బీజేపీ కొత్త ఫార్ములా...ఏపీ నేతలకు షాకేనా ?

బీజేపీ నాయకుల మధనం ఒక్కలా లేదు. వారు పదవుల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏపీలో ఉంది. పదవులు కూడా ఉన్నాయి.;

Update: 2026-04-23 01:30 GMT

బీజేపీ నాయకుల మధనం ఒక్కలా లేదు. వారు పదవుల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏపీలో ఉంది. పదవులు కూడా ఉన్నాయి. బీజేపీ వాటా మేరకు రావాల్సిన పదవులను జాగ్రత్తగా అడిగి తీసుకుంటే చాలా మంది సీనియర్లకు న్యాయం జరుగుంది కదా అని ఏపీ బీజేపీ నేతలు అంటున్నారు. అయితే బీజేపీ కేంద్ర పెద్దలు మాత్రం జాతీయ స్థాయి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచనలు చేస్తున్నారు. దాంతో తమకు ఎంపీ సీట్లు ఎక్కడ నుంచి అయినా వస్తే తీసుకుని వాటితో తమకు కావాల్సిన రాష్ట్రాల నేతలకు అందలం ఎక్కిస్తూ ఆ విధంగా వివిధ రాష్ట్రాలలో రాజకీయ వ్యూహాలను అమలు చేస్తున్నారు.

ఆశావహులు ఎందరో :

జూన్ నెలలో ఏపీలో నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. అందులో ఒకటి కచ్చితంగా బీజేపీకి కేటాయిస్తున్నారు. అయితే ఈ సీటు విషయంలో మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఎంతో ఆశతో ఉన్నారని అంటున్నారు. ఆయన బీజేపీలో చేరాక ఏ పదవీ దక్కలేదు. 2024 ఎన్నికల్లో రాజంపేట నుంచి పోటీ చేస్తే ఏంపీగా ఓటమి చూసారు. ఆ తరువాత గత రెండేళ్ళుగా ఆయనకు చాన్స్ దక్కడం లేదు. నిజానికి రాజంపేట నుంచి ఆయన గెలిచి ఉంటే ఈపాటికి కేంద్ర మంత్రి అయి ఉండేవారు. మరో వైపు రాజ్యసభ మెంబర్ కావాలని కిరణ్ కుమార్ రెడ్డి చూస్తున్నారు. దాని కోసం ఆయన ప్రయత్నాలలో ఆయన ఉన్నారు. అలాగే ఇదే రాయల సీమకు చెందిన సీనియర్ నేత విష్ణు వర్ధన్ రెడ్డి కూడా రాజ్యసభ కోసం ట్రై చేస్తున్నారు అని అంటున్నారు. విశాఖ జిల్లాలో స్థిరపడిన మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కూడా రాజ్యసభ ద్వారా మరోసారి పెద్దల సభలో అడుగుపెట్టాలని చూస్తున్నారు. ఇదే జాబితాలో అనేక మంది ఉన్నారని అంటున్నారు.

తమిళనాడు వైపు చూపు :

అయితే బీజేపీ కేంద్ర పెద్దలు మాత్రం ఇతర రాష్ట్రాలలో బీజేపీ ఎదుగుదల గురించి చూస్తున్నారు. అక్కడ పార్టీకి ఉన్న గట్టి నాయకులకు పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తే రేపటి రోజున ఆయా చోట్ల కమల వికాసం సాధ్యపడుతుందని భావిస్తున్నారు. తమిళనాడులో మాజీ పోలీస్ అధికారి అన్నామలై వచ్చాక బీజేపీని బాగా ముందుకు తీసుకెళ్ళారు. ఇపుడు కూడా బీజేపీ విజయం కోసం ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేస్తున్నారు. ఆయంకు ఏపీ కోటాలో రాజ్యసభ సీటు ఇవ్వాలని బీజేపీ పెద్దలు చూస్తున్నారు ఆ మీదట కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో ఆయనకు పదవి ఇవ్వడం ద్వారా తమిళనాడులో బలమైన నాయకత్వానికి అధికారం కూడా జత చేయాలని చూస్తున్నారు.

తెలంగాణాలో బీజేపీ మరింతగా :

ఏపీలో చూస్తే కూటమిలో బీజేపీ ఉంది. కూటమితో పోటీ చేయడం వల్ల బీజేపీకి దక్కాల్సిన ఎంపీలు వస్తాయి. పైగా కూటమి పార్టీల మద్దతు ఉంటుంది. వైసీపీ కూడా ఎన్డీయేకు పరోక్ష మద్దతుగా ఉంది. దాంతో పాటు ఏపీ నేతలు పార్టీని పరుగులెత్తించడంలో ఇతర రాష్ట్రాల కంటే వెనకబడి ఉన్నారని అంటున్నారు. దాంతో ఇక్కడ ఇచ్చిన పదవులు చాలు అని వేరే చోట్ల బీజేపీని అభివృద్ధి చేసుకోవడానికి ఈ పదవులు వాడుకోవాలని కేంద్ర పెద్దల వ్యూహంగా ఉంది అని అంటున్నారు. గడచిన రెండేళ్ళలో బీజేపీ తరఫున ఏపీ నుంచి ఒకరికి రాజ్యసభ ఇస్తే తెలంగాణా నుంచి బీసీ నేత క్రిష్ణయ్యకు ఇచ్చారు. ఎందుకంటే తెలంగాణాలో బీజేపీ మరింతగా ఎదగబోతోంది కాబట్టి. ఇదే ఫార్ములాను రానున్న రోజులలో బీజేపీ అనుసరిస్తుంది అని అంటున్నారు. అదే జరిగితే ఇక ఏపీ బీజేపీ నేతలకు పదవులు అందని పండేనా అంటే చూడాల్సిందే మరి.

Tags:    

Similar News