విజిటింగ్ కార్డులతో పిల్ల‌ల‌తో బిచ్చం ఎత్తిస్తున్నారు!

Update: 2018-08-07 05:05 GMT
హైద‌రాబాద్‌లో విస్మ‌య‌క‌ర వ్య‌వ‌హారం ఒక‌టి తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. ప్ర‌ఖ్యాత గోల్కొండ కోట‌లో 36 మంది అనాథ చిన్నారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంద‌రిని ప్ర‌భుత్వ స‌ద‌నానికి త‌ర‌లించారు. ఇంత మంది పిల్ల‌లు చేతిలో క‌ర‌ప‌త్రాలు.. విజిటింగ్ కార్డులు ప‌ట్టుకొని గోల్కొండ కోట‌లో క‌నిపించిన వారంద‌రిని తాము అనాథ‌ల‌మ‌ని.. త‌మ‌కు ఎవ‌రూ లేర‌ని.. అనాధ శ‌ర‌ణాల‌యంలో ఉంటున్నామ‌ని.. త‌మ‌కు సాయం చేయాలంటూ అడుక్కుంటున్న తీరు అనుమానాల‌కు తావిచ్చింది.

చేతిలో పాంప్లేట్స్‌.. విజిటింగ్ కార్డులతో క‌నిపించిన వారిని సాయం కోర‌టం.. వాటిల్లో బ్యాంకు అకౌంట్ వివ‌రాలు ఉండ‌టంపై అనుమానించిన గోల్కొండ కోట‌కు చెందిన అధికారులు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. వెంట‌నే రంగంలోకి దిగిన అధికారులు డ‌వ్ అర్బ‌న్ చిల్డ్ర‌న్ హోంకు చెందిన చిన్నారుల‌ను.. నిర్వాహ‌కుల‌ను అదుపులోకి తీసుకున్నారు.

షాకింగ్ అంశం ఏమిటంటే.. 36 మంది పిల్ల‌ల్ని వీధుల్లోకి తీసుకొచ్చి.. త‌మ‌ది ఎన్జీవోగా చెబుతున్న స‌ద‌రు సంస్థ ఆ విభాగంలో రిజిష్ట‌ర్ చేసుకోలేదు. అంతేనా.. అప్లై కూడా చేయ‌లేద‌న్న విష‌యం తెర‌పైకి వ‌చ్చింది.  చిన్నారుల చేత ఈ త‌ర‌హాలో డ‌బ్బులు ఎందుకు వ‌సూలు చేయిస్తున్నారు?  ఇలా వ‌సూలు చేసిన మొత్తాన్ని ఏం చేస్తున్నారు?  అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. రెండు మూడేళ్లుగా ఈ సంస్థ‌ను నిర్వ‌హిస్తున్నార‌ని స్థానికులు చెబుతున్నారు.

ఈ హోంను నిర్వ‌హిస్తున్న ఇస్ట‌ర్ రాణి.. ర‌మేష్.. ఆయాల‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు న‌మోదు చేశారు. పిల్ల‌ల్ని ఎక్క‌డ నుంచి తీసుకొచ్చార‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. పోలీసుల విచార‌ణ‌లో ఈ విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తాయ‌ని భావిస్తున్నారు.
Tags:    

Similar News