కోరిక తీర్చనందుకు భారత సంతతి ఉద్యోగిపై లేడీ బాస్ లైంగిక టార్చర్
అమెరికా కార్పొరేట్ దిగ్గజం జేపీ మోర్గాన్ చేజ్ ప్రస్తుతం ఒక భారీ కుంభకోణంలో చిక్కుకుంది.;
అమెరికా కార్పొరేట్ దిగ్గజం జేపీ మోర్గాన్ చేజ్ ప్రస్తుతం ఒక భారీ కుంభకోణంలో చిక్కుకుంది. భారతీయ మూలాలున్న ఒక సీనియర్ బ్యాంకర్, తన సీనియర్ సహోద్యోగి అయిన లార్నా హజ్దిని పై చేసిన సంచలన ఆరోపణలు వాల్ స్ట్రీట్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. లైంగిక వేధింపులు, జాతి వివక్ష, అధికార దుర్వినియోగం వంటి అంశాలతో కూడిన ఈ ఉదంతం ఇప్పుడు న్యాయస్థానం మెట్లు ఎక్కింది.
లైంగిక వేధింపులు.. బెదిరింపులు
"జాన్ డో" అనే మారుపేరుతో న్యూయార్క్ కౌంటీ సుప్రీం కోర్టులో ఫిర్యాదు దాఖలు చేసిన ఈ భారతీయ మూలాల వ్యక్తి, సంస్థలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హోదాలో పనిచేస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో ఉన్న లార్నా హజ్దిని.. తన పదవిని అడ్డం పెట్టుకుని గత కొన్ని నెలలుగా తనపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారని ఆయన ఆరోపించారు. మొదట వృత్తిపరమైన సంబంధంగా ప్రారంభమైన వీరి పరిచయం.. కాలక్రమేణా హజ్దిని అనుచిత ప్రవర్తన వల్ల వేధింపులుగా మారింది.
తన లైంగిక కోరికలను తీర్చకపోతే కెరీర్‌ను నాశనం చేస్తానని, పదోన్నతులు రాకుండా అడ్డుకుంటానని ఆమె బెదిరించినట్లు బాధితుడు పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో ఆమె బలవంతంగా మత్తు పదార్థాలు ఉపయోగించి తన అంగీకారం పొందేందుకు ప్రయత్నించిందని చెప్పడం ఈ కేసులో అత్యంత తీవ్రమైన అంశం.
జాతి వివక్ష.. అవమానాలు
కేవలం లైంగిక వేధింపులకే పరిమితం కాకుండా బాధితుడి భారతీయ మూలాలను లక్ష్యంగా చేసుకుని హజ్దిని జాతి వివక్ష వ్యాఖ్యలు చేసినట్లు ఫిర్యాదులో ఉంది. ఆయనను “బ్రౌన్ బాయ్” అని “అరబ్ బాయ్ టోయ్” అని కించపరిచే పదాలతో పిలిచేవారని, అతని వ్యక్తిత్వాన్ని.. మూలాలను ఎగతాళి చేసేవారని ఆరోపించారు. అంతేకాకుండా బాధితుడి భార్యపై కూడా ఆమె అసభ్యకర వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొన్నారు. ఈ మానసిక వేధింపుల వల్ల తను తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యానని, తన గౌరవానికి భంగం కలిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సంస్థ స్పందన.. విమర్శలు
ఈ ఆరోపణలను జేపీ మోర్గాన్ చేజ్ తీవ్రంగా ఖండించింది. అంతర్గత విచారణలో లైంగిక వేధింపులకు సంబంధించిన ఎటువంటి ఆధారాలు లభించలేదని సంస్థ స్పష్టం చేసింది. అయితే ఫిర్యాదు చేసిన బాధితుడిని బలవంతపు సెలవుపై పంపి, ఆరోపణలు ఎదుర్కొంటున్న హజ్దినిని మాత్రం అదే హోదాలో కొనసాగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హజ్దిని నేపథ్యం
న్యూయార్క్ యూనివర్సిటీలో స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్.. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల పట్టభద్రురాలు. జేపీ మోర్గాన్‌లో లెవరేజ్డ్ ఫైనాన్స్ విభాగంలో కీలక బాధ్యతలు. ప్రైవేట్ ఈక్విటీ, టెక్ క్లయింట్ల ఫైనాన్సింగ్ వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. జూనియర్ ఉద్యోగుల పనితీరు అంచనాలు , బోనస్‌ల నిర్ణయంలో ఆమెకు కీలక పాత్ర ఉంది.
మారుతున్న చర్చ.. పురుషుల భద్రత
సాధారణంగా కార్పొరేట్ రంగంలో మహిళలపై జరిగే వేధింపుల గురించి మనం ఎక్కువగా వింటుంటాం. కానీ, ఈ కేసు లింగ వివక్ష లేకుండా వేధింపులు ఎవరికైనా ఎదురవ్వచ్చని నిరూపిస్తోంది. ఒక ఉన్నత స్థాయిలో ఉన్న మహిళా అధికారి తన కింది స్థాయి పురుష ఉద్యోగిని వేధించడంపై ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో.. కార్పొరేట్ సర్కిల్స్‌లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
బాధితుడు తనకు కలిగిన భావోద్వేగ నష్టం, ప్రతిష్టకు జరిగిన హాని, ఉద్యోగ భద్రతకు ఏర్పడిన ముప్పు కోసం భారీ పరిహారం కోరుతున్నారు. అమెరికాలోని అత్యున్నత బ్యాంకింగ్ వ్యవస్థలో చోటుచేసుకున్న ఈ పరిణామం రానున్న రోజుల్లో మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.