అమెరికాలో తాజా పరిస్థితిపై మనోడు ఏం చెప్పాడు?
ఈ రోజున అమెరికాలో మనోళ్ల ముద్రలు ఎంత బలంగా ఉన్నాయంటే.. ఆ దేశాన్ని కూడా మన దేశంలా భావించేటోళ్లు కొన్ని లక్షల మంది ఉన్నారు.;
భారత్ కు అమెరికాకు మధ్య దూరం గతంలో కొన్ని వేల కిలోమీటర్లు. ఎప్పుడైతే మన ఐటీ ఉద్యోగులు అక్కడ భారీగా స్థిరపడ్డారో.. ఈ రెండు దేశాల మధ్య దూరం ఎంతో తగ్గిపోయింది. ఇవాల్టి రోజున దేశంలోని ప్రతి గల్లీ నుంచి అమెరికాలో మనోళ్ల అడుగులు కనిపిస్తాయి. తెలుగు రాష్ట్రాల్నే తీసుకుంటే.. ఊరికి పాతిక మందికి తగ్గకుండా అమెరికాలో స్థిరపడిన పరిస్థితి. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడయ్యాక అక్కడి పరిస్థితుల్లో చోటు చేసుకుంటున్న మార్పులు అన్నిఇన్ని కావు. దీంతో.. అమెరికాలో ఏం జరుగుతుందన్న ఆందోళన అందరిని ఇబ్బందికి గురి చేస్తుంది.
ఈ రోజున అమెరికాలో మనోళ్ల ముద్రలు ఎంత బలంగా ఉన్నాయంటే.. ఆ దేశాన్ని కూడా మన దేశంలా భావించేటోళ్లు కొన్ని లక్షల మంది ఉన్నారు. అందుకే ట్రంప్ ఎంతలా తింగరి నిర్ణయాలు తీసుకున్నా.. అమెరికాను కాదనుకోలేని పరిస్థితి మనోళ్ల మీద ఉంది. ఇంతకూ ఇప్పుడు అమెరికాలో ఉన్న మనోళ్ల పరిస్థితేంటి? ఉన్నత విద్య కోసం వెళ్లే మనోళ్లకు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఈ ఏడాది ఆడ్మిషన్లు తగ్గాయా? సుంకాల షాక్ తో అమెరికాలో ధరలు పెరిగాయా? మన ఎగుమతులపై సుంకాల నేపథ్యంలో మన పరిస్థితి ఏమిటి? వీసాలున్నప్పటికి ఏదో ఒక మాట చెప్పేసి తిరిగి భారత్ కు పంపేసే పరిస్థితులు ఉన్నాయా? ఇలాంటి సందేహాలు బోలెడన్ని మెదులుతున్న పరిస్థితి.
ఇలాంటి వేళ.. అమెరికాలోని కాన్సస్ విశ్వవిద్యాలయంలో ఫీడ్ అండ్ ఫ్యూచర్ సస్టెయినబుల్ ఇంటెన్సిఫికేషన్ ఇన్నోవేషన్ ల్యాబ్ కు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు తెలుగు ప్రాంతానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ పీవీ వరప్రసాద్. క్రిష్ణా జిల్లాకు చెందిన ఆయన అప్పుడెప్పుడో అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు. మనకు కలిగే పలు సందేహాల్ని ఆయన తీరుస్తున్నారు. ఆయన ఏం చెబుతున్నారంటే?
- భారతదేశం నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే పలు రకాల ఆహార, వ్యవసాయ ఉత్పత్తులు.. నిత్యవసర వస్తువులు సుంకాల కారణంగా పరిస్థితి ఏమిటన్న సందేహం పలువురిలో ఉంటుంది. అయితే.. ఈ వస్తువుల్ని తమకు తామే ఉత్పత్తి చేసుకునే అవకాశం అమెరికాలో లేదు. ఒకవేళ ఉన్నా చాలా తక్కువగా ఉంటాయి.
