అమెరికాలో వరుస విషాదాలు : తెలుగు యువతి హత్య.. ఎన్నారై దంపతుల దుర్మరణం

అమెరికాలో ఉన్న తెలుగు సమాజాన్ని ఈ రెండు ఘటనలు తీవ్రంగా కుదిపేశాయి.. కొత్త ఏడాది వేడుకల సమయంలో సంతోషంగా ఉండాల్సిన కుటుంబాల్లో తీరని శోకం మిగిలింది.;

Update: 2026-01-05 06:11 GMT

అమెరికాలో స్థిరపడిన తెలుగు వారికి కాలం కలిసిరావడం లేదు. గడిచిన కొద్ది రోజుల్లోనే జరిగిన రెండు వేర్వేరు ఘటనలు ప్రవాస ఆంధ్రులను, తెలంగాణ వాసులను దిగ్భ్రాంతికి గురిచేశాయి. నిఖిత గోదిశాల అనే యువతి దారుణ హత్యకు గురికాగా.. మరో ప్రమాదంలో కృష్ణ కోటికలపూడి దంపతులు ప్రాణాలు కోల్పోయారు.



 


అమెరికాలో ఉన్న తెలుగు సమాజాన్ని ఈ రెండు ఘటనలు తీవ్రంగా కుదిపేశాయి.. కొత్త ఏడాది వేడుకల సమయంలో సంతోషంగా ఉండాల్సిన కుటుంబాల్లో తీరని శోకం మిగిలింది. యువతి హత్య ఒకవైపు, రోడ్డు ప్రమాదంలో దంపతుల మరణం మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర కలకలం రేపుతున్నాయి.



 


స్నేహితుడి చేతిలోనే ప్రాణాలు కోల్పోయిన నిఖిత

అమెరికాలోని కొలంబియాలో నివసిస్తున్న 27 ఏళ్ల నిఖిత గోదిశాల హత్యోదంతం అత్యంత విషాదకరంగా మారింది. మేరీల్యాండ్ యూనివర్సిటీలో మాస్టర్స్ పూర్తి చేసి.. డేటా అండ్ స్ట్రాటజీ అనలిస్ట్‌గా రాణిస్తున్న నిఖిత కెరీర్ ప్రారంభంలోనే తనువు చాలించింది. డిసెంబర్ 31న నిఖిత తన స్నేహితుడు అర్జున్ శర్మ ఇంటికి వెళ్ళింది. ఆ తర్వాత ఆమె ఆచూకీ లభించలేదు. జనవరి 2న స్వయంగా అర్జున్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేసి నిఖిత కనిపించడం లేదని నమ్మబలికాడు. పోలీసులకు ఫిర్యాదు చేసిన వెంటనే అర్జున్ శర్మ తెలివిగా భారత్‌కు పారిపోయాడు. అనుమానం వచ్చిన పోలీసులు అర్జున్ నివాసం ఉండే అపార్ట్‌మెంట్‌లో సోదాలు చేయగా నిఖిత మృతదేహం అనేక కత్తిపోట్లతో లభ్యమైంది. ప్రస్తుతం హోవార్డ్ కౌంటీ పోలీసులు అర్జున్‌పై మర్డర్ కేసులు నమోదు చేశారు. అమెరికా ఫెడరల్ ఏజెన్సీలు భారత అధికారులతో కలిసి నిందితుడి కోసం గాలిస్తున్నాయి. వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయం ఈ కేసును నిశితంగా పరిశీలిస్తోంది.

డ్రంక్ డ్రైవర్ నిర్వాకంతో దంపతుల బలి.. చిన్నారుల పరిస్థితి విషమం

మరో ఘటనలో నార్త్ కరోలినాలోని షార్లెట్‌కు చెందిన కృష్ణ కోటికలపూడి , ఆయన భార్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వీరి మరణం ఆ కుటుంబాన్ని అనాథను చేసింది. ఆదివారం తెల్లవారుజామున ఒక డ్రంక్ డ్రైవర్ తప్పుడు మార్గంలో వచ్చి కృష్ణ ప్రయాణిస్తున్న కారును బలంగా ఢీకొట్టాడు. ఈ ఘోర ప్రమాదంలో దంపతులిద్దరూ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ ప్రమాదంలో ఆ దంపతుల ఇద్దరు పిల్లలు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. తెలుగు సంఘాలు.. స్నేహితులు ఆ పిల్లలకు అండగా నిలిచేందుకు నిధుల సేకరణతో పాటు ఇతర సహాయక చర్యలు చేపడుతున్నారు.

కలవరపడుతున్న తెలుగు సమాజం

ఉద్యోగ, ఉపాధి రీత్యా అమెరికా వెళ్ళిన తెలుగు వారు ఇలా వరుసగా ప్రమాదాల బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. అటు నిఖిత కుటుంబ సభ్యులు, ఇటు కృష్ణ బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. అమెరికాలోని తెలుగు అసోసియేషన్లు బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని.. స్థానిక ప్రభుత్వం భద్రతపై దృష్టి సారించాలని కోరుతున్నాయి.

విదేశాల్లో ఉన్న తెలుగు వారు ఏవైనా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నట్లయితే వెంటనే స్థానిక కాన్సులేట్ కార్యాలయాన్ని లేదా తెలుగు సహాయక బృందాలను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News