ఏపీ టీడీపీ ఎమ్మెల్యే ఇంట్లో రూ.300 కోట్లు?

Update: 2016-09-30 14:08 GMT
ఒక ఎమ్మెల్యే ఇంట్లో రూ.300 కోట్లు. నమ్మలేకున్నా... ఇది నిజం. వందలాది కోట్లు పోగేసుకున్న వైనం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ప్రముఖ మీడియా సంస్థల్లో పెద్దగా ఫోకస్ కాని ఈ విషయానికి సంబంధించి వివరాలు ఆసక్తిని రేకెత్తిస్తోంది. అవినీతి మీద యుద్ధం చేస్తానని బడాయి కబుర్లు చెప్పిన బాబు పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఇంట్లోనే  ఇంత భారీ మొత్తంలో ఆక్రమ సంపాదన బయటకు రావటం హాట్ టాపిక్ గామారింది. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు? బ్లాక్ మనీకి సంబంధించిన ఈ పాపం ఎలా బయటకు వచ్చిందన్న విషయాల్లోకి వెళితే..

టీడీపీ నేత.. చిత్తూరు ఎమ్మెల్యే డీకే సత్యప్రభ (దివంగత ఆదికేశవుల నాయుడు సతీమణి) కు సంబంధించిన సంస్థలపై ఐటీ అధికారులు దాడి చేశారు. చిత్తూరు.. బెంగళూరుతో సహా దేశంలోని పలు ప్రాంతాల్లో ఆమెకున్న విద్యా.. ఇతర సంస్థలపై ఐటీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమెకు చెందిన రూ.300 కోట్ల మేర పన్ను చెల్లించని ఆస్తుల్ని గుర్తించినట్లుగా చెబుతున్నారు. ఈ వ్యవహారం ఏపీ రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది. ఇటీవల కాలంలో ఏపీ అధికారపక్షానికి చెందిన నేతలకు సంబంధించిన యవ్వారలు ఒక్కొక్కటిగా బయటపడుతున్న వేళ.. తాజాగా వందల కోట్ల రూపాయిలు ఒక్క ఎమ్మెల్యే దగ్గర బయట పడటం షాకింగ్ గా మారింది.

బెంగళూరుకు చెందిన ఐటీ అధికారులు ఈ దాడులకు పాల్పడ్డారు. బెంగళూరుకు చెందిన వైదేహి.. మాల్యా ఆసుపత్రుల్లో దాడులు చేశారు. దాదాపు రూ.265 కోట్ల ఆస్తులకు సంబంధించిన సరైన ఆధారాలు చూపించకపోవటంతో వాటిని సీజ్ చేసిన అధికారులు.. ఎమ్మెల్యేకు చెందిన విద్యా సంస్థల్లో దాదాపు రూ.43 కోట్ల మేర నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. స్వచ్ఛంద కార్యక్రమాల కోసం ఎమ్మెల్యేకు సంబంధించిన కొన్నిఎన్జీవోలు పెద్ద మొత్తంలో విరాళాలు సేకరించటం.. ఆమెకు సంబంధం లేని సంస్థల నుంచి సైతం పలు పత్రాల్ని స్వాధీనం చేసుకోవటం గమనార్హం.

ఓపక్క నల్లధనాన్ని తెలుపు చేసుకునేందుకు కేంద్రం ప్రత్యేక పథకాన్ని ప్రవేశ పెట్టి పెద్ద ఎత్తున ప్రచారం చేయటం.. ఈ రోజు (శుక్రవారం) అర్థరాత్రి పన్నెండు గంటల వరకూ అవకాశం ఉన్నప్పటికీ.. నల్లధన స్వాముల్లో పెద్దగా చలనం లేదన్న ఉదంతాన్ని చూస్తే అనిపించకమానదు. అవినీతి మీద యుద్ధం చేస్తానని చెప్పే చంద్రబాబు.. ఈ ఉదంతంపై ఏం సమాధానం చెబుతారో..?


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News