అమెరికాలో ఎన్నారై మహిళపై ఏంటీ దారుణం?

అమెరికాలో భారతీయులపై దాడులు, హత్యలు ఆగడం లేదు. తాజాగా మరోసారి ఓ భారతీయురాలు దారుణ హత్యకు గురై ప్రవాస భారతీయుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.;

Update: 2025-09-22 05:12 GMT

అమెరికాలో భారతీయులపై దాడులు, హత్యలు ఆగడం లేదు. తాజాగా మరోసారి ఓ భారతీయురాలు దారుణ హత్యకు గురై ప్రవాస భారతీయుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. నార్త్ కరోలినాలోని యూనియన్ కౌంటీలో జరిగిన ఈ సంఘటనలో గుజరాత్‌కు చెందిన 49 ఏళ్ల కిరణ్ పటేల్ దుర్మరణం పాలయ్యారు. ఆమె స్థానికంగా డీడీస్ ఫుడ్ మార్ట్ అనే కన్వీనియన్స్ స్టోర్ నడుపుతున్నారు.

దోపిడీ యత్నం.. మహిళపై కాల్పులు

సెప్టెంబర్ 16 రాత్రి 10:30 గంటల సమయంలో కిరణ్ పటేల్ స్టోర్‌లో నగదు లెక్కిస్తున్న వేళ జైడాన్ మాక్ హిల్ (21) అనే యువకుడు తుపాకీతో లోపలికి వచ్చి దోపిడీకి ప్రయత్నించాడు. కిరణ్ పటేల్ ధైర్యంగా అతన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఒక ప్లాస్టిక్ బాటిల్ విసిరి స్టోర్ బయటకు పరుగెత్తారు.

అయితే హిల్ కోపంతో ఆమెను వెంబడించి పలు రౌండ్ల కాల్పులు జరిపాడు. పార్కింగ్ లాట్‌లో బుల్లెట్ గాయాలతో కుప్పకూలిన కిరణ్ పటేల్ అక్కడికక్కడే మృతిచెందారు.

నిందితుడి అరెస్టు

పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. అతను ఇదే రోజు మరో వృద్ధుడిని కూడా హత్య చేసినట్లు తేలింది. దక్షిణ కరోలినా లా ఎన్‌ఫోర్స్‌మెంట్ డివిజన్ అధికారులు అతని ఇంటికి చేరుకున్నప్పుడు హిల్ ప్రతిఘటించినా, చివరికి అదుపులోకి తీసుకొని హత్య కేసు నమోదు చేశారు.

కమ్యూనిటీ దిగ్భ్రాంతి

కిరణ్ పటేల్ మరణం స్థానిక భారతీయ కమ్యూనిటీని తీవ్రంగా కలచివేసింది. కష్టపడి జీవనోపాధి కోసం పనిచేసిన ఒక మహిళను ఇలా మధ్యరాత్రి దారుణంగా కాల్చి చంపడం పట్ల అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు మద్దతుగా గోఫండ్‌మీలో సహాయ నిధుల సేకరణ ప్రారంభమైంది.

అమెరికాలో గన్ కల్చర్ ఆందోళన

ఇటీవలి కాలంలో అమెరికాలో గన్ హింస కేసులు పెరుగుతుండటం, ముఖ్యంగా భారతీయులు బలవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం వెళ్ళిన ప్రవాస భారతీయులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఈ ఘటనతో మరోసారి అమెరికాలో భారతీయుల భద్రతపై ప్రశ్నలు తలెత్తాయి.

Tags:    

Similar News