- మంచినీట్లో పెంచే రొయ్యలు.. బాస్మతి బియ్యం.. మామిడి పండ్లు.. చెప్పులు.. వస్త్రాలు.. తోలు ఉత్పత్తులు అమెరికాలో పూర్తిగా ఉత్పత్తి చేయటం సాధ్యం కాదు. సుంకాల కారణంగా అమెరికాలో కొన్ని రకాల వస్తువుల ధరలపై ప్రభావం పడింది.గతంలో తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే నాణ్యమైన మంచినీటి రొయ్యలు తక్కువ ధరకే లభించేవి. ఇప్పుడు వాటితో పాటు బాస్మతి బియ్యం ధరలూ పెరిగాయి.
- ధరల పెరుగుతాయన్న అంచనాతో పెద్ద ఎత్తున ఎన్ఆర్ఐలు పెద్ద ఎత్తున బియ్యాన్ని కొనేశారు. దీంతో.. కొన్ని షాపుల్లో బియ్యం సంచుల అమ్మకాల మీద పరిమితులు పెట్టారు. భారత్ మీద పరిమితులు పెట్టిన నేపథ్యంలో పలు ఆహార ఉత్పత్తుల్ని అమెరికాలో ఉత్పత్తి చేసినా.. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నా ఖర్చులు పెరుగుతాయి. అంతిమంగా ఆ భారం వినియోగదారుడి మీదే పడుతుంది. అంటే.. ధరలు పెరగటం ఖాయం. భారత్ ఉత్పత్తులకు అల్టర్ నేటివ్ లేదనే చెప్పాలి. ఉన్నా.. ధరలు ఎక్కువగా ఉంటాయి.
- అమెరికాలో పని చేసే భారతీయ ఉద్యోగులతో పోలిస్తే సగటు అమెరికన్ల ఆదాయం తక్కువగా ఉంటుంది. సుంకాల కారణంగా ధరలు పెరుగుతాయన్న ఆందోళన ఎన్నారైలలో ఉంది. అమెరికా ఉత్పత్తులకు భారత్ పెద్ద మార్కెట్ గా ఉన్న నేపథ్యంలో భారత్ ను ట్రంప్ మిత్రదేశంగా గౌరవించాలన్న అభిప్రాయం పలువురిలో ఉంది.
- జీతాలు పెరగకుండా వస్తువుల ధరలు పెరిగితే ఈ ప్రభావం స్థానిక అమెరికన్ల మీదా ఉంటుంది. రోజువారీ జీతం మీద ఆధారపడే వారు.. కుటుంబాలు తాజా పండ్లు.. కూరగాయలు లాంటి పోషకాహారాన్ని తగ్గిస్తారు. ఉద్యోగులపై నిజమైన ప్రభావం వచ్చే మూడు నుంచి ఆర్నెల్ల లోపు కనిపిస్తుందని అంచనా వేస్తున్నారు.
- అమెరికాలో ఎంఎస్ పూర్తైన వెంటనే జాబ్ లు రావటం లేదన్నది నిజం. స్టార్టప్ లకు అమెరికా ప్రభుత్వం ఇచ్చే ప్రయోజనాలు.. నిధుల తగ్గింపు ఉద్యోగాల మీద పడింది. అయితే.. ప్రతిభ.. అదనపు నైపుణ్యాలు.. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నోళ్లకు ఉద్యోగాలు లభిస్తున్నాయి.
- 2023-24లో ప్రపంచ దేశాల నుంచి అమెరికాకు చదువుకోవటానికి 11 లక్షల మంది వస్తే.. ఈ ఏడాది 20 శాతం వరకు ఆడ్మిషన్లు తగ్గాయి. దీంతో.. వర్సిటీలకు వచ్చే ఆదాయం భారీగా తగ్గింది. దీనిపై విశ్వవిద్యాలయాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో స్కాలర్ షిప్ లు.. ట్యూషన్ ఫీజుల మీద మినహాయింపులు తగ్గాయి.
- వీసా సమస్య సరైన పత్రాలు లేని వారికి మాత్రమే. అలాంటోళ్లు ఎవరైనా కొంతకాలం పాటు ప్రయాణాలు చేయకపోవటమే మంచిది. అన్ని పత్రాలు సరిగా ఉంటే భారత్ కు వచ్చి తిరిగి వెళ్లేందుకు ఎలాంటి సమస్యలు ఉండవు. సోషల్ మీడియాలో అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న వారిని అదనపు విచారణ కోసం ఆపుతున్నారు.