ఫ్యాక్ట్ చెక్: అమెరికాలో తెలుగు విద్యార్థినుల 'హనీ ట్రాప్'... అసలు నిజం ఇదీ
ఈ ఆరోపణలు తీవ్రమైనప్పటికీ, నిర్వహించిన వివరణాత్మక పరిశోధనలో ఇవి పూర్తిగా నిరాధారమైనవిగా తేలాయి.;
అమెరికాలో చదువుతున్న భారతీయ, ముఖ్యంగా తెలుగు మహిళా విద్యార్థినులు ధనిక ప్రవాస భారతీయులను (ఎన్ఆర్ఐలను) 'హనీ ట్రాప్' చేస్తున్నారంటూ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియో సంచలనం సృష్టించింది. ఈ ఆరోపణలు తీవ్రమైనప్పటికీ, నిర్వహించిన వివరణాత్మక పరిశోధనలో ఇవి పూర్తిగా నిరాధారమైనవిగా తేలాయి.
సాక్ష్యాలు లేని ఆరోపణలు
వైరల్ వీడియోలో క్రియేటర్ చేసిన ప్రధాన ఆరోపణలు ఏంటంటే.. విద్యార్థినులు ఇళ్లలో హెల్పర్లుగా చేరి డబ్బు, బంగారం దొంగతనం చేస్తున్నారు. వ్యక్తిగత సమాచారం సేకరించి, బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. ఈ అక్రమ సంపాదనతో ఇళ్లు కొనుగోలు చేస్తున్నారు. ఈ ఆరోపణలను నిర్ధారించడానికి అమెరికాలోని ఏ రాష్ట్రంలోనూ, వీడియోలో పేర్కొన్న ఓహియో లేదా డల్లాస్ వంటి ప్రాంతాల్లోనూ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక రికార్డులు లభించలేదు. దీనిపై ఎటువంటి పోలీసు కేసులు లేవు.కంప్లైంట్లు లేవు. లీగల్ రికార్డులు లేవు. పోలీస్ రికార్డులు, న్యాయస్థానాల దస్తావేజులలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో ఈ వీడియో సాధారణ వార్త కంటే కేవలం సంచలనాత్మక కథనంగా మాత్రమే కనిపిస్తోంది.
ఎన్ఆర్ఐల స్పందనల్లో వాస్తవం
ఈ ఆరోపణలపై అమెరికన్ ఎన్ఆర్ఐలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు కూడా వీడియో యొక్క విశ్వసనీయతను ప్రశ్నిస్తున్నాయి. క్రియేటర్ దృష్టిని ఆకర్షించడానికి, వ్యూస్ పెంచుకోవడానికి చేసిన ప్రయత్నంగా దీన్ని చూస్తున్నారు. అమెరికాలో ఇలాంటి తీవ్రమైన కేసులు దాచబడవు. స్టూడెంట్ హనీ ట్రాప్/దొంగతనం కేసులు నమోదు కావడం కనిపించలేదు. విద్యార్థులు కష్టపడేవారు. వీడియో క్రియేటర్‌కు విద్యార్థుల పట్ల ఏదో అసంతృప్తి ఉన్నట్టుగా భావిస్తున్నారు.
ఆరోపణలు నిరాధారాలు
సమగ్ర పరిశీలన, అధికారిక రికార్డుల శోధన , ప్రవాస భారతీయుల అభిప్రాయాల ఆధారంగా అమెరికాలో చదువుతున్న తెలుగు/భారతీయ మహిళా విద్యార్థులు 'హనీ ట్రాప్'కు పాల్పడుతున్నారన్న వైరల్ వీడియో ఆరోపణలు కేవలం ఫేక్ క్లెయిమ్స్, నిరాధారాలు, అతిశయోక్తిపూరిత ప్రచారంగా స్పష్టమవుతోంది.
ఈ రకమైన నిరూపణ లేని వాదనలు ప్రజల్లో అనవసర అపోహలు, భయాలు, మహిళా విద్యార్థులపై ప్రతికూల భావాలు కలిగించేందుకు ఉద్దేశించినవిగా కనిపిస్తున్నాయి. ఇటువంటి సంచలనాత్మక ప్రచారాలను నమ్మవద్దని, వాస్తవాలను ధృవీకరించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.