కోట్లు చెల్లించాల్సిన బకాయిల వివాదం చూస్తుండగానే ఆయనకు చిక్కులు తీసుకురావటమే కాదు.. చివరకు జైలుకు వెళ్లేలా చేసింది.

రూ.5కోట్ల బకాయిలు ఎంతకూ రాకపోవటంతో సదరు ఇంటీరియర్ డిజైనర్ సూసైడ్ చేసుకోవటం.. అప్పట్లో ఆ కేసును మూసేసినా.. తాజాగా తిరిగి తెరవటం.. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు విషయంలో చేస్తున్న ఫాలో అప్ తో తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పాలి. ఈ కేసులో తనకు బెయిల్ వస్తుందని ఆర్నాబ్ భావించినా.. అలాంటిదేమీ జరగకపోగా.. బెయిల్ పిటిషన్ కు కోర్టును నో చెప్పేస్తున్నాయి.

దీంతో..ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చిక్కుల్లో ఉన్నప్పుడు.. అందునా కాలం తనకు అనుకూలంగా లేని వేళలో ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించాలి. కానీ.. ఆ విషయంలో ఆర్నాబ్ తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లుగా కనిపించటం లేదు. ఎందుకంటే.. సుప్రీంకోర్టులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ విచారణకు రావటానికి ముందే వివాదంగా మారింది. ఇది కచ్ఛితంగా ఆర్నాబ్ కు ఇబ్బందిని కలిగించే అంశంగా చెప్పక తప్పదు.

అర్నాబ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చేందుకు ప్రాధాన్యత క్రమంలో అమిత ప్రాధాన్యతను ఇవ్వటాన్ని తప్పు పడుతూ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దుశ్యంత్ దవే తప్పుపడుతున్నారు. సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ కు ఆయన లేఖ రాస్తూ.. ఆర్నాబ్ బెయిల్ పిటిషన్ ను అంత వెంటనే విచారణకు స్వీకరించేలా ప్రత్యేక చట్టం ఉందా? అని ప్రశ్నించారు. ఈ పరిణామంతో సుప్రీంలో ఆర్నాబ్ బెయిల్ పిటిషన్ విచారణకు రావటం ఆలస్యమయ్యే అవకాశం ఉందంటున్నారు. నిత్యం చట్టం.. న్యాయం.. ధర్మం.. ఇలా నీతులు చెప్పే పెద్దమనిషి తన వరకు వచ్చేసరికి.. అందుకు భిన్నంగా వ్యవహరించటం.. ఆ విషయాలు బయటకు రావటం ఆర్నాబ్ కు ఏ మాత్రం మంచిది కాదన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News