ఏమిటీ ఓపీటీ? యూఎస్ లో 3 లక్షల మంది మనోళ్లకు నిద్ర పోనివ్వని ఓటీపీ
అగ్రరాజ్యం అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు.;
అగ్రరాజ్యం అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు. అమెరికాను నంబర్ వన్ లో నిలపటమే తన లక్ష్యంగా పేరుకునే ఆయన.. ఎడాపెడా నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచ దేశాలకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. అదే పనిగా నోటికి.. చేతికి పని చెబుతూ ఎవరికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. ట్రంప్ తాజా విధానాల నేపథ్యంలో అమెరికాలో ఉన్న విదేశీయులకు దినదిన గండగా పరిస్థితులు ఉంటున్నాయి.
అమెరికాలో ఉన్నత విద్య పూర్తైన తర్వాత మూడేళ్లు అక్కడే ఉండి.. ఉద్యోగం వెతుక్కునేందుకు.. పని చేసుకునేందుకుఇచ్చే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ను సింఫుల్ గా చెప్పాలంటే ‘ఓటీపీ’గా వ్యవహరిస్తారు. అయితే.. ఈ ఓటీపీ అనుమతిని రద్దు చేసేందుకు వీలుగా ట్రంప్ సర్కారు సమాలోచనలు చేస్తుంది. అదే జరిగితే.. అమెరికాలోని మూడు లక్షల మంది భారతీయులు ఎఫెక్టు అవుతారని చెబుతున్నారు. ఓటీపీని రద్దు చేసేందుకు వీలుగా బిల్లును తీసుకురావాలని భావిస్తున్నారు.
ఈ నిర్ణయంతో.. అమెరికాలోని విదేశీ విద్యార్థులకు నిద్ర లేకుండా చేస్తోంది. అంతేకాదు.. ఉద్యోగం సాధించి హెచ్ 1బీ వీసాల మీద ఉన్న వారు ప్రశాంతంగా లేకుండా వీసా విధానాల్ని కఠినతరం చేశారు. వీటికి తోడు శాశ్విత పౌరసత్వాన్ని ఇచ్చే గ్రీన్ కార్డులున్న వారినీ ఎయిర్ పోర్టుల్లో గంటల తరబడి తనిఖీలు చేయటంతో గ్రీన్ కార్డు హోల్డర్స్ సైతం టెన్షన్ పుట్టిస్తోంది.
ట్రంప్ ప్రభుత్వం కానీ ఓటీపీని రద్దు చేసేలా బిల్లునుకాంగ్రెస్ లో ప్రవేశపెట్టి.. అందుకు తగ్గట్లు నిర్ణయం తీసుకుంటే దాదాపు మూడు లక్షల మంది విద్యార్థులు కష్టాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. సైన్స్.. టెక్నాలజీ.. ఇంజినీరింగ్.. మ్యాథ్స్ రంగాల్లో ఉన్నత చదువు కోసం అమెరికాకు వచ్చే విదేశీ విద్యార్థులకు ఓటీపీ సౌకర్యం లభిస్తుంది. ఇప్పుడు అందుకు భిన్నంగా చదువు పూర్తైన వెంటనే వారి వారి దేశాలకు తిరిగి వెళ్లేందుకు వీలుగా ప్లాన్ చేస్తున్న వైనం విదేశీ విద్యార్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నాయి. నిజానికి ఈ ఓపీటీ వల్ల అత్యధికంగా లాభ పడుతోంది మనోళ్లే. ఇప్పుడు ఆ విధాన్ని తప్పు పడుతూ.. ఆ అనుమతుల్ని రద్దు చేయాలన్న ఆలోచనలో అధికార పక్ష నేతలు భావిస్తున్నారు.
ఒకవేళ ఓపీటీ విధానాన్ని రద్దు చేస్తే.. ఉన్నత చదువు పూర్తైన వెంటనే విద్యార్థులంతా అమెరికాను విడిచిపెట్టి వెళ్లాల్సి ఉంటుంది. దీంతో వారి కెరీర్ మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని చెబుతున్నారు. ఇక్కడ మరో విషయం ఉంది. ట్రంప్ సర్కారు తీసుకునే ఈ నిర్ణయంతో విదేశీ విద్యార్థుల మీదే కాదు.. అమెరికాలోని విశ్వవిద్యాలయాల మీదా ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. ఓపీటీ సౌకర్యాన్ని ట్రంప్ ప్రభుత్వం రద్దు చేస్తే.. వర్సిటీల్లో ఆడ్మిషన్లకు ఆదరణ తగ్గుతుందని.. చివరకు తమ మీదా తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని విశ్వవిద్యాలయాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరి.. ఈ విషయంలో ట్రంప్ సర్కారు ఆలోచన ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. మరేం జరుగుతుందో చూడాలి.