అమెరికాలో దొంగతనం చేస్తూ దొరికిపోయిన భారతీయ విద్యార్థిని.. వీడియో వైరల్

అమెరికాలోని ఓ షాపులో దొంగతనం చేస్తూ అడ్డంగా పట్టుబడిన ఆ యువతి వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.;

Update: 2025-11-02 16:11 GMT

ఉపాధి, ఉన్నత విద్య, భవిష్యత్ అవకాశాల కోసం భారత్‌ నుంచి ప్రతి ఏటా వేలాది మంది విద్యార్థులు అమెరికాకు వెళ్తుంటారు. అమెరికా వెళ్లి చదువు పూర్తిచేసి ఉద్యోగం సాధించి, స్థిరపడటం అనేది చాలామందికి ఓ కల. అయితే ఇటీవల ఒక భారతీయ విద్యార్థిని చేసిన తప్పు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

అడ్డంగా దొరికిపోయిన యువతి - పోలీసుల అదుపులో...

అమెరికాలోని ఓ షాపులో దొంగతనం చేస్తూ అడ్డంగా పట్టుబడిన ఆ యువతి వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. స్టోర్‌ సిబ్బంది ఆమెపై అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ విద్యార్థినిని అదుపులోకి తీసుకున్నారు.

వీడియోలో తాను దొంగతనం చేయలేదని, డబ్బులు చెల్లించడం మర్చిపోయానని ఆ విద్యార్థిని పోలీసులను వేడుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. "ప్లీజ్... నేను తప్పు చేశాను, వదిలేయండి..." అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రాధేయపడినా, పోలీసులు మాత్రం ఆమెను వదిలేయలేదు. పరువు పోతుందంటూ ఆగ్రహం

ఈ ఘటనపై భారతీయ నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు “విదేశాల్లో భారతీయుల పరువుకు మచ్చ తెస్తున్నారు” అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు “అవకాశమిస్తే ఆమెను క్షమించాలి, మానవ తప్పిదం కావచ్చు” అంటూ సానుభూతి చూపిస్తున్నారు.

ఇటీవలి కాలంలో అమెరికాలో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. గతంలో కూడా ఇద్దరు భారతీయ విద్యార్థినులు ఓ స్టోర్‌లో చోరీ చేస్తూ పట్టుబడిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజా సంఘటనతో మళ్లీ ఒకసారి భారతీయ విద్యార్థుల ప్రవర్తన, విదేశాల్లో వారి బాధ్యతపై చర్చ మొదలైంది.

నిపుణుల హెచ్చరిక: చిన్న పొరపాటు... పెద్ద పరిణామాలు

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. విదేశాలకు వెళ్లే విద్యార్థులు కేవలం విద్య కోసమే కాకుండా, స్థానిక చట్టాలు, సంస్కృతి, సామాజిక నిబంధనలను గౌరవించాల్సిన అవసరం ఉంది. చిన్న తప్పు కూడా పెద్ద పరిణామాలకు దారితీస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.

ఒక చిన్న పొరపాటు జీవితాన్ని మార్చేసే పరిస్థితిని తెచ్చిపెట్టవచ్చు. విదేశాల్లో చదువుకుంటున్న ప్రతి భారతీయ విద్యార్థి ఈ ఘటన నుంచి పాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.

Tags:    

Similar News