వాహనదారుల మీద చేయి చేసుకున్న ఎస్ఐను అడ్డుకున్న మాజీ ఐఏఎస్

Update: 2023-01-28 12:10 GMT
కాలం మారినా.. సామాన్యుడి బతుకు మాత్రం మారటం లేదు. అధికారం అన్నది బాధ్యతగా భావించే రోజులు అంతకంతకూ తగ్గిపోతున్నాయి. ఎవరికి వారు తమ చేతిలో ఉన్న అధికారాన్ని చూపించే విషయంలో.. జులుం ప్రదర్శించే విషయంలో చెలరేగిపోతున్నారు. తాజాగా అలా రెచ్చిపోయిన ఒక ఎస్ఐను మాజీ ఐఏఎస్ అధికారి అడ్డుకున్న వైనం.. దానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని భూపాలపల్లి ఎస్ఐ రామక్రిష్ణ రోడ్డు మీద వాహనదారుల తనిఖీ చేపట్టారు. ఇందులో భాగంగా పత్రాలు లేవన్న కారణాన్ని చూపించి.. వాహనదారుడి మీద చేయి చేసుకున్నాడు.

ఈ సందర్భంగా అటు వైపు వెళుతున్న మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి ఆగారు. విషయం తెలుసుకున్నారు. దీంతో.. తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. మనం ఏ కాలంలో ఉన్నామంటూ ఆయన మండిపడ్డారు.

ఆకునూరి మురళి విషయానికి వస్తే.. ఆయన గతంలో ఇదే జిల్లాకు కలెక్టర్ గా పని చేశారు. ఇటీవల ఆయన వీఆర్ఎస్ తీసుకొని తన ఐఏఎస్ ఉద్యోగాన్ని వదిలేశారు. ఎస్ఐ దుందుకు తీరును గుర్తించి ఆగిన ఆయన నిలదీయటంతో బాధితుడు.. చుట్టూ ఉన్న వారు జరిగిన విషయాన్ని ఆయనకు చెప్పారు. దీంతో.. ఎస్ఐను నిలదీయటంతో పాటు.. ఇది మంచిపద్దతి కాదని స్పష్టం చేశారు. వాహనాల తనిఖీ చేయటం డ్యూటీ కావొచ్చు కానీ.. సరైన పత్రాలు లేవని చేయి చేసుకోవటం ఏమిటని ప్రశ్నించారు.

తప్పు చేస్తే ఫైన్ వేయాలే తప్పించి.. చేయి ఎలా చేసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుడికి క్షమాపణలు చెప్పాలని ఆయన చెప్పినా.. మారు మాట్లాడకుండా సదరు ఎస్ఐ వాహనంలోకి ఎక్కే ప్రయత్నం చేశారు. అప్పటికి అడ్డుకునే ప్రయత్నం చేసినా సదరు మాజీ ఐఏఎస్ అధికారి నుంచి పక్కకు తప్పుకొని తన జీపులో వెళ్లిపోయారు.

దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓపక్క ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ చేస్తామని చెప్పే ఉన్నతాధికారులకు భిన్నంగా ఒక ఎస్ఐ తన జులుం చూపించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.Full View


Similar News