వారికి 50 శాతం టికెట్లు సరే.. పోటీ చేసే అభ్యర్థులేరి మాణిక్యం?

Update: 2020-11-05 05:15 GMT
ఆశ పెద్దది.. పీక చిన్నదన్న సామెతను గుర్తు చేసేలా ఉంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారం. ఒకప్పుడు హైదరాబాద్ మహానగరంలో కాంగ్రెస్ పార్టీకున్న బలం అంతా ఇంతా కాదు. టీడీపీకి ధీటుగా కాంగ్రెస్ నేతలు పలువురు నగరంలో తమ అధిపత్యాన్ని ప్రదర్శించేవారు. కాలంతో పాటు.. బలాలు మారాయి. ఒకప్పుడు గ్రేటర్ లో కాంగ్రెస్ కు బలమైన నేతలు ఉన్నారన్న మాట నుంచి.. ప్రభావం చూపే నాయకులు ఉన్నారా? అన్న ప్రశ్న తలెత్తే పరిస్థితి. ఒకప్పుడు ముకేష్ గౌడ్.. అంజన్ కుమార్.. దానం నాగేందర్.. సుధీర్ రెడ్డి.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది నేతలే కనిపించేవారు.

ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితి. ఒక వీహెచ్.. అంజన్ కుమార్ యాదవ్ తప్పించి నేతలెవరూ కనిపించని పరిస్థితి. అంజన్ బలం తగ్గిపోగా.. వీహెచ్ కు సీనియర్ నేత అన్న ట్యాగే కానీ.. ప్రజాదరణ విషయంలో ఆయనకున్న బలం అంతంత మాత్రమే. గ్రేటర్ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ.. దుబ్బాక హ్యాంగోవర్ నుంచి బయటకు వచ్చిన కాంగ్రెస్.. రాబోయే ఎన్నికల్లో ఏం చేయాలనే అంశంపై కసరత్తు మొదలెట్టింది.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పరిశీలకుడు మాణిక్యం ఠాగూర్ అధ్వర్యంలో జరిగిన పార్టీలో సీనియర్ నేతలు పలువురు హాజరయ్యారు. జనాభా ఆధారంగా బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ల అమలు కోసం న్యాయపోరాటం చేస్తూ.. ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. అంతేకాదు.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ తరఫున బీసీలకు 50 శాతం టికెట్లు ఇవ్వాలన్న కాంగ్రెస్ కోర్ కమిటీ తీర్మానం చేసింది ఈ నిర్ణయం విన్నంతనే బాగానే ఉన్నా.. అసలు హైదరాబాద్ మహానగరంలో కాంగ్రెస్ పార్టీకి సరైన అభ్యర్థులు దొరికే పరిస్థితి ఉందా? అన్నది ప్రశ్న.

వినేందుకు బాగున్న బీసీలకు యాభై శాతం టికెట్ల అంశం.. ప్రాక్టికల్ గా పోటీ చేసే బలమైన అభ్యర్థులు ఉండాలిగా? అన్న మాటకు సమాధానం లభించని పరిస్థితి. ఎడాపెడా నిర్ణయాలు తీసుకోవటం బాగానే ఉన్నా.. వాటిని ఎఫెక్టివ్ గా అమలు చేసే అవకాశాలు ఎన్ని ఉన్నాయన్న విషయంపై సాపేక్షంగా వ్యవహరిస్తే తప్పించి.. సానుకూల ఫలితాలు రావన్న విషయాన్ని ఉత్తమ్ అండ్ కో ఎప్పటికి గుర్తిస్తుందో?
Tags:    

Similar News