వలస మహిళపై ఇమిగ్రేషన్ అధికారుల కాల్పులు.. మృతి.. అమెరికాలో దారుణం.. వీడియో

అమెరికాలో అక్రమ వలసలపై కఠినంగా వ్యవహరిస్తున్న ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ (ఐసీఈ) చర్యలు మరోసారి తీవ్ర చర్చకు దారి తీశాయి.;

Update: 2026-01-08 11:06 GMT

అమెరికాలో అక్రమ వలసలపై కఠినంగా వ్యవహరిస్తున్న ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ (ఐసీఈ) చర్యలు మరోసారి తీవ్ర చర్చకు దారి తీశాయి. మిన్నియాపోలిస్ నగరంలో జరిగిన ఒక ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ ఆపరేషన్ సందర్భంగా ఐసీఈ అధికారి కాల్పుల్లో ఒక మహిళ మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అందుతున్న సమాచారం ప్రకారం.. ఐసీఈ అధికారులు టార్గెట్ చేసి ఒక ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో కొందరు ఆందోళనకారులు వారి పనిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఒక మహిళ తన కారును ఆయుధంగా మార్చి అధికారులపై దూసుకెళ్లే ప్రయత్నం చేసిందని ఐసీఈ వెల్లడించింది. ఇది తమ ప్రాణాలకు ముప్పుగా మారిందని, ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపినట్లు పేర్కొంది.

ఐసీఈ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో “మా అధికారులను వాహనంతో తొక్కేందుకు ప్రయత్నించడం దేశీయ ఉగ్రవాద చర్యకు సమానం. మా అధికారి తన ప్రాణాలు, సహచరుల ప్రాణాలు, ప్రజల భద్రత కోసం కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఆ మహిళకు గాయాలయ్యాయి, ఆమె మృతి చెందింది. గాయపడిన ఐసీఈ అధికారులు పూర్తిగా కోలుకుంటున్నారని అని తెలిపారు.. మృతురాలు ఒక మహిళ అని ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ఆమె గుర్తింపు నేపథ్యంపై అధికారిక వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.

ఈ ఘటనపై డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ట్రంప్ పరిపాలన స్పందించింది. అక్రమ వలసలపై తీసుకుంటున్న చర్యలకు పూర్తి మద్దతు ప్రకటించింది. అలాగే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ఐసీఈ అధికారుల చర్యలను సమర్థిస్తూ ఇలాంటి ఎన్‌ఫోర్స్‌మెంట్ భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఈ ఘటనతో అమెరికాలో వలస విధానాలు, భద్రతా చర్యలు, అధికారుల అధికారం వంటి అంశాలపై మరోసారి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. మానవ హక్కుల కార్యకర్తలు నిష్పక్షపాత దర్యాప్తు కోరుతుండగా ప్రభుత్వ వర్గాలు మాత్రం ఇది ఆత్మరక్షణ చర్యేనని వాదిస్తున్నాయి.

ట్రంప్ 2.0 ప్రభుత్వంలో ఇమ్మిగ్రేషన్ విధానాలు మరింత కఠినతరం కాబోతున్నాయనడానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా నిలుస్తోంది. ఒకవైపు చట్ట అమలు మరోవైపు మానవ హక్కుల మధ్య జరుగుతున్న ఈ పోరాటం అమెరికా సమాజాన్ని రెండుగా చీలుస్తోంది.




Tags:    

Similar News