వైరల్... ట్రంప్ కు షాకిచ్చేలా భారత సంతతికి చెందిన సీఈఓ కామెంట్స్!

ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వలసదారులపై ఆంక్షలు, ఆరోపణలు, అవమానాలు పెరుగుతున్న సంగతి తెలిసిందే! దీనిపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి!;

Update: 2025-11-16 05:47 GMT

ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వలసదారులపై ఆంక్షలు, ఆరోపణలు, అవమానాలు పెరుగుతున్న సంగతి తెలిసిందే! దీనిపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి! ఈ సమయంలో తనకు జరిగిన అవమానంపై స్పందించిన భారత సంతతికి చెందిన సీఈఓ.. రాబోయే అమెరికా ఎన్నికల్లో అయినా తాజా పరిస్థితులకు భిన్నంగా సానుకూల మార్పు తీసుకొస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

అవును... వలసదారులనూ లక్ష్యంగా చేసుకుని భయంతో నడిచే రాజకీయాలు పెరుగుతున్నాయని.. అమెరికా ఇప్పుడు సంక్లిష్టంగా, సంకుచితంగా మారుతోందని.. నిజమైన పరిష్కారాలను అందించే బదులు, వలసదారులని నిందించే నాయకులతో నడపబడుతుందని ఆరోపిస్తూ.. అమెరికాలో పెరుగుతున్న విదేశీయుల పట్ల విరక్తి గురించి ఆందోళన వ్యక్తం చేశారు మైండ్ వాలీ సీఈఓ విషేన్ లఖియాని.

వివరాళ్లోకి వెళ్తే... అసాధారణ సామర్థ్యం ఉన్న వ్యక్తులకు ఇచ్చే O-1 వీసా ఉన్నప్పటికీ, తనను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్.బీ.ఐ) అధికారులు అమెరికా విమానాశ్రయంలో ఆపేశారని ఆరోపించారు మైండ్ వాలీ సీఈఓ విషేన్ లఖియాని. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన వివరణాత్మక వివరణను ఇన్ స్టా గ్రామ్ పోస్టులో వెల్లడించారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

మలేషియాలో జన్మించిన, భారత సంతతికి చెందిన విషేన్ లఖియాని... తాను చాలా కాలంగా ఆరాధించే దేశాన్ని సందర్శించడం తనకు తాజా సంఘటనతో భయం కలిగించిందని అన్నారు. ఈ సందర్భంగా... రెండు దశాబ్ధాలకు పైగా తాను అమెరికా ఆర్ధిక వ్యవస్థకు తోడ్పడుతున్నానని.. 22 ఏళ్లుగా అమెరికాలో పన్నులు చెల్లిస్తున్నానని.. వరల్డ్ వైడ్ 230 మంది ఉద్యోగులతో కంపెనీ నడుపుతున్నానని తెలిపారు.

వైరల్ అయిన వ్యాఖ్యలు!:

ఈ విధంగా అమెరికాలో వలసదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వెల్లడిస్తూ, అక్కడున్న రాజకీయాలను ఎండగడుతూ విషేన్ లఖియానీ చేసిన వ్యాఖ్యలు ఆన్ లైన్ లో విస్తృతంగా ప్రతిధ్వనించాయి. ఈ సందర్భంగా... వలస విధానాలు, ఎయిర్ పోర్ట్ లో స్క్రీనింగ్ లు, తాజా రాజకీయ వాతావరణం గురించి చర్చకు దారి తీశాయి. ఈ సందర్భంగా నెటిజన్లు వారి వారి అనుభవాలను పంచుకుంటున్నారు.

ఎవరీ విషేన్ లఖియాని?:

వ్యక్తిగత అభివృద్ధి, ఆన్ లైన్ లెర్నింగ్ ప్లాట్ ఫామ్ అయిన మైండ్ వాలీ వ్యవస్థాపకుడు, సీఈఓ విషేన్ లఖియాని. ఆయన.. "ది కోడ్ ఆఫ్ ది ఎక్స్ ట్రార్డినరీ మైండ్", "ది బుద్ద అండ్ ది బదాస్" అనే రెండు పుస్తకాలు రాశారు. ప్రభావవంతమైన ప్రసంగాలకు పేరుగాంచిన ఆయన.. విద్య, కార్యాలయ సంస్కృతి, రాజకీయాలు మొదలైన వాటికి సంబంధించిన అంశాలకు ఎక్కువగా ప్రస్తావిస్తారు.

ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ట్రంప్ సర్కార్ కు షాకిచ్చేలా ఉన్నాయని.. రాబోయే అమెరికా ఎన్నికల్లో అయినా తాజా పరిస్థితులకు భిన్నంగా సానుకూల మార్పు తీసుకొస్తాయని ఆశాభావం వ్యక్తం చేయడం కచ్చితంగా షాకిచ్చే విమర్శే అని అంటున్నారు పరిశీలకులు. ఈ కామెంట్స్ ట్రంప్ శత్రువులకు ఓ ఆయుధం అని నొక్కి చెబుతున్నారు.

Tags:    

Similar News