ప్రముఖ జ్యూయలరీ యజమాని ఫ్యామిలీకి తప్పిన పెను ప్రమాదం

Update: 2020-10-19 07:00 GMT
ప్రముఖల కుటుంబాల్లో చోటు చేసుకునే పరిణామాలు అనూహ్యంగా ఉంటాయి. తాజాగా అలాంటి ఉదంతమే తమిళనాడులో చోటు చేసుకుంది.  ఎస్వీఎన్ జ్యూయలరీ బ్రాండ్ తమిళనాడులో చాలా ఫేమస్. ఈ సంస్థ అధినేత శ్రీనివాస్.. ఆయన కుటుంబ సభ్యులు తాజాగా పెను ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. తాజాగా వారు.. శ్రీవారి దర్శనం కోసం చెన్నై నుంచి తిరుపతికి హెలికాప్టర్ లో బయలుదేరారు.

ఇద్దరు పైలెట్లు.. ఏడుగురు కుటుంబ సభ్యులతో కలిసి చెన్నై నుంచి బయలుదేరారు. ప్రతికూల వాతావరణం ఉండటంతో కుప్పం సరిహధ్దుల్లోకి వచ్చినంతనే హెలికాఫ్టర్ ముందుకు వెళ్లలేని పరిస్థితి. పొగమంచు దట్టంగా ఉండటంతో ముందు ఏమీ కనిపించని పరిస్థితి. దీంతో.. గాల్లో చక్కర్లు కొట్టిన హెలికాఫ్టర్ ను అత్యవసరంగా కిందకు దించేయాలని నిర్ణయించారు.

దీంతో.. ఎక్కడ ల్యాండ్ కావాలన్న దానిపై కాస్తంత టెన్షన్ నెలకొంది. చివరకు తిరుపత్తూరు జిల్లాలోని నంగిలి వద్ద పంట పొలాల్లో హెలికాఫ్టర్ క్షేమంగా ల్యాండ్ అయ్యింది. తమ ఊరి పోలాల్లో హెలికాఫ్టర్ ల్యాండ్ కావటంతో అక్కడి ప్రజలంతా పొలం వద్దకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకొని.. పరిస్థితిని సమీక్షించారు. కాసేపటికి వాతావరణం అనుకూలించటంతో మళ్లీ ప్రయాణమయ్యారు. ఏ చిన్న తేడా జరిగినా ఊహించలేనంత భారీ ప్రమాదం చోటు చేసుకునేదన్న  మాట వినిపిస్తోంది. త్రుటిలో తప్పిన ప్రమాదంతో సదరు జ్యూయలరీ  అధినేత కుటుంబం తీవ్రమైన షాక్ కు గురైనట్లు చెబుతున్నారు.
Tags:    

Similar News