వీడియో: దుబాయ్ జీవితంపై భారతీయ యువతి సంచలనం!

మెరుగైన జీవితం, భారీ జీతాల కోసం లక్షలాది మంది భారతీయులు విదేశాలకు వెళ్లడం దశాబ్దాలుగా చూస్తున్నాం.;

Update: 2026-05-08 22:30 GMT

మెరుగైన జీవితం, భారీ జీతాల కోసం లక్షలాది మంది భారతీయులు విదేశాలకు వెళ్లడం దశాబ్దాలుగా చూస్తున్నాం. అయితే 2025-26 నాటికి విదేశీ బూమ్‌కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. అమెరికాలో గన్ కల్చర్, కెనడాలో ఆర్థిక ఇబ్బందులు, ఆస్ట్రేలియా అల్లర్లు ప్రవాసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో గల్ఫ్ దేశాలు.. ముఖ్యంగా దుబాయ్ సురక్షితమని భావించే వారికి కూడా ఇప్పుడు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. నెల‌ల పాటు సాగిన‌ యుద్ధం ఒకవైపు భయపెడుతుంటే.. సామాన్య ప్రవాసుల దైనందిన జీవితంలోని కష్టాలు మరోవైపు నాణేనికి రెండో పార్శ్వాన్ని చూపిస్తున్నాయి.

దుబాయ్ అంటేనే ఆకాశహర్మ్యాలు.. విలాసవంతమైన జీవనశైలి అని ఊహించుకునే వారికి ఒక భారతీయ యువతి షేర్ చేసిన వీడియో కళ్లు తెరిపిస్తోంది. కీర్తన లోకేష్ అనే మహిళ తన అపార్ట్‌మెంట్‌లోని అధ్వాన్న స్థితిని సోషల్ మీడియా వేదికగా బయటపెట్టారు. వంటగదిలో వాషింగ్ మెషీన్ నుండి నీరు లీక్ అవుతూ నేలంతా విస్తరించిన దృశ్యాలను చూపిస్తూ.. వారం రోజులుగా ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విలాసాలకు మారుపేరుగా నిలిచే నగరంలోని ఆకాశహర్మ్యాల్లో కూడా సామాన్యులు ఎంతటి ఇబ్బందులు పడతారో ఈ వీడియో నిరూపించింది.

విదేశాల్లో నివసించే చాలా మంది ప్రవాసులు ఒక రకమైన `నిశ్శబ్ద పోరాటం` చేస్తుంటారని కీర్తన పేర్కొన్నారు. సోషల్ మీడియాలో కనిపించే మెరుపులన్నీ నిజం కావని... తెర వెనుక ప్రతిరోజూ అనేక సర్దుబాట్లు, కష్టాలు ఉంటాయని ఆమె వెల్లడించారు. అపార్ట్‌మెంట్ పరిస్థితి బాగోలేకపోయినా... నీరు నిలిచిపోయినా అక్కడే వంట చేసుకుని తినాల్సిన పరిస్థితి ఉందని.. దుబాయ్ జీవితం అందరూ అనుకున్నంత సులభం కాదని ఈ యువ‌తి హెచ్చరించారు. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినా.. విదేశీ జీవితంలోని వాస్తవాలను ఇది ప్రతిబింబించింది.

విదేశీ గ్లామ‌ర్ లో క‌నిపించ‌ని క‌ష్టాలు:

నిజానికి సోషల్ మీడియా సృష్టించే `గ్లామరస్` లోకాన్ని చూసి విదేశాలకు వెళ్లే యువత తీవ్రమైన మానసిక ఒత్తిళ్లకు లోనవుతున్నారు. అందమైన ఫోటోలు, లగ్జరీ కార్ల వెనుక ఉన్న చిన్నపాటి గదులు, ఒంటరితనం, హోమ్ సిక్నెస్ వారిని కుంగిపోయేలా చేస్తున్నాయి. ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఒత్తిడి.. ఇంటికి డబ్బు పంపాలనే బాధ్యత వల్ల తమ కష్టాలను ఎవరికీ చెప్పుకోలేక... స్వదేశంలో ఉన్న వారి ముందు ప్రతిష్ట కోసం ఇంకా సుఖంగా ఉన్నామనే అబద్ధపు ముసుగులో బతకాల్సి వస్తోంది. ఈ ద్వంద్వ జీవితం దీర్ఘకాలిక ఆందోళనకు దారితీస్తోంది.

విదేశాలకు వెళ్లి స్థిరపడటం తప్పు కాదు.. కానీ సోషల్ మీడియాల్లో ప్రపంచాన్ని న‌మ్మ‌టం ప్రమాదకరం. అక్కడి వాస్తవ పరిస్థితులు- ఖర్చులు... ఎదురయ్యే సవాళ్లపై పూర్తి అవగాహన వచ్చిన త‌ర్వాతే విదేశాల‌కు వెళ్లడం అత్యవసరం. నిజం ఏంటో ఊహ ఏమిటో ముందే గ్రహించినప్పుడే ఎవ‌రైనా బ‌లంగా నిల‌బ‌డ‌గ‌ల‌రు. కీర్తన లోకేష్ వంటి వారు బయటపెడుతున్న నిజాలు... కనీసం ఇకనైనా విదేశీ జీవనంపై ఉన్న అతి అంచనాలను తగ్గించి.. వాస్తవంలోకి వ‌చ్చి ఆలోచించేలా చేస్తాయని ఆశిద్దాం.



Tags:    

Similar News