ఆరోతరగతి ప్రేమికులు.. అందరికీ షాకిచ్చారు!

Update: 2016-07-30 07:28 GMT
సినిమాల ప్రభావమో లేక ఫాస్ట్ కల్చర్ ప్రభావమో.. అదీగాక సమాజం ఎక్కడికిపోతుందో తెలిపే సంకేతమో కానీ.. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక సంఘటన పిల్లల మనసులు స్కూల్లో చదువుతున్న రోజుల్లోనే ఎలా తయారవుతున్నాయో చెప్పకనే చెబుతుంది. చదువుకునే వయసు, తోటిపిల్లలతో ఆడుకునే సరదాలు మాని ప్రేమకు, ఆకర్షణకు కూడా తేడా తెలియని వయసులో ప్రేమలోకి దిగారు ఆరోతరగతి చదివే ఇద్దరు చిన్నారులు. ప్రేమించుకోవడమేనా, అబ్బే అది స్నేహమై ఉంటుందని అనుకుందామనుకుంటే.. అక్కడితో ఆగలేదు!

సినిమా ప్రేమకథలను బాగా ఫాలోఅయిన అనుభవమో ఏమో కానీ ఆ ఇద్దరు చిన్నారులూ "నీకు నేను, నాకు నువ్వు, ఒకరికొకరం నువ్వూ నేనూ" అని పాటలు కూడా పాడుకున్నారో ఏమో కానీ.. ఏకంగా స్కూల్ నుంచి తిరిగి ఇంటికి రాకుండా అటు నుంచి అటే వెళ్లిపోయారు (లేచిపోయారని అనుకోవచ్చు). అలా వెళ్లిన ఆ ఇద్దరు చిన్నారులు.. ఏకంగా ఒక అద్దె ఇళ్లు తీసుకోవాలని కూడా నిర్ణయించుకుని, తెగ వెతికారట! అయితే ఇద్దరూ స్కూలు యూనిఫాం, స్కూల్ బ్యాగ్ తో ఉండటంతో వారికి ఇళ్లు ఇవ్వడానికి ఎవరూ ముందుకి రాలేదు. తల్లితండ్రులకు ఫోన్ చేస్తారనో ఏమో కానీ.. తన మొబైల్ కూడా స్విచ్చాఫ్ చేశారు!

స్కూలుకి వెళ్లిన పిల్లలు ఇంటికి తిరిగి రాకపోవడంతో స్కూలుకి, బందువులందరికీ ఫోన్స్ చేసి కంగారయిన తల్లితండ్రులు.. చివరికి పోలీసులను ఆశ్రయించారు. ఫోన్ నెంబర్ ద్వారా లొకేషన్ ట్రేస్ చేద్దామన్నా కూడా.. మొబైల్ స్విచ్చాఫ్ లో ఉంది. అయితే అద్దె ఇల్లు వేటలో ఉన్న ఆ ప్రేమికులకు ఆ సమయంలో మిత్రుడు గుర్తొచ్చి.. అతడికి ఫోన్ చేయాలని మొబైల్ స్విచ్చాన్ చేశారు. ఇంకేముంది సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేసిన పోలీసులు పిల్లల ఆచూకీ కనిపెట్టి తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ఇంతకూ ఎందుకు పారిపోయారని ప్రస్తిస్తే.. ఒక రేంజ్ లో తమ ప్రేమకథను వివరించారట. గుజరాత్ లోని అహ్మబాద్ పరిధిలో ఉన్న నడియాడ్ లో ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ లవ్ స్టోరీ వైరల్ గా మారిపోయింది.
Tags:    

Similar News