రూ.కోటి సంపాదించే టెకీకి అమెరికా వీసా తిరస్కారం.. 60 సెకన్లలో షాక్!

అమెరికా వీసా విధానాలు రోజురోజుకు కఠినతరం అవుతున్నాయ నడానికి తాజా సంఘటన నిదర్శనం.;

Update: 2025-11-04 13:06 GMT

అమెరికా వీసా విధానాలు రోజురోజుకు కఠినతరం అవుతున్నాయ నడానికి తాజా సంఘటన నిదర్శనం. భారతదేశంలో సంవత్సరానికి ₹1 కోటి జీతం సంపాదిస్తున్న ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు అమెరికా వీసా కేవలం 60 సెకన్లలోనే తిరస్కరించబడింది. స్థిరమైన ఉద్యోగం, బలమైన ఆర్థిక నేపథ్యం, సుస్థిరమైన కుటుంబ జీవితం ఉన్నప్పటికీ, ఈ టెకీకి ఎదురైన అనుభవం వేలాది మంది భారతీయ దరఖాస్తుదారులలో ఆందోళన కలిగిస్తోంది.

* ఇంటర్వ్యూలో జరిగింది ఇదే!

సదరు భారతీయ ఇంజనీర్ అట్లాంటాలో జరగబోయే ఒక ప్రతిష్టాత్మక టెక్నాలజీ కాన్‌క్లేవ్‌కు హాజరయ్యేందుకు B1/B2 (వ్యాపారం/పర్యాటకం) వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడు. న్యూఢిల్లీలోని అమెరికన్ రాయబార కార్యాలయంలో జరిగిన ఇంటర్వ్యూలో వీసా అధికారి కేవలం 60 సెకన్ల వ్యవధిలోనే వీసా దరఖాస్తును నిరాకరించారు.

* అధికారి అడిగిన అంశాలు

ట్రావెల్ హిస్టరీ కింద ఇంతకుముందు చేసిన విదేశీ పర్యటనలపై ప్రశ్నించాడు. తర్వాత భారతదేశంతో గల బంధాలు (కుటుంబం, ఆస్తులు, ఉద్యోగం వివరించమన్నాడు.. అమెరికా పర్యటన ఉద్దేశ్యం ఏంటని ప్రశ్నించాడు.

ఇంజనీర్ అన్ని ప్రశ్నలకూ సమాధానం చెప్పినప్పటికీ, వీసా అధికారి సంతృప్తి చెందలేదు.

* "Section 214(B)" కింద వీసా నిరాకరణ

అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టం ప్రకారం.. వీసా అధికారి దరఖాస్తును నిరాకరించడానికి ప్రధానంగా ఉపయోగించిన సెక్షన్ 214(B). ఈ నిబంధన ప్రకారం తాత్కాలిక వీసా దరఖాస్తుదారు తన స్వదేశంతో తనకు గాఢమైన బంధాలు ఉన్నాయని, అమెరికా పర్యటన అనంతరం ఖచ్చితంగా తిరిగి వస్తాడని నిరూపించడంలో విఫలమైతే వీసా తిరస్కరించబడుతుంది.

ఈ టెకీకి స్థిరమైన ఉద్యోగం, కోటి రూపాయల జీతం, బలమైన ఆర్థిక స్థితి, ఇంకా చిన్నారి కుమార్తె కూడా ఉన్నారు. సాధారణంగా ఇవన్నీ ఇండియాకు తిరిగి వచ్చేందుకు "బలమైన బంధాలు"గా పరిగణించబడతాయి. అయినప్పటికీ, అధికారి వీసా నిరాకరించడం అమెరికా ఇమ్మిగ్రేషన్ పాలసీల కఠినత్వాన్ని, ముఖ్యంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలన ప్రభావంతో విధానాలు మరింత కఠినతరం అయిన తీరును స్పష్టం చేస్తోంది.

* భవిష్యత్ దరఖాస్తుదారులకు సూచనలు

ఈ సంఘటనతో, అమెరికా వీసా దరఖాస్తు చేసుకునే ప్రతి ఒక్కరూ తమ ఇండియాలోని ఆర్థిక, కుటుంబ, సామాజిక బంధాల వివరాలను మరింత పటిష్టంగా, స్పష్టంగా, నిరూపణాత్మకంగా చూపించడం అనివార్యంగా మారింది. అధిక జీతం లేదా మంచి ఉద్యోగం ఒక్కటే వీసా గ్యారెంటీ కాదని ఈ అనుభవం తేటతెల్లం చేసింది.

Tags:    

Similar News