వేలాది భారతీయులపై ట్రంప్‌ ప్రభుత్వ కత్తి!

ఈ కొత్త నిబంధన వల్ల అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వేలాది మంది భారతీయ ఉద్యోగులు నేరుగా ప్రభావితమవుతారు.;

Update: 2025-10-30 14:30 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వలసదారులపై తన కఠిన వైఖరిని మరింత పెంచారు. ఇప్పటికే అనేక ఇమ్మిగ్రేషన్‌ నిబంధనలను మార్చిన ట్రంప్‌ ప్రభుత్వం, తాజాగా వలసదారులకు షాకిస్తూ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వేలాది మంది భారతీయులతో సహా అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వలసదారులపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపనుంది.

* ఆటోమేటిక్ రెన్యువల్‌ వ్యవస్థ రద్దు

అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ (DHS) ప్రకటించిన కొత్త నిబంధనల ప్రకారం, ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్స్ (EADs) లేదా వర్క్ పర్మిట్ల ఆటోమేటిక్ రెన్యువల్ వ్యవస్థను తక్షణమే రద్దు చేశారు. అక్టోబర్‌ 30 లేదా ఆ తర్వాత వర్క్‌ పర్మిట్‌ పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకునే వలసదారులకు ఈ సౌకర్యం ఇకపై అందుబాటులో ఉండదు. ఈ తేదీకి ముందు దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రం పాత నిబంధనలే వర్తిస్తాయి. ఈ నిర్ణయంతో వర్క్‌ పర్మిట్‌ గడువు ముగిసిన తర్వాత కూడా తాత్కాలికంగా ఉద్యోగం కొనసాగించే అవకాశం వలసదారులకు లేకుండా పోయింది.

*భారతీయులపై తీవ్ర ప్రభావం

ఈ కొత్త నిబంధన వల్ల అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వేలాది మంది భారతీయ ఉద్యోగులు నేరుగా ప్రభావితమవుతారు. గ్రీన్‌కార్డ్‌ కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిపుణులు, వారి జీవిత భాగస్వాములు, పిల్లలు EADలపైనే ఆధారపడి ఉద్యోగాలు చేస్తున్నారు. ఆటోమేటిక్ రెన్యువల్ రద్దు కావడంతో, దరఖాస్తు ప్రక్రియ ఆలస్యమైతే వీరు తాత్కాలికంగా ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. F-1 లేదా M-1 వీసాలపై ఉన్న విద్యార్థులు, అలాగే ఇతర వీసా హోల్డర్ల డిపెండెంట్లు (భార్యాభర్తలు) కూడా EAD కలిగి ఉండాలి. వీరి పునరుద్ధరణ ప్రక్రియ కూడా క్లిష్టంగా మారుతుంది.

* USCIS కీలక సూచన

USCIS (U.S. Citizenship and Immigration Services) అధికారులు వలసదారులకు ముందస్తు హెచ్చరిక జారీ చేశారు. "వర్క్‌ పర్మిట్ల గడువు ముగియడానికి కనీసం 180 రోజుల ముందే రెన్యువల్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఆలస్యం చేస్తే తాత్కాలికంగా ఉద్యోగ అనుమతులు కోల్పోయే ప్రమాదం ఉంది." USCIS డైరెక్టర్‌ జోసెఫ్‌ మాట్లాడుతూ, "అమెరికాలో ఉద్యోగం చేయడం ఒక అవకాశం మాత్రమే, వలసదారుల హక్కు కాదు," అని స్పష్టం చేయడం ఈ నిర్ణయం వెనుక ట్రంప్‌ ప్రభుత్వ దృక్పథాన్ని తెలియజేస్తోంది.

* EAD అంటే ఏమిటి?

ఎంప్లాయిమెంట్‌ ఆథరైజేషన్‌ డాక్యుమెంట్‌ (EAD) అనేది గ్రీన్‌కార్డు లేని వలసదారులు అమెరికాలో నిర్దిష్ట కాలం పాటు పనిచేసేందుకు అనుమతించే అధికారిక పత్రం. గ్రీన్‌కార్డు పెండింగ్‌లో ఉన్నవారు, వారి భార్యాభర్తలు/పిల్లలు, విద్యార్థులు (F-1/M-1), మరియు ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్నవారు వంటి వారికి ఇది తప్పనిసరి. గ్రీన్‌కార్డు హోల్డర్లు లేదా H-1B, L-1B వంటి నిర్దిష్ట నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలు ఉన్నవారికి EAD అవసరం లేదు.

* వలసదారులకు తక్షణ అవసరం

గతంలో, బైడెన్ ప్రభుత్వం హయాంలో వర్క్‌ పర్మిట్ల గడువు ముగిసినా 540 రోజుల వరకు ఉద్యోగం కొనసాగించేందుకు అనుమతి ఉండేది. ఆ విధానాన్ని రద్దు చేస్తూ ట్రంప్‌ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వలసదారులకు పెద్ద సవాల్‌గా మారింది. అమెరికాలో ఉన్న ప్రతి వలసదారుడు, ముఖ్యంగా భారతీయులు, తమ EAD గడువు తేదీలను ముందే పరిశీలించుకుని, సమయానికి దరఖాస్తు చేసుకోవడం చాలా అవసరం. లేదంటే, తాత్కాలికంగా నిరుద్యోగులుగా మారే పరిస్థితి ఏర్పడవచ్చు.

Tags:    

Similar News