టెక్సాస్ లో భారతీయుడి హత్య.. ట్రంప్ సంచలన నిర్ణయం

టెక్సాస్‌లోని డల్లాస్‌లో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి చందర్ నాగమల్లయ్య (41) దారుణ హత్యకు గురవడం అమెరికాలో కలకలం సృష్టించింది.;

Update: 2025-09-13 06:22 GMT

టెక్సాస్‌లోని డల్లాస్‌లో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి చందర్ నాగమల్లయ్య (41) దారుణ హత్యకు గురవడం అమెరికాలో కలకలం సృష్టించింది. ఒక హోటల్‌లో పనిచేస్తున్న నాగమల్లయ్యను క్యూబాకు చెందిన అక్రమ వలసదారుడు యోర్డానిస్ కోబోస్-మార్టినెజ్ (37) అతి క్రూరంగా తలనరికి చంపాడు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ట్రంప్ ప్రభుత్వం, నిందితుడిని అమెరికా నుంచి బహిష్కరించేందుకు చర్యలు ప్రారంభించినట్టు ప్రకటించింది. ఈ దారుణం అమెరికాలోని వలస విధానాలపై, ముఖ్యంగా భారతీయ సమాజం భద్రతపై కొత్త చర్చకు దారితీసింది.

*దారుణ ఘటన వివరాలు

సెప్టెంబర్ 10న, డల్లాస్‌లోని ఒక హోటల్‌లో నాగమల్లయ్య, అతని సహోద్యోగి మార్టినెజ్‌ మధ్య వాషింగ్ మెషీన్‌కు సంబంధించిన చిన్నపాటి గొడవ జరిగింది. ఈ గొడవ చిలికి చిలికి గాలివానలా మారి, మార్టినెజ్‌ కత్తితో నాగమల్లయ్యపై దాడి చేశాడు. నాగమల్లయ్య తన ప్రాణాలను కాపాడుకోవడానికి పరుగెత్తినా, మార్టినెజ్‌ అతడిని వెంటాడి దారుణంగా తలనరికాడు. ఈ క్రూరమైన చర్యను బాధితుడి భార్య, కుమారుడు కళ్లారా చూశారు. అంతేకాకుండా నిందితుడు నరికిన తలను ఫుట్‌బాల్‌లా తన్ని, తర్వాత చెత్తబుట్టలో పడేశాడు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో అమెరికా అంతటా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.

*నిందితుడి క్రిమినల్ చరిత్ర & రాజకీయ వివాదం

అధికారుల నివేదిక ప్రకారం, నిందితుడు మార్టినెజ్‌కు ఇప్పటికే పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. బాలలపై లైంగిక దాడి, వాహన దొంగతనం, కిడ్నాపింగ్ వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇంతటి నేరచరిత్ర ఉన్నప్పటికీ, 2025 జనవరి 13న బైడెన్ ప్రభుత్వ హయాంలో ICE (ఇమిగ్రేషన్ మరియు కస్టమ్స్ ఎన్ఫోర్స్ మెంట్ ) కస్టడీ నుంచి అతడు విడుదలయ్యాడు.

ఈ ఘటనపై రాజకీయ వాదనలు తీవ్రమయ్యాయి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (DHS) అసిస్టెంట్ సెక్రటరీ ట్రిషియా మెక్‌లాఫ్లి, “బైడెన్ ప్రభుత్వం ఈ అక్రమ వలసదారుడిని విడిచిపెట్టకపోయి ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదు” అని విమర్శించారు. కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా కూడా ఈ ఘటనను ఖండిస్తూ, ఇలాంటి నేరచరిత్ర ఉన్న వ్యక్తి అమెరికాలో స్వేచ్ఛగా తిరగడం అనవసరం అని వ్యాఖ్యానించారు.

*ట్రంప్ ప్రభుత్వం కఠిన నిర్ణయం

ఈ ఘటనపై స్పందించిన ట్రంప్ ప్రభుత్వం, వలస విధానాలను కఠినతరం చేయాలని నిర్ణయించుకుంది. నిందితుడు మార్టినెజ్‌ను వెంటనే దేశం నుంచి బహిష్కరించేందుకు చర్యలు ప్రారంభించినట్లు ICE ప్రకటించింది. ప్రస్తుతం అతను డల్లాస్ కౌంటీ జైలులో ఉన్నాడు. అయితే, క్యూబా ప్రభుత్వం అతడిని తిరిగి తీసుకోవడానికి నిరాకరించిన నేపథ్యంలో ఈ నిర్ణయం ఎలా అమలవుతుందనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఈ దారుణం భారతీయ వలసదారులలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలో తమ భద్రతకు సంబంధించి పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News