గ్రీన్‌కార్డు ఇంటర్వ్యూల పేరుతో అరెస్టులు: అమెరికాలో వలసదారుల్లో తీవ్ర ఆందోళన!
ఈ అరెస్టుల వ్యవహారం ముఖ్యంగా శాన్‌డియాగోలోని USCIS (యూఎస్ సిటిజన్ షిప్ మరియు ఇమిగ్రేషన్ సర్వీసెస్) కార్యాలయంలో చోటుచేసుకున్న ఘటనలతో బయటపడింది.;
అమెరికా శాశ్వత నివాస హక్కు అయిన గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది వలసదారులలో ఇటీవల అమెరికాలో వెలుగులోకి వచ్చిన ఒక సంచలన అంశం తీవ్ర భయాందోళనలకు దారితీసింది. గ్రీన్‌కార్డు ఇంటర్వ్యూలకు పిలిచి, అక్కడికెళ్లిన అభ్యర్థులను అరెస్టు చేస్తున్నట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ పరిణామం వీసా గడువు ముగిసిన (ఓవర్‌స్టే) వలసదారులకు పెద్ద హెచ్చరికగా మారింది.
శాన్‌డియాగో USCIS కార్యాలయంలో షాకింగ్ ఘటన
ఈ అరెస్టుల వ్యవహారం ముఖ్యంగా శాన్‌డియాగోలోని USCIS (యూఎస్ సిటిజన్ షిప్ మరియు ఇమిగ్రేషన్ సర్వీసెస్) కార్యాలయంలో చోటుచేసుకున్న ఘటనలతో బయటపడింది. గ్రీన్‌కార్డు ఇంటర్వ్యూకు వచ్చిన ఒక అభ్యర్థిని, అతని అమెరికన్ భాగస్వామిని సైతం అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ కేసులను హ్యాండిల్ చేస్తున్న ఇమ్మిగ్రేషన్ న్యాయవాది సమన్ నస్సేరి మాట్లాడుతూ వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అమెరికాలోనే ఉండిపోయినవారిని (ఓవర్‌స్టే) USCIS కార్యాలయాల్లోనే లక్ష్యంగా చేసుకుంటున్నారని తెలిపారు. ఎక్కువగా అమెరికా పౌరులను వివాహం చేసుకున్నవారే ఈ అరెస్టులకు గురవుతున్నారని, వీరికి ఎలాంటి క్రిమినల్ చరిత్ర కూడా లేదని నస్సేరి వెల్లడించారు. తాజాగా గత వారం రోజుల్లోనే తన ఐదుగురు క్లయింట్లను ఇంటర్వ్యూకి పిలిచి అరెస్టు చేశారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అడ్జస్ట్ మెంట్ ఆఫ్ స్టేటస్ ఇంటర్వ్యూ కోసమే వెళ్లిన వారికి ఇంటర్వ్యూ బదులు అరెస్టు ఎదురైంది.
ఇతర న్యాయవాదుల నుండి ధృవీకరణ
మరొక ఇమ్మిగ్రేషన్ న్యాయవాది హబీబ్ హస్బినీ కూడా ఇలాంటి కేసులు అనేకం వస్తున్నాయని ధృవీకరించారు. ప్రత్యేకంగా శాన్‌డియాగో USCIS కార్యాలయం నుంచే తరచూ నిర్బంధాలు జరుగుతున్నాయని, ఇంటర్వ్యూల కోసం వెళ్లిన అభ్యర్థులను ICE (ఇమిగ్రేషన్ మరియు కస్టమ్స్ ఎన్ఫోర్స్ మెంట్ ) అధికారులు హోల్డ్‌లో ఉంచిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు.
ICE స్పందన: "ఇది చట్టబద్ధం"
ఈ అరెస్టులపై ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సంస్థ స్పందించింది. ఐసీఈ ప్రతినిధి మాట్లాడుతూ అమెరికా భద్రత, సరిహద్దు రక్షణ కోసం చట్టవిరుద్ధంగా ఉన్నవాళ్లను అరెస్టు చేయడం తమ విధి అని స్పష్టం చేశారు. "ఇమిగ్రేషన్ చట్టం ప్రకారం, అమెరికాలో అక్రమంగా ఉన్నవారిపై చర్య తీసుకోవడం సహజమే" అని వివరించారు. ఈ అరెస్టులు చట్టబద్ధమైనవే అని ఐసీఈ తేల్చి చెప్పింది.
గ్రీన్‌కార్డు ఇంటర్వ్యూలకు వెళ్లేవారికి సూచనలు
న్యాయవాదులు ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై వలసదారులను హెచ్చరిస్తున్నారు. మీ వీసా గడువు ముగిసింది అంటే, ఇంటర్వ్యూకి వెళ్లే ముందు తప్పనిసరిగా ఇమ్మిగ్రేషన్ లాయర్‌ను సంప్రదించాలి. మీ కేసు సేఫ్ కేటగిరీలో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఫుల్ డాక్యుమెంటేషన్ సిద్ధంగా ఉంచాలి. అవసరమైతే ఇంటర్వ్యూకు నేరుగా అటార్నీతో కలిసి వెళ్లడం మంచిదని సలహా ఇస్తున్నారు.
భవిష్యత్తుపై ప్రశ్నార్థకం
గతంలో వీసా గడువు ముగిసినా అమెరికా పౌరుడిని వివాహం చేసుకున్నవారికి కొంతవరకు ఉపశమనం లభించేది. ఇంటర్వ్యూలో అరెస్టు లాంటి చర్యలు అరుదుగా ఉండేవి. కానీ ఇమ్మిగ్రేషన్ చట్టాల అమలు కఠినతరం అవుతున్న ఈ నేపథ్యంలో ఈ సిరీస్ అరెస్టులు భవిష్యత్తులో ఇమ్మిగ్రేషన్ ప్రక్రియపై కొత్త ఆందోళనలకు దారితీశాయి. USCIS , ICE నుండి ఈ వివాదంపై మరింత స్పష్టత వచ్చే వరకు, వీసా గడువు ముగిసినవారు గ్రీన్‌కార్డు ఇంటర్వ్యూలకు వెళ్లే ముందు రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.