F-1 వీసా రద్దు.. SEVIS యాక్టివ్‌గా: అమెరికాలో చిక్కుకున్న భారత విద్యార్థి!

అమెరికాలో మాస్టర్స్‌ చదువుతున్న ఓ భారతీయ విద్యార్థి ప్రస్తుతం ఒక అసాధారణమైన, అయోమయ స్థితిలో చిక్కుకున్నాడు.;

Update: 2025-10-30 13:30 GMT

అమెరికాలో మాస్టర్స్‌ చదువుతున్న ఓ భారతీయ విద్యార్థి ప్రస్తుతం ఒక అసాధారణమైన, అయోమయ స్థితిలో చిక్కుకున్నాడు. అతనికి అమెరికా అధికారుల నుండి “మీ F-1 వీసా రద్దయింది” అనే మెయిల్‌ వచ్చినప్పటికీ, అతని విద్యార్థి రికార్డ్‌ (SEVIS) మాత్రం యాక్టివ్‌గా కొనసాగుతోంది. ఈ విచిత్ర పరిస్థితి ఆ విద్యార్థి భవిష్యత్తుపై ప్రశ్నార్థకం వేసింది.

* వీసా రద్దుకు కారణం: పాత ట్రెస్పాసింగ్‌ కేసు

2026 మేలో పట్టభద్రుడవ్వాల్సిన ఈ విద్యార్థి, 2025 మేలో నమోదైన ‘సూక్ష్మమైన ట్రెస్పాసింగ్‌ కేసు’ కారణంగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నాడు. కోర్టు ఈ కేసులో ACD (Adjournment in Contemplation of Dismissal) మంజూరు చేసింది. అంటే, విద్యార్థి డిసెంబర్‌ 2025 వరకు ఎలాంటి తప్పులు చేయకపోతే, కేసు డిస్మిస్‌ చేసి సీల్‌ చేస్తారు. అయినప్పటికీ ఈ పెండింగ్‌ రికార్డ్‌ను కారణంగా చూపి అమెరికా అధికారులు అతని F-1 వీసాను రద్దు చేశారు.

* చట్టబద్ధతకు కీలకం: SEVIS రికార్డ్‌ యాక్టివ్‌

విద్యార్థికి ఊరటనిచ్చే అంశం ఏమిటంటే.. అతని SEVIS (Student and Exchange Visitor Information System) రికార్డ్‌ ఇప్పటికీ చురుకుగా