బాప్ రే అమెరికా అధ్యక్షుడి 100కోట్ల కారు.. ఫీచర్లు తెలిస్తే షాకే

Update: 2020-11-07 17:00 GMT
అమెరికా అధ్యక్షుడు మారిపోయే సమయం వచ్చింది. ఎన్నికల ట్రెండ్ ను బట్టి చూస్తే ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగిపోయి ప్రత్యర్థి జోబైడెన్ అమెరికా అధ్యక్షుడు అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడంటే ప్రపంచానికే పెద్దన్న. శక్తివంతమైన నేత. ఆయన కనుసన్నల్లోనే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యం, ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. ఈ క్రమంలోనే ఆయనకు ప్రత్యేక ఎయిర్స్ ఫోర్స్ వన్ విమానం.. అధ్యక్షుడు ప్రయాణించేందుకు ‘ది బీస్ట్’ అని పిలవబడే కారు ఉంటుంది.

‘ద బీస్ట్’ ప్రపంచంలోనే అత్యంత అత్యంత భద్రత, శత్రుదుర్భేధ్యమైన కారు ఇది. 1963లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ హత్య తర్వాత అధ్యక్షుడి భద్రత కోసం ఈ ‘బీస్ట్’కారును అమెరికా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తయారు చేసింది. ప్రస్తుతం ట్రంప్ వాడుతున్న కారు మోడల్ 2018 సెప్టెంబర్ 24న ఆయన కాన్వాయ్ లో చేరింది.

అమెరికా అధ్యక్షుడు ప్రయాణించేది అత్యాధునిక, అత్యంత భద్రమైన ‘బీస్ట్’ కారు. దాని పేరు బీస్ట్ తోపాటు కాడిలాక్ వన్, ఫస్ట్ కార్ అని కూడా అంటారు. అమెరికా అధ్యక్షుడి భద్రతలో ఇది సాటిలేనిదట..

ప్రపంచంలోనే హైఎండ్ టెక్నాలజీ భద్రత అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఈ బీస్ట్ కారులో ఉంటుంది. ఈ కారు డోర్స్ మందమే 8 అంగుళాలు ఉంటుందంటే నమ్మండి.. దీన్ని ఉక్కుతో తయారు చేస్తారు. శక్తివంతమైన బాంబు పేలుళ్లను సైతం ఈ డోర్స్ తట్టుకుంటాయట.. శత్రుదుర్భేధ్యమైన బుల్లెట్ ఫ్రూఫ్ టెక్నాలజీ గ్లాస్ తో ఈ కారును తయారు చేశారు.

ఈ కారును నడిపే డ్రైవర్ ను అమెరికా కేంద్ర నిఘా సంస్థ సీఐఏ ఎంపిక చేస్తుంది. సీక్రెట్ ఏజెంట్ మాత్రమే ఈ కారు డ్రైవర్ గా వ్యవహరిస్తాడు. మిగిలిన వారికి ఈ కారును కనీసం ముట్టుకోవడానికి కూడా అవకాశం ఇవ్వరు. రసాయన ఆయుధాలు కూడా ఈ బీస్ట్ తట్టుకోగలదు. బాంబులు పేలినా లోపలున్న ప్రెసిడెంట్ ట్రంప్ కు ఏమీ కాదు..

ఈ కారును అమెరికాలోని జనరల్ మోటార్స్ తయారు చేస్తుంది. ఇలాంటి మొత్తం 12 కార్లు ట్రంప్ కాన్వాయ్ లో ఉంటాయి. అమెరికా అధ్యక్షుడు ఎక్కడికి వెళ్లినా ఆయన వెంట బీస్ట్ కార్లు వెళతాయి. దీనికి ఖరీదు ఎంతనుకుంటున్నారు. అక్షరాల వంద కోట్ల రూపాయలు.8 టన్నుల బరువు ఉంటుంది. ఇంధన ట్యాంకు పేలకుండా భద్రత ఉంది. కారు కింద బాంబు పేలినా ఏమీ కాదు. కనీసం కుదుపు కూడా ఉండదు.

ఇక ఈ కారునుంచే ఎదుటివారిపై దాడి చేసేందుకు డ్రైవర్ సీటు పక్కనే డోర్ వద్ద అత్యాధునిక ఆయుధాలుంటాయి. బీస్ట్ కారు ముందు గ్రెనేడ్స్ కూడా ఉంటాయి. ఇలా అత్యంత భద్రత కలిగిన కారులో అమెరికా అధ్యక్షుడు ప్రయాణిస్తారన్నమాట.. ఏకంగా 100 కోట్ల రూపాయల కారంటే మాటలా? ఇప్పుడు కొత్త అధ్యక్షుడు జోబైడెన్ కోసం ఈ కారు కొనసాగిస్తారా? లేక ఇంకా కొత్త మోడల్ ను ప్రవేశపెడుతారా అన్నది చూడాలి.
Tags:    

Similar News