GHMC ప్రచారంలో పాల్గొననున్న అమిత్ షా

Update: 2020-11-25 10:10 GMT
జీహెచ్ ఎంసి రాజకీయ వేడి తారాస్థాయికి చేరుకుంది. అధికార టీఆర్‌ ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ ను పక్కకి నెట్టి గ్రేటర్‌ పోటీలో బీజేపీ రేసులోకి వచ్చింది. టీఆర్‌ ఎస్‌ నేతలకు ధీటుగా ఎత్తుకు పై ఎత్తులు వేస్తోంది. గ్రేటర్‌ పీఠమే లక్ష్యంగా బీజేపీ వ్యూహం పన్నుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా నేతలందరినీ మోహరించి భాగ్యనగర్‌ బస్తీల్లో జోరు పెంచుతోంది. అధికార పార్టీ నుంచి టీఆర్ ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నీ తానై వ్యవహరిస్తుండగా, గల్లీల్లో మంత్రులు తిష్టవేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సైతం సోమవారం జరిగిన మీడియా సమావేశం ద్వారా హైదరాబాద్‌ వాసులపై వరాల జల్లు కురిపించారు. ఇక తామేమీ తక్కువ కాదన్నట్లు బీజేపీ సైతం అగ్రనేతలను బరిలోకి దించుతోంది.

ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, డీకే అరుణ, రఘునందన్‌ రావుతో సహా రాష్ట్ర స్థాయి నేతలంతా హైదరాబాద్‌ లో తిష్టవేసి ఓటర్లను ఆకర్షించారు. పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అయితే , ఎలాగైనా గ్రేటర్ పీఠం పై కమలం జెండా ఎగురవేయాలని లక్ష్యం తో  జాతీయ స్థాయిలోని నేతలను రంగంలోకి దింపుతోంది బీజేపీ . కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌ షా, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌, జేపీ నడ్డాతో పాటు మరికొంతమంది నేతలు జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

ఈ మేరకు మంగళవారం అగ్ర నేతల పర్యటనను సంబంధిం షెడ్యూల్‌ విడుదల కానుంది. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎ‍న్డీయేను విజయతీరాలకు చేర్చిన భూపేంద్ర యాదవ్‌ ఇప్పటికే నేతలకు దిశానిర్ధేశం చేస్తున్నారు.బీజేపీకి చెందిన ఓ ముఖ్యనేత మాట్లాడుతూ, అగ్రశ్రేణి నేతలు ఇక్కడికి రావడం ద్వారా బీజేపీ ఇక్కడే ఉంటుందన్న బలమైన సందేశాన్ని ఓటర్లకు అందించాలన్నది తమ అభిమతమని చాటిచెప్పనున్నారు. దుబ్బాక విజయంతో మంచి దూకుడు మీద ఉన్న కమలదళానికి కారు పార్టీ ఏ విధంగా బ్రేకులు వేస్తోందో వేచి చూడాలి. కాగా 150 డివిజన్‌లు ఉన్న గ్రేటర్‌ జీహెచ్‌ఎంసీలో డిసెంబర్‌ 1న పోలింగ్‌ జరుగనుంది. 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.
Tags:    

Similar News