వైసీపీ వర్సెస్ టీడీపీ ఎలక్షనీరింగ్ లో ఎవరిది పై చేయి ?

ఎన్నికలు అంటే ఎలక్షనీరింగ్ అనే చెప్పాలి. ఒక విధంగా సరైన సమయానికి పావులు కదపడం అన్న మాట.

Update: 2024-04-30 03:38 GMT

ఎన్నికలు అంటే ఎలక్షనీరింగ్ అనే చెప్పాలి. ఒక విధంగా సరైన సమయానికి పావులు కదపడం అన్న మాట. మీటింగులలో సవాళ్ళు ప్రతి సవాళ్ళూ జవాబులు ఇవి కాదు రాజకీయం, ఇంతకు మించి రాజకీయం ఉంటుంది. దానిని తట్టుకొని చేయాల్సి ఉంటుంది. తెర వెనక ముచ్చట్లు ఇలా చాలా ఉంటాయి.

ఏపీలో చూస్తే హోరా హోరీ పోరుకు తెర లేచింది. సమయం చూస్తే గట్టిగా పదమూడు రోజులు మాత్రమే ఉంది. ఎన్నికల్లో ప్రచారం చేసుకుంటూనే పోలింగ్ కోసం చేయాల్సింది చేయాలి. దాని కంటే ముందు చేర్చాల్సిన సామగ్రిని జాగ్రత్తగా చేర్చాలి.

ఏపీలో ఇపుడు చూస్తే అధికారంలో ఉన్న వైసీపీ ఈ విషయంలో దూకుడుగానే ఉంది అని అంటున్నారు. దానికి ఉదాహరణగా ఆ పార్టీకి చెందిన కొంత సామగ్రినే ఎన్నికల సంఘం సీజ్ చేసింది. అంటే ఇది ఎన్నో వంతు దొరకనిది ఎంత అన్న చర్చ కూడా సాగుతోంది.

ఇక వైసీపీ ప్రభుత్వ పెద్దలు అధికారానికి ఎంత దూరంగా ఉన్నారు. ఎంత దగ్గరగా ఉన్నారు అన్నది మరో ప్రశ్న. నిజానికి మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ వచ్చాక ముఖ్యమంత్రి అయితే కనీసంగా ఒక్క అఫీషియల్ ని కలవలేదు. ఒక సమీక్ష చేయలేదు అన్నది అంతా చూస్తున్నదే.

Read more!

ఒక వైపు మండే ఎండలు ఉన్నా ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా అది సామాజిక పెన్షన్ వివాదం అయినా మరేదైనా కూడా జగన్ అయితే సూచనలు కూడా చేయడం లేదు. నిజానికి విపక్షాలు సూచనలు చేసినపుడు ఆపద్ధర్మ ప్రభుత్వంగా కొంత యాక్టివ్ రోల్ ప్రదర్శించవచ్చు. కానీ ఎందుకో చేయడం లేదు. దానికి సజ్జల రామక్రిష్ణారెడ్డి చెప్పిన కారణం ఏంటి అంటే కోడ్ వచ్చాక ముఖ్యమంత్రి చాలా దూరంగా ఉంటున్నారు అని. ఆయన దైనందిన ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా దూరం పాటిస్తున్నారు అని.

అయితే విపక్షం మాత్రం ఆ విషయం నమ్మడం లేదు. ఇంకా వ్యవస్థలు జగన్ కనుసన్ననలోనే ఉన్నాయని అనుమానిస్తోంది. ఆరోపిస్తోంది. మరీ ముఖ్యంగా చూస్తే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, అలాగే డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డిలను బదిలీ చేయాలని చాలా కాలంగో డిమాండ్లు చేస్తోంది. ఏపీలో కోడ్ వచ్చాక కలెక్టర్లు బదిలీ అయ్యారు. సీనియర్ ఐపీఎస్ లు కీలక ప్లేస్ లలో ఉన్న వారు బదిలీ అయ్యారు. కానీ ప్రభుత్వం అంటే కళ్ళూ ముక్కూ చెవులు అనదగిన ఆ ఇద్దరూ బదిలీ మాత్రం జరగలేదు.

4

దీంతోనే విపక్ష శిబిరం అసహనం వ్యక్తం చేస్తోంది. వారిని తప్పించి ఆ ప్లేస్ లో వేరే వారిని నియమించాలని లేఖలు రాస్తూనే ఉంది. వారే కనుక ఆ పొజిషన్ లో ఉంటే ఇబ్బంది అవుతుందని కూడా అనుమానిస్తోంది. ఇక్కడే ఎలక్షనీరింగ్ అన్న మాట మరోసారి చెప్పుకోవాల్సి వస్తోంది. నిజంగా ఎలక్షనీరింగ్ విషయంలో పై చేయి సాధించేందుకు వైసీపీ తెర వెనక ఎత్తులు వ్యూహాలు వేస్తోందా అన్న చర్చ సాగుతోంది.

ఇప్పటికి చాలా కాలం అయినా విపక్షం డిమాండ్లు నెరవేరడం లేదు. దాంతో పోలింగ్ కి కౌంట్ డౌన్ అయిన వేళ ఇద్దరు ఉన్నతాధికారుల విషయంలో విపక్షం కోరుకున్నట్లుగా బదిలీలు లేకపోతే అపుడు ఏమిటి పరిస్థితి అన్న సందేహాలు వస్తున్నాయి. ఇప్పటికైతే బీజేపీ టీడీపీ కూటమిలో ఉన్నా వైసీపీకి ఇబ్బంది పడే విధమైన కార్యక్రమాలు అయితే ఏవీ జరగలేదు అని అంటున్నారు. ఇదే జోరులో వైసీపీ ముందుకు సాగితే పై చేయి సాధిస్తుందా అన్న చర్చ కూడా మొదలవుతోంది. మరి దీనికి జవాబు ఎవరు చెప్పాలి. ఎలా చెబుతారు, ఏమి జరగనుంది అన్నది మరి కొద్ది రోజులు చూస్తేనే కానీ తెలియదు అని అంటున్నారు.

Tags:    

Similar News