వాలంటీర్ల వ్యవస్థ వద్దు బాబోయ్ అనుకుంటున్నారా... ?

Update: 2021-12-28 02:31 GMT
ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ గత రెండున్నరేళ్లుగా సాగుతోంది. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక 2019 ఆగస్ట్ 15 నుంచి ఈ వ్యవస్థకు ప్రాణం పోశారు. ఒక విధంగా ఈ వ్యవస్థ జగన్ మానసపుత్రిక. ప్రతీ యాభై కుటుంబాలకు ఒక వాలంటీర్ ని ప్రభుత్వం నియీమించి వారికి ప్రభుత్వం నుంచి అందాల్సినవి అన్నీ చూసేందుకు దీన్ని వినియోగిస్తున్నారు. వీరికి అయిదు వేల రూపాయల గౌరవ వేతనాన్ని ఇస్తున్నారు. వీరిది సేవ మాత్రమే అని ఉద్యోగం కాదని ప్రభుత్వం చెబుతోంది. వారికి ఏటా సేవా అవార్డులను కూడా ప్రభుత్వం తరఫున ఇస్తున్నారు.

ఇక వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వం ఎప్పటికపుడు ప్రజల నుంచి డేటాను కలెక్ట్ చేస్తోంది. కరోనా వేళ వారిని ఉపయోగించి కరోనా వ్యాప్తిని అరికట్టగలిగామని ప్రభుత్వ పెద్దలు గట్టిగా చెప్పుకున్నారు. ఇక ఏ సర్వే చేయాలన్నా వాలంటీర్లనే ఉపయోగించుకుంటారు. సంక్షేమ పధకాలను వారి ద్వారానే అందచేస్తున్నారు. పెన్షన్లను కూడా ప్రతీ నెలా ప్రతీ గడపకూ వారితోనే ఇప్పిస్తున్నారు.

ఏపీలో రెండున్నరల లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు. ఒక విధంగా ప్రభుత్వానికి వీరు కళ్ళూ చెవులుగా ఉంటున్నారు. అయితే వాలంటీర్ల వ్యవస్థ మీద గతంలో టీడీపీ కామెంట్స్ చేసింది. వారిని రాజకీయాలకు వైసీపీ వాడుకుంటోందని కూడా విమర్శించింది. ఇక వారిలో కొందరు అవినీతికి కూడా పాల్పడుతున్నారు అన్న ఆరోపణలను కూడా విపక్షాలు చేస్తూ వచ్చాయి.

అయితే వాలంటీర్లను అడ్డం పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో మరో మారు జగన్ అధికారంలోకి వస్తామని ధీమాగా ఉన్నారని విపక్షాలు ఎద్దేవా చేస్తూంటాయి. వారి ద్వారా ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నారని కూడా అంటూ ఉంటారు. ఒక విధంగా వాలంటీర్ల వ్యవస్థ మీద విపక్షాలు గుర్రుగానే ఉన్నాయి. అయితే వాలంటీర్ల మీద జనాల్లో ఏ రకమైన అభిప్రాయం ఉందో ఎవరికీ తెలియదు. ఒక విధంగా వారి ద్వారానే పధకాలు అందుతున్నాయి కాబట్టి ఎవరూ బయటకు చెప్పలేరు కూడా. చెప్పినా ప్రభుత్వం నమ్మదు అన్నది తెలిసిందే.

ఇక వైసీపీకి చెందిన ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు అయితే వాలంటీర్ల వ్యవస్థ వల్ల ఏపీ ప్రజానీకం ఇబ్బందులు పడుతోంది అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేవలం అయిదు వేల రూపాయలతో బతికే వారు ఎవరుంటారని కూడా ఆయన కామెంట్స్ చేశారు. సరైన నియంత్రణ లేని వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలని జనం కోరుకుంటున్నారని కూడా చెప్పుకొచ్చారు.

వచ్చే ఎన్నికలో ఏ పార్టీ అయితే వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తామని చెప్పి జనాల్లోకి వెళ్తే ఆ పార్టీ బంపర్ మెజారిటీతో గెలిచి తీరుతుందని ఆయన అంటున్నారు. మరి ఇది జరిగే పనేలా. వాలంటీర్లు అంటే ఏకంగా రెండున్నర లక్షల‌ మంది ఉన్నారు. మరి వారి కుటుంబ సభ్యులను తీసుకున్నా కనీసం పది లక్షలకు తక్కువ కాకుండా ఓటు బ్యాంక్ ఉంది. రఘురామ క్రిష్ణం రాజు చెప్పినట్లుగా ఏ పార్టీ డేరింగ్ గా ఈ వ్యవస్థను రద్దు చేస్తామని చెప్పగలదు అన్నదే ప్రశ్న.

అయితే విపక్షాలకు వాలంటీర్ల వ్యవస్థ ఇష్టం లేకపోతే రేపటి రోజున అవి అధికారంలోకి వస్తే మాత్రం కచ్చితంగా తొలగించవచ్చు. అంతే తప్ప ఎన్నికల ముందే అలా చెబితే పుట్టె మునగడం ఖాయమనే విశ్లేషణలు ఉన్నాయి. కానీ రఘురామ మాంత్రం అలా చేసిన వారికే అధికారం అంటున్నారు. చూడాలి మరి ఏ పార్టీ ఈ రద్దు నినాదం అందుకుంటుందో. అసలు ఇంతకీ ప్రజలు ఈ వాలంటీర్ల వ్యవస్థ వద్దు బాబోయ్ అని అంటున్నారా. జవాబు ఎన్నికల వేళలోనే తెలుస్తుంది.

Tags:    

Similar News