అప్పు అడిగిన పాపానికి నిప్పులా పగ.. తెలుగు అమ్మాయి నిఖిత కేసులో విస్తుపోయే నిజాలు

అమెరికాలో ఉన్నత చదువులు చదివి.. మంచి ఉద్యోగంలో స్థిరపడి ఉన్నత శిఖరాలను అధిరోహించాలనుకున్న ఒక తెలుగు యువతి కలలు కల్లలయ్యాయి.;

Update: 2026-01-06 10:34 GMT

అమెరికాలో ఉన్నత చదువులు చదివి.. మంచి ఉద్యోగంలో స్థిరపడి ఉన్నత శిఖరాలను అధిరోహించాలనుకున్న ఒక తెలుగు యువతి కలలు కల్లలయ్యాయి. కేవలం కొన్ని డాలర్ల కోసం తోటి భారతీయుడే ఆమె ప్రాణాలను బలిగొన్న ఉదంతం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోని భారతీయ సమాజం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. హైదరాబాద్‌కు చెందిన నికితా గోదిశాల హత్య కేసులో బయటపడుతున్న వాస్తవాలు అత్యంత దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి.

హైదరాబాద్‌కు చెందిన నికితా గోదిశాల (27) మేరీల్యాండ్ రాష్ట్రంలోని కొలంబియాలో నివసిస్తూ డేటా అనలిస్ట్‌గా పనిచేస్తోంది. ఈమెకు తమిళనాడుకు చెందిన అర్జున్ శర్మ (26) అనే వ్యక్తి గతంలో రూమ్‌మేట్‌గా పరిచయం ఉన్నాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అర్జున్ శర్మకు నికితా సహాయం చేయాలనే ఉద్దేశంతో 4,500 డాలర్లు అప్పుగా ఇచ్చింది. అయితే తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వమని నికితా కోరడంతో వివాదం మొదలైంది. అర్జున్ శర్మ 3,500 డాలర్లు తిరిగి ఇచ్చినా మిగిలిన వెయ్యి డాలర్ల కోసం నికితా ఒత్తిడి తెచ్చింది. చివరకు ఆ మిగిలిన సొమ్ము కూడా ఇచ్చేస్తానని నమ్మబలికి నికి తాను తన నివాసానికి పిలిపించుకున్నాడు అర్జున్ శర్మ. అదే ఆమెకు ఆఖరి ప్రయాణమైంది.

కిరాతక హత్య.. పోలీసులనే నమ్మించిన డ్రామా

నిందితుడు అర్జున్ శర్మ ఎంతటి క్రూరుడంటే.. నికితాను కత్తితో పొడిచి అత్యంత దారుణంగా చంపడమే కాకుండా తనపై ఎవరికీ అనుమానం రాకుండా పోలీసులనే తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. జనవరి 2న నికితా కనిపించడం లేదంటూ స్వయంగా అర్జునే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు గాలింపు చేపట్టగా జనవరి 3న అర్జున్ శర్మ ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోనే నికితా మృతదేహం రక్తపు మడుగులో లభ్యమైంది. హత్యకు ముందు నికితా మొబైల్ నుంచి ఆమె అకౌంట్‌లో ఉన్న 3,500 డాలర్లను తన ఖాతాకు బదిలీ చేయించుకుని ఆపై ఆమెను అంతమొందించాడు.

తండ్రి ఆవేదన.. అది ప్రేమ వ్యవహారం కాదు!

ఈ కేసులో ప్రధానంగా మీడియాలో వినిపిస్తున్న ప్రేమ వ్యవహారం అనే ప్రచారాన్ని నికితా తండ్రి ఆనంద్ గోదిశాల తీవ్రంగా ఖండించారు. సికింద్రాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. అర్జున్ శర్మ మా అమ్మాయి మాజీ ప్రియుడు కాదు. కేవలం కొంతకాలం ఆమెతో పాటు ఒకే ఫ్లాట్‌లో నలుగురు లో ఒక రూమ్‌మేట్‌గా ఉన్నాడు. అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి అడిగినందుకే నా కుమార్తెను పొట్టనబెట్టుకున్నాడు. మా అమ్మాయి కష్టపడి చదువుకుని అమెరికాలో తన కాళ్ల మీద తాను నిలబడింది. దయచేసి ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచేలా తప్పుడు ప్రచారం చేయవద్దు అని ఆవేదన వ్యక్తం చేశాడు.

భవిష్యత్తు నాశనం..

నికితా విద్యాభ్యాసం, కెరీర్ ఎంతో స్ఫూర్తిదాయకంగా సాగింది. 2022-23లో యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ నుంచి మాస్టర్స్ పూర్తి చేసిన ఆమె ఇటీవల వేధ హెల్త్ లో డేటా అండ్ స్ట్రాటజీ అనలిస్టుగా చేరింది. 2025 డిసెంబర్‌లో తన పనితీరుకు గానూ 'ఆల్-ఇన్ అవార్డు' అందుకున్న విషయాన్ని లింక్డ్‌ఇన్‌లో షేర్ చేస్తూ ఎంతో సంతోషాన్ని వ్యక్తపరిచింది. అంతలోనే ఈ ఘోరం జరగడం ఆమె స్నేహితులను, కుటుంబ సభ్యులను కలచివేస్తోంది.

పరారీలో నిందితుడు?

హత్య చేసిన అనంతరం అర్జున్ శర్మ అమెరికా నుంచి భారత్‌కు పారిపోయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మేరీల్యాండ్ పోలీసులు అతడిపై ఫస్ట్ సెకండ్ డిగ్రీ మర్డర్ కేసులు నమోదు చేశారు. ఇంటర్‌పోల్ సాయంతో నిందితుడిని పట్టుకునే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. మరోవైపు భారత రాయబార కార్యాలయం నికితా మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టింది.

ఒక ప్రతిభావంతురాలైన యువతి కేవలం అప్పుగా ఇచ్చిన డబ్బులను తిరిగి అడిగినందుకు ప్రాణాలు కోల్పోవడం నాగరిక సమాజం సిగ్గుపడాల్సిన విషయం. నిందితుడికి కఠిన శిక్ష పడాలని యావత్ తెలుగు సమాజం కోరుకుంటోంది.

Tags:    

Similar News