అమెరికా OPTలో అనూహ్య భయం: 15 రోజుల ‘జాబ్‌లెస్’ నోటీసుతో అంతర్జాతీయ విద్యార్థుల్లో అలజడి!
అమెరికాలో ఉన్నత విద్యను పూర్తిచేసి, ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాలనుకునే అంతర్జాతీయ విద్యార్థులలో (ఎఫ్-1 వీసా హోల్డర్లు) ఇప్పుడు పెద్ద ఆందోళన మొదలైంది.;
అమెరికాలో ఉన్నత విద్యను పూర్తిచేసి, ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాలనుకునే అంతర్జాతీయ విద్యార్థులలో (ఎఫ్-1 వీసా హోల్డర్లు) ఇప్పుడు పెద్ద ఆందోళన మొదలైంది. ఓపీటీ (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్) ప్రక్రియ సాఫీగా సాగుతుందని భావిస్తున్న తరుణంలో కేవలం 15 రోజుల ‘నిరుద్యోగం’ ఉందంటూ యూఎస్.సీ.ఐఎస్ (యూఎస్ సిటిజన్ మరియు ఇమిగ్రేషన్ సర్వీసెస్) జారీ చేసిన ఒక నోటీసు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
యూఎస్.సీ.ఐఎస్ కఠిన వైఖరి: ‘చిన్న గ్యాప్’పై పెద్ద ఇష్యూ
సమస్యేంటంటే ఈ నోటీసు అందుకున్న విద్యార్థి అన్ని నిబంధనలను పాటిస్తూ, ఒక రాష్ట్ర కాలేజీలో ఉద్యోగం చేస్తూ రెగ్యులర్‌గా పే స్లిప్స్, ఉద్యోగ రికార్డులు కలిగి ఉన్నారు. అయినప్పటికీ యూఎస్.సీ.ఐఎస్ ఆ విద్యార్థి ఓపీటీ కేసుపై రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్ (ఆర్ఎఫ్.ఈ ) జారీ చేస్తూ “మీరు 15 రోజుల పాటు నిరుద్యోగిగా ఉన్నట్లు కనిపిస్తోంది” అని ఆరోపించింది. సాధారణంగా స్టెమ్ ఓపీటీ లో విద్యార్థులకు మొత్తం 90 రోజుల నిరుద్యోగ గడువు అనుమతిస్తారు. అందుకని 15 రోజుల వంటి చిన్న గ్యాప్‌లు పెద్ద సమస్యగా పరిగణించబడవు. అందుకే ఈ అకస్మాత్తు నోటీసు విద్యార్థి వర్గంలో మరింత గందరగోళం, భయాన్ని పెంచింది.
డాక్యుమెంట్ల కోసం విస్తృత డిమాండ్
ఈ ఆర్ఎఫ్.ఈలో యూఎస్.సీ.ఐఎస్ అడిగిన ఆధారాలు అత్యంత విపులమైనవిగా ఉన్నాయి, ఇది ఓపీటీ విద్యార్థులకు అరుదైన విషయం.. పూర్తి ఉద్యోగ చరిత్రతోపాటు జాయినింగ్, ఎగ్జిట్ తేదీలు...ప్రతీ నెల పే స్లిప్స్ జీతాలు అందుకున్న రుజువులు... ఎంప్లాయర్ వెరిఫికేషన్ లెటర్.. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసిన రోజులకు ప్రత్యేక ప్రూఫ్... ఉద్యోగం ఏమైనా ఏజెన్సీ/కన్సల్టెన్సీ ద్వారా వచ్చిందా అన్న వివరణ... ఇంత లోతుగా డాక్యుమెంట్లు అడగడం ద్వారా, యూఎస్.సీ.ఐఎస్ ఓపీటీ లీగల్ స్టేటస్‌పై చాలా కఠినంగా వ్యవహరించడానికి సిద్ధంగా ఉందని సంకేతాలు పంపుతోంది.
సోషల్ మీడియాలో అలజడి: పెరిగిన అనుమానాలు
విద్యార్థి తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వైరల్ అయింది. చాలామంది అంతర్జాతీయ విద్యార్థులు ఈ సంఘటనను యూఎస్.సీ.ఐఎస్ కొత్తగా తీసుకున్న కఠిన వైఖరిగా భావిస్తున్నారు. మరికొందరైతే, రికార్డుల్లోని చిన్న చిన్న ' తేడాలు’ ఉన్నా సిస్టమ్ ఆటోమెటిక్‌గా ఫ్లాగ్ (గుర్తించి) చేసి ఆర్ఎఫ్.ఈలను జారీ చేస్తోందని నమ్ముతున్నారు. అక్టోబర్ 16న దరఖాస్తు చేసిన వెంటనే, ఎలాంటి హెచ్చరిక లేకుండా నెల రోజుల తర్వాత ఆర్ఎఫ్.ఈ రావడం ఈ అనుమానాలను మరింత పెంచింది.
ప్రతిభావంతుల్లో నిరుత్సాహం
“నేను ఎప్పుడూ నకిలీ ఉద్యోగం చేయలేదు. ఎలాంటి కన్సల్టెన్సీలను ఉపయోగించలేదు. అయినా కూడా నా నిరుద్యోగ దినాలను నిరూపించుకోవాల్సి వచ్చింది” అని బాధితుడైన విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు. యూఎస్.సీ.ఐఎస్ ఇంత చిన్న గ్యాప్‌పై ఇంత పెద్ద ఆర్ఎఫ్.ఈ ఇవ్వడం వల్ల, ప్రపంచ నలుమూలల నుంచి అమెరికాకు వచ్చే ప్రతిభావంతులైన విద్యార్థుల్లో నిరుత్సాహం పెరుగుతోంది. అమెరికాలో కెరీర్ నిర్మించాలనుకునే వారిని, వ్యవస్థే అడ్డుకుంటోందన్న భావన బలంగా నాటుకుంటోంది. ఈ ఒక్క ఘటన ఓపీటీ ప్రాసెసింగ్‌పై అనిశ్చితిని పెంచి, భవిష్యత్తులో ఆర్ఎఫ్.ఈలు పెరుగుతాయా? ఓపీటీ ప్రక్రియ మరింత క్లిష్టమవుతుందా? అన్న భయాలను అంతర్జాతీయ విద్యార్థుల్లో రేకెత్తిస్తోంది.
ఇలాంటి అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఓపీటీలో ఉన్న విద్యార్థులు తమ ఉద్యోగ రికార్డులను, పే స్లిప్స్, జాయినింగ్/ఎగ్జిట్ తేదీలను అత్యంత జాగ్రత్తగా, కచ్చితంగా మెయింటేన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.