విదేశాల్లో భారతీయ యువతకు రక్షణ కరువు.. అమెరికాలో విద్యార్థుల మిస్టరీ మరణాలు.. కెనడాలో కాల్పుల కలకలం!

ఒకప్పుడు సురక్షిత తీరాలుగా భావించిన ఈ దేశాల్లో, ఇటీవల చోటుచేసుకుంటున్న అనుమానాస్పద మరణాలు.. కాల్పుల ఘటనలు విదేశాల్లో భారతీయుల భద్రతపై పెను ప్రశ్నార్థకాలను రేకెత్తిస్తున్నాయి.

Update: 2026-05-13 05:18 GMT

అమెరికా, కెనడా వంటి అగ్రరాజ్యాల్లో భారతీయ యువత వరుసగా మృత్యువాత పడుతుండటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులను.. ముఖ్యంగా వారి తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఒకప్పుడు సురక్షిత తీరాలుగా భావించిన ఈ దేశాల్లో, ఇటీవల చోటుచేసుకుంటున్న అనుమానాస్పద మరణాలు.. కాల్పుల ఘటనలు విదేశాల్లో భారతీయుల భద్రతపై పెను ప్రశ్నార్థకాలను రేకెత్తిస్తున్నాయి.

అమెరికాలో మిస్టరీ మరణాలు.. అర్ణవ్ సింగ్ విషాదాంతం

అమెరికాలో భారతీయ విద్యార్థుల అదృశ్యం.. ఆపై వారు శవాలుగా తేలడం ఒక నిరంతర పీడకలగా మారుతోంది. తాజాగా కాలిఫోర్నియాలోని శాన్ జోస్ ప్రాంతంలో 20 ఏళ్ల అర్ణవ్ సింగ్ అనే భారతీయ సంతతి యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. మే 5వ తేదీన అర్ణవ్ తల్లిదండ్రులు అతడిని శాన్ జోస్ స్టేట్ యూనివర్సిటీ సమీపంలో దింపారు. ఆ తర్వాత అతను తిరిగి ఇంటికి రాలేదు, ఫోన్ చేసినా స్పందన లేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, యూనివర్సిటీ సిబ్బందితో కలిసి మూడు రోజుల పాటు ముమ్మరంగా గాలించారు. మే 8న యూనివర్సిటీకి రెండు మైళ్ల దూరంలోని ఫెలాన్ అవెన్యూ వద్ద అర్ణవ్ మృతదేహాన్ని గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తులో శరీరంపై గాయాలు లేవని తేలినా.. మరణానికి గల కారణాలు మాత్రం ఇంకా మిస్టరీగానే ఉన్నాయి. సాంటా క్లారా కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ నివేదిక వస్తే తప్ప అసలు నిజం బయటపడదు. అంతేకాకుండా.. గ్రాండ్ క్యానియన్ నేషనల్ పార్క్‌లో సందర్శ్ కృష్ణ మృతదేహం లభించడం, అరిజోనా స్టేట్ యూనివర్సిటీకి చెందిన అన్ష్ అరోరా గత మూడు రోజులుగా కనిపించకుండా పోవడం అమెరికాలోని భారతీయ విద్యార్థి లోకాన్ని భయాందోళనల్లో నెట్టేసింది.

కెనడాలో కాల్పుల కలకలం.. ఇద్దరు భారతీయ టీనేజర్ల బలి

శాంతికి మారుపేరుగా భావించే కెనడాలో ఇప్పుడు తుపాకీ సంస్కృతి కోరలు చాస్తోంది. ముఖ్యంగా భారతీయ మూలాలున్న వారు లక్ష్యంగా మారుతుండటం ఆందోళనకరం. బ్రిటిష్ కొలంబియాలోని సరీ నగరంలో జరిగిన తాజా ఘటన నాగరిక సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. మే 10వ తేదీ రాత్రి సరీలోని న్యూటన్ ప్రాంతంలో ఉన్న ఒక అండర్‌గ్రౌండ్ పార్కింగ్‌లో దుండగులు జరిపిన కాల్పుల్లో 18 ఏళ్ల యువకుడు, 16 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు అక్కడికి చేరుకునే లోపే వారి ప్రాణాలు పోయాయి. ఇది ఒక పథకం ప్రకారం జరిగిన హత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన ప్రదేశానికి సమీపంలో కాలిపోయిన ఒక వాహనాన్ని గుర్తించిన పోలీసులు.. దానికి ఈ హత్యలతో సంబంధం ఉండవచ్చని భావిస్తున్నారు. కెనడాలో గ్యాంగ్ వార్‌లు, డ్రగ్స్ మాఫియా పెచ్చరిల్లుతుండటం వల్ల అమాయక భారతీయ యువత బలైపోతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

పెరుగుతున్న ఆందోళన.. ప్రభుత్వాల స్పందన కోరుతున్న బాధితులు

ఈ వరుస ఘటనలు విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థుల్లో అక్కడ ఉన్న వారి కుటుంబాల్లో అభద్రతా భావాన్ని నింపుతున్నాయి. అగ్రరాజ్యాల్లో స్థానిక రక్షణ వ్యవస్థలు భారతీయులను రక్షించడంలో విఫలమవుతున్నాయా? అనే సందేహాలు వస్తున్నాయి. కొన్ని ఘటనలు జాతి వివక్ష వల్ల జరుగుతున్నాయా అన్న కోణంలోనూ చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో భారత విదేశాంగ శాఖ తక్షణమే స్పందించి, ఆయా దేశాల రాయబార కార్యాలయాలతో చర్చలు జరపాలని బాధితులు కోరుతున్నారు.

ఉన్నత చదువుల కోసం, ఉజ్వల భవిష్యత్తు కోసం వేల కిలోమీటర్ల దూరం వెళ్లిన యువత ఇలా అకాల మరణం చెందడం తీరని లోటు. విదేశీ ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టి, భారతీయ పౌరుల భద్రతకు భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Tags:    

Similar News