అమెరికా ఆసుపత్రిలో కాల్పుల కలకలం

Update: 2015-11-28 04:49 GMT
అమెరికాలో మరో హింసాత్మక ఘటన చోటు చేసుకుంది. భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం కొలరాడో రాష్ట్రంలోని కొలరాడో స్ప్రింగ్స్ పట్టణంలోని ఒక ఆసుపత్రిలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. సాయుధుడైన దుండగుడు ఒకరు ఆసుపత్రిలోకి ప్రవేశించి.. కాల్పులు జరపటం ఆందోళనకు గురి చేస్తుంది.

ఆసుపత్రిలోకి వెళ్లిన సాయుధుడు పలువురిపై కాల్పులు జరిపి.. కొందరిని బంధీలుగా పట్టుకున్నాడు. కాల్పుల కలకలానికి సంబంధించిన సమాచారాన్ని అందుకున్న పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ షురూ చేవారు. ఈ నేపథ్యంలో పోలీసులకు.. సాయుధుడికి మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మొత్తం ఇద్దరు చనిపోగా.. పది మంది వరకూ గాయపడ్డారు. గాయపడిన వారిలో నలుగురు పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. సాయుధుడికి సంబంధించిన సమాచారం బయటకు రాలేదు.

ఆసుపత్రిలో ఉన్న దుండగుడు దగ్గర పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు ఉన్నట్లుగా అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇదిలా ఉండగా.. సాయుధుడైన దుండగుడ్ని మూడు గంటల ప్రయత్నం అనంతరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆసుపత్రిలో కాల్పులు ఎందుకు జరిపినట్లన్న విషయంపై విచారణ మొదలైంది. సాయుధుడ్ని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. అగ్రరాజ్యంలో ఇలాంటి కాల్పుల ఘటన ఇప్పుడు కలకలాన్ని రేపుతోంది.
Tags:    

Similar News