గోదావరి బ్యాడ్ శంకుస్థాపనతో కొట్టుకుపోవాలి

Update: 2015-10-07 04:24 GMT
కష్టపడి కూడా ఫలితం దక్కకపోతే ఆ ఆవేదన చాలా ఎక్కువగా ఉంటుంది. దినం.. రాత్రి అన్న తేడా లేకుండా కష్టపడి కూడా.. అధికారుల నిర్లక్ష్యం.. వ్యూహరచనలో దొర్లిన తప్పులతో భారీ తొక్కిసలాట చోటు చేసుకోవటం పదుల సంఖ్యలో గోదావరి పుష్కరాలకు వచ్చిన భక్తజనం మరణించటం తెలిసిందే. రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన అతి పెద్ద కార్యక్రమం అయిన గోదావరి పుష్కరాల్ని బ్రహ్మాండంగా నిర్వహించి.. అందరి ప్రశంసలు పొందాలని ఏపీ ముఖ్యమంత్రి భావిస్తే.. అందుకు భిన్నంగా అంతులేని విషాదాన్ని సొంతం చేసుకోవటంతో పాటు.. చెరగని మరక ఆయన మీద పడింది.

సమర్థ పాలకుడిగా.. వ్యూహకర్తగా పేరున్న చంద్రబాబుకు.. గోదావరి పుష్కరాలు ఆయన ఇమేజ్ ను భారీగా డ్యామేజ్ చేశాయి. ప్రచారం కోసం బాబు పడిన కక్కుర్తి వల్లే పదుల సంఖ్యలో అమాయక ప్రజలు మరణించారు. దీనికి బాబు ప్రచారకాంక్షే కారణమన్న మరక పడిపోయింది. దీన్ని చెరిపేసుకునేందుకు గోదావరి పుష్కరాల సమయం అంతా రాజమండ్రిలోనే బస చేసి.. నిద్రాహారాలు మానేసి మరీ.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేసినా.. మొదటి రోజు మరక మాత్రం మాసిపోలేదు.

తాజాగా ఏపీ రాజధాని శంకుస్థాపన కార్యక్రమాన్ని నభుతో.. అన్న చందంగా నిర్వహించటంతో పాటు..గోదావరి పుష్కరాల్లో దొర్లిన తప్పులు చోటు చేసుకోకుండా ఉండటంతో పాటు.. ఇంతటి భారీ కార్యక్రమాల్ని నిర్వహించాలంటే బాబుకు మాత్రమే సాధ్యమన్న భావన కలిగించేలా చేయాలని బాబు అండ్ కో భావిస్తోంది. మొత్తంగా చెప్పాలంటే.. గోదావరి పుష్కరాల  సమయంలో వచ్చిపడ్డ చెడ్డపేరును శంకుస్థాపన కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహించటం ద్వారా.. ఎలాంటి తప్పులు దొర్లకుండా ప్రశాంతంగా.. అంగరంగ వైభవంగా చేపట్టటం ద్వారా.. తన ఇమేజ్ ను కొత్త కోణంలో ఆవిష్కరించాలన్న భావన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబులో చాలా ఎక్కువగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News