అమెరికాలో తెలుగు టెక్కీ మరణం.. విష్ణువర్ధన్ మృతికి కారణం ఏంటి..?
విదేశీ గడ్డపై ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, కన్నవారి కళ్లలో ఆనందాన్ని చూడాలని వేల మైళ్ల దూరం వెళ్లి అక్కడ అర్ధాంతరంగా తనువు చాలిస్తున్న ఘటనలు అనేకం జరుగుతున్నాయి.;
విదేశీ గడ్డపై ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, కన్నవారి కళ్లలో ఆనందాన్ని చూడాలని వేల మైళ్ల దూరం వెళ్లి అక్కడ అర్ధాంతరంగా తనువు చాలిస్తున్న ఘటనలు అనేకం జరుగుతున్నాయి. నిన్నటి వరకు నవ్వుతూ, భవిష్యత్తు గురించి ఎన్నో ప్రణాళికలు వేసుకున్న వ్యక్తి, మరుసటి రోజు శాశ్వత నిద్రలోకి జారుకున్నాడన్న వార్త వినడం కంటే పెద్ద విషాదం ఉండదు. అగ్రరాజ్యంలో స్థిరపడి, మేధస్సుతో అద్భుతాలు సృష్టించాలనుకున్న తెలుగు యువకుడి ప్రయాణం ఊహించని మలుపు తిరిగింది.
కోటి ఆశలతో యూఎస్ వెళ్లిన టెక్కీ..
సాఫ్ట్‌వేర్ రంగంలో రాణించాలనే పట్టుదలతో అమెరికా వెళ్లిన విష్ణువర్ధన్ చేజెర్లా అనే యువ టెక్కీ కథ అందరి కళ్లు చెమర్చేలా చేస్తోంది. మే 1వ తేదీ న్యూ హాంప్‌షైర్‌లోని నషువాలో ఉన్న తన నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు. కొన్నేళ్లుగా హెచ్-1బీ వీసాపై అక్కడ ఒక ప్రతిష్టాత్మక సంస్థలో పనిచేస్తున్న విష్ణువర్ధన్ అంచెలంచెలుగా ఎదిగి తన కుటుంబం కోసం కష్టపడేవారు. అత్యంత స్నేహశీలిగా, కష్టపడే తత్వమున్న వ్యక్తిగా తన సర్కిల్‌లో గుర్తింపు సంపాదించుకున్న ఆయన అందరినీ వదిలి వెళ్లిపోతారని ఎవరూ ఊహించలేదు. ఒక చిన్న అనారోగ్య సమస్య ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంటుందని ఎవరూ అనుకోలేదు.
మెదడు సంబంధిత వ్యాధి రూపంలో..
సాధారణంగా విష్ణువర్ధన్ చురుకైన, ఆరోగ్యకరమైన జీవనశైలి గడిపేవారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. వ్యాయామం, ఆహార నియమాలు పాటిస్తున్నప్పటికీ 'బ్రెయిన్ అనూరిజం' అనే ప్రమాదకరమైన మెదడు సంబంధిత వ్యాధి ఆయనను కబళించింది. ఇది ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా ఒక్కసారిగా మెదడులోని రక్తనాళాలపై ప్రభావం చూపడం వల్ల ప్రాణాపాయం సంభవిస్తుంది. విష్ణు విషయంలో కూడా అదే జరిగింది. ఆరోగ్యంగా ఉన్న మనిషి ఒక్కసారిగా కుప్పకూలిపోవడం, చికిత్సకు కూడా అవకాశం ఇవ్వకుండానే మృత్యువు దరి చేరడం కోలుకోలేని దెబ్బ తీసింది.
ఈ విషాదంలో మరో హృదయ విదారక అంశం.. విష్ణువర్ధన్‌కు వివాహం జరిగి కేవలం ఒక ఏడాది మాత్రమే. వైవాహిక జీవితాన్ని అందంగా మలుచుకోవాలని, భార్యతో కలిసి అమెరికాలో కొత్త జీవితాన్ని ఆస్వాదించాలని ఆయన కలలు కళ్లలయ్యాయి. ప్రస్తుతం ఆయన భార్య హెచ్-4 డిపెండెంట్ వీసాపై అమెరికాలోనే ఆయనతో కలిసి ఉంటుంది. కళ్లముందే భర్త మరణం, విదేశీ గడ్డపై ఒంటరిగా మిగిలిపోవడంతో ఆమె పరిస్థితిని దారుణంగా మార్చింది.
కన్నవారి చెంతకు చేర్చే ప్రయత్నం
కోటి కళ్లతో కుమారుడి కోసం చూసే తల్లిదండ్రులకు కొడుకు మృతదేహం కోసం చూడడం అతిపెద్ద శిక్ష. అమెరికాలోని భారతీయ సమాజం, తెలుగు సంఘాలు విష్ణువర్ధన్ మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు కృషి చేస్తున్నాయి. అంత్యక్రియలు సొంత గడ్డపై నిర్వహించేలా అవసరమైన ఫార్మాలిటీస్, నిధుల సేకరణ చేపట్టారు. యువ టెక్కీ మరణం కేవలం ఒక వార్తగా మిగిలిపోకుండా, విదేశాల్లో ఉంటున్న భారతీయుల ఆరోగ్య భద్రత, అక్కడ ఉంటున్న వారి మానసిక స్థితిపై చర్చ మొదలయ్యేలా చేసింది. విష్ణువర్ధన్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుందాం.