ది గ్రేట్‌ రిసిగ్నిషన్‌ : ఒక్కనెలలో 43 లక్షల రాజీనామాలు...అల్లాడిపోతున్న కంపెనీలు!

Update: 2021-10-14 23:30 GMT
కరోనా మహమ్మారి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి మర్చిపోలేని ఓ చేదు జ్ఞాపకాన్ని అందించింది. కరోనా సమయంలో కుటుంబం యొక్క విలువులు , బంధుత్వాల గురించి అందరూ బాగా తెలుసుకున్నారు. డబ్బు లేకపోతే మన జీవితం ఎలా ఉంటుందో కరోనా చూపించింది. ఆయా సంస్థల్లో ఏళ్ల తరబడి నమ్మకంగా పని చేసినా కూడా కష్టకాలంలో యాజమాన్యాలు నిర్దాక్షిణ్యంగా వ్యవహరించడం వారి మనసును గాయపర్చింది. సుదీర్ఘమైన షిఫ్టులు.. లే ఆఫ్‌లు.. వేతన కోతలతో తమను కంపెనీలు ఎక్కువగా వాడుకుంటున్నాయన్న భావన ఉద్యోగుల్లో బలంగా నాటుకొంది. ఇప్పుడు కరోనా వ్యాప్తి తగ్గింది. వ్యాపారాలు పుంజుకున్నాయి. కంపెనీలు ఆకర్షణీయ వేతనాలు, ప్యాకేజీలు ఇస్తామన్నా ఉద్యోగులు ఉండటం లేదు.

రాజీనామా చేసి కొత్త మార్గం వెతుక్కునే పనిలో పడ్డారు. రాజీనామాలు చేయడానికి ఏమాత్రం భయపడటం లేదు. భవిష్యత్తును భద్రం చేసుకొనేందుకు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొంటున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా అగ్రదేశాల్లో ‘ది గ్రేట్‌ రెజిగ్నేషన్‌’ సంక్షోభం మొదలైంది. ఉన్నపళంగా మహిళలు, పురుషులు ఉద్యోగాలకు రాజీనామాలు చేస్తున్నారు. ఫలితంగా లేబర్ మార్కెట్లో ఉద్యోగులకు విపరీతంగా డిమాండ్‌ పెరిగింది. వస్తున్న వారికన్నా పోతున్న వారే ఎక్కువగా ఉండటంతో ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగిస్తుందని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. అమెరికా లో ఆగస్టులో దాదాపుగా 3 శాతం మంది ఉద్యోగాలను వదిలేశారు. సంఖ్యా పరంగా చెప్పాలంటే వెళ్లిపోయిన వారి సంఖ్య 43 లక్షలకు చేరుకుంది.

ఇక అదే నెలలో కరోనా మహమ్మారి కారణం చెప్పి లేఆఫ్‌లు ప్రకటించారు. అలా ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య 13 లక్షల వరకూ ఉంది. పురుషుల (4.4%)తో పోలిస్తే మహిళలు (5.5%) ఎక్కువగా రాజీనామా చేశారు.  నాలుగో తరం సేవా కంపెనీలపై గ్రేట్‌ రిసిగ్నిషన్‌ ప్రభావం ఎక్కువగా ఉంది. వినియోగదారులను డీల్‌ చేయడం, ఆస్పత్రుల్లో నర్సులుగా సేవలందించడం, చిన్నారులను చూసుకోవడం, రెస్టారెంట్లు, రిటైల్‌ ఇండస్ట్రీస్‌, పాఠశాలల్లో మహిళల అవసరం ఎంతైనా ఉంది. కరోనా కాలంలో వీరిలో చాలామంది ఇంటి వద్ద పిల్లలను చూసుకున్నారు. అటు పనులు చేశారు. కార్యాలయాల్లో శక్తికి మించి శ్రమించారు. దాదాపు రోజుకు 12 గంటలకు పైగా పనిచేశారు. పైగా వేతనాల్లో కోతలు, లేఆఫ్‌ల వంటివి వారిని వేధించాయి.

చాలా వరకు అలసిపోవడం, ఎక్కువ శ్రమించడం వల్లే రాజీనామాలు చేస్తున్నారు. త్వరలో కొవిడ్‌ పరిహారం ఆగిపోతుందని తెలిసినా లక్షల సంఖ్యలో ఉద్యోగాలను వదిలేయడంతో ఆర్థిక వ్యవస్థ నష్టపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది. వ్యాక్సినేషన్‌ పూర్తవుతుండటం, ఆర్థిక వ్యవస్థ తిరిగి తెరుచుకోవడంతో ఇప్పుడిప్పుడే ఉద్యోగులకు డిమాండ్‌ పెరుగుతోంది. అలాంటి సమయంలో మహిళలు, పురుషులు ఒక్కసారిగా రాజీనామాలు చేయడంతో కంపెనీలు విలవిల్లాడుతున్నాయి. 2020 ఫిబ్రవరితో పోలిస్తే ఇప్పటికీ 32 లక్షల మంది కార్మికులు తక్కువగా ఉన్నారు. దాంతో ఇప్పుడు ఉన్న ఉద్యోగులను కాపాడుకొనేందుకు కంపెనీలు అదనపు భత్యాలు, వేతనాలు ఇవ్వడం మొదలు పెట్టాయి. రాజీనామాలు చేసే వారిలో .. ఆస్పత్రులు, రెస్టారెంట్లు, చైల్డ్‌ కేర్‌ సెంటర్లలోని వారే ఎక్కువగా ఉన్నారు.
4

కొత్తగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇదే సరైన తరుణమని విశ్లేషకులు చెబుతున్నారు. కరోనాతో ఉపాధి కోల్పోయిన వారు ఇప్పుడు ప్రవేశించడం మంచిదని అంటున్నారు. కాగా ఉద్యోగాలు వదిలేస్తున్నవారు కొత్తగా ఎక్కడైనా చేరుతున్నారా అంటే లేదనే తెలుస్తోంది. ప్రభుత్వం వద్దనున్న సమాచారం దానినే సూచిస్తోంది. రాజీనామా చేసిన ప్రతి పది మందిలో నలుగురు రెస్టారెంట్లు, ఆతిథ్యం, రిటైల్‌ లొకేషన్‌ రంగాలకు చెందినవారే. అయితే ఇదే సమయంలో ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి ఇదో శుభపరిణామంగా చెప్పవచ్చు.
Tags:    

Similar News