ఎన్‌ పీఆర్‌ కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ !

Update: 2020-01-23 09:23 GMT
జాతీయ జనాభా పట్టిక-NPRకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. NPR విషయంలో ప్రజల్లో నెలకొన్న అపోహలు, అనుమానాలు తొలగించడానికి చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, జన గణన అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పౌరసత్వ సవరణ చట్టం, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ లపై ఇప్పటికే తన వైఖరిని స్పష్టం చేసిన ఏపీ ప్రభుత్వం.. ప్రస్తుతం NPRను అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

దీనిపై బుధవారమే ఉత్తర్వలు జారీ అయ్యాయి. సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో ఎన్పీఆర్‌ను అమలు చేయనుంది. ఈ ఆరు నెలల వ్యవధిలో ఎప్పుడైనా ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి వీలు కల్పించింది. జాతీయ పౌర నమోదు చేపట్టిన 45 రోజుల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుందని ఈ ఉత్తర్వుల్లో ప్రభుత్వం తెలిపింది.

అలాగే NPR ప్రాసెస్‌ లో జనగణన సిబ్బంది వ్యవహరించాల్సిన తీరు, సమాచారం సేకరించాల్సిన విధానాన్ని కూడా వివరించింది. NPR ప్రక్రియలో ప్రజలు ఎలాంటి డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ‌ప్రజలు ఇచ్చే వివరాలను మాత్రమే సిబ్బంది నమోదు చేస్తారని , భారతీయ పౌరసత్వాన్ని రుజువు చేయడానికి అవసరమైన డాక్యుమెంట్లను చూపించాల్సిన అవసరం లేదని, అలాగే తాము అడిగే ప్రశ్నలన్నింటికి సమాధానమిచ్చి తీరాలని ప్రజలను ఒత్తిడి చేయ వద్దని ప్రభుత్వం తెలిపింది. అదేవిధంగా ఇష్టంలేని ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన అవసరమూ లేదని సూచించింది. అలాంటి ప్రశ్నల కోసం ప్రజలను ఒత్తిడి కి గురి చేయొద్దని స్పష్టంగా ఆదేశించింది.

అయితే , ఈ సీఏఏకు వ్యతిరేకంగా కేరళ, పంజాబ్ ప్రభుత్వాలు ఏకంగా తీర్మానం చేశాయి. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు కూడా తీర్మానం చేయడానికి సిద్ధమయ్యాయి. ఎన్‌ పీఆర్, ఎన్‌ ఆర్‌ సీ విషయంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రతిపక్షాలు అభ్యంతరం తెలుపుతున్న నేపథ్యంలో, వైసీపీ సర్కారు ఆంధ్రప్రదేశ్‌ లో ఎన్‌ పీఆర్ అమలుకు చర్యలు చేపట్టడం ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News