ఈపీఎఫ్ఓ కీలక అప్డేట్.. ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ మనీ విత్ డ్రా!

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ కీలక సంస్కరణలు చేపట్టింది. 'ఈపీఎఫ్ఓ 3.0' ప్రవేశపెట్టిన సంస్థ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేలా కీలక నిర్ణయం తీసుకుంది.;

Update: 2026-04-22 19:30 GMT

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ కీలక సంస్కరణలు చేపట్టింది. 'ఈపీఎఫ్ఓ 3.0' ప్రవేశపెట్టిన సంస్థ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త వ్యవస్థ ద్వారా ఉద్యోగి తన పీఎఫ్ ఖాతాను ఇకపై సాధారణ సేవింగ్స్ బ్యాంక్ ఖాతా మాదిరిగానే సులభంగా నిర్వహించుకునే సౌకర్యం ప్రవేశపెట్టింది. ఈ నూతన సంస్కరణల్లో భాగంగా యూపీఐ, ఏటీఎంల ద్వారా నేరుగా నగదు విత్ డ్రా చేసుకునే సౌకర్యం అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల పీఎఫ్ డబ్బుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు.

'ఈపీఎఫ్ఓ 3.0'లో తీసుకువచ్చిన సంస్కరణలతో ఇక నుంచి గూగుల్ పే, ఫోన్ పే వంటి యాప్‌లు, పీఎఫ్ ఏటీఎం కార్డుల ద్వారా తక్షణమే నగదు పొందే అవకాశం కలుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల నుంచి అందుబాటులోకి తెస్తున్న ఈ విధానాన్ని జూన్-జూలై నాటికి పూర్తిస్థాయిలో అమలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే ఉద్యోగుల పీఎఫ్ విత్ డ్రాలపై కొన్ని నిబంధనలను అమలు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. సభ్యులు తమ మొత్తం బ్యాలెన్స్‌లో గరిష్టంగా 75 శాతం వరకు మాత్రమే నిధులను అత్యవసర అవసరాల కోసం ఉపసంహరించుకోవచ్చనని ప్రభుత్వం వెల్లడించింది.

వైద్య ఖర్చుల, పిల్లల వివాహం, ఉన్నత చదువుల వంటి అత్యవసర ఖర్చులను చూపాల్సివుంటుందని చెబుతున్నారు. ఉద్యోగి పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత ఉండాలనే ఉద్దేశంతో కనీసం 25 శాతం నిధులను ఖాతాలోనే ఉంచాలని నిర్ణయించారని అంటున్నారు. ఈ లావాదేవీలకు భద్రత కల్పించేందుకు రోజువారీగా నిర్దిష్ట నగదు పరిమితులను విధించేలా నిబంధనలు రూపొందిస్తున్నట్లు చెబుతున్నారు.

కాగా, కొత్త విధానంలో సాంకేతికపరమైన మార్పుల విషయానికి వస్తే, ఆటో-సెటిల్‌మెంట్ పరిమితిని ప్రభుత్వం భారీగా పెంచింది. గతంలో లక్ష రూపాయల వరకు ఉన్న ఆటోమేటిక్ క్లెయిమ్ సెటిల్‌మెంట్‌ను ఇప్పుడు ఏకంగా 5 లక్షల రూపాయలకు పెంచారు. దీనివల్ల దాదాపు 95 శాతం క్లెయిమ్‌లు ఎటువంటి మానవ ప్రమేయం లేకుండా వేగంగా పూర్తవుతాయని వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాకుండా, పీఎఫ్ విత్ డ్రా కోసం కంపెనీ యజమానుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా స్వయంగా ఆధార్ ఓటీపీ ద్వారా ధృవీకరించుకునే వెసులుబాటు కల్పించారు. గతంలో ఉన్న అనేక రకాల ఉపసంహరణ వర్గాలను కూడా సరళీకరించి, కేవలం మూడు ప్రధాన విభాగాలుగా మార్చడం వల్ల దరఖాస్తు ప్రక్రియ మరింత సులభతరం కానుందని చెబుతున్నారు.

ఈ సదుపాయాలను పొందాలనుకునే సభ్యులు తమ ఖాతా విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి సభ్యుడి యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) యాక్టివేట్ అయి ఉండటంతోపాటు, అది ఖచ్చితంగా ఆధార్ కార్డుతో అనుసంధానమై ఉండాలని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. బ్యాంకు ఖాతా వివరాలు, ఐఎఫ్ఎస్‌సీ కోడ్, పాన్ కార్డు సమాచారం కేవైసీ (KYC) రూపంలో అప్‌డేట్ అయి ఉంటేనే ఎటువంటి ఆటంకాలు లేకుండా తక్షణ నగదు బదిలీ సాధ్యమవుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్ అందుబాటులో ఉండటం ద్వారానే ఈ డిజిటల్ సేవలన్నీ వేగంగా అందుతాయని చెబుతున్నారు.

Tags:    

Similar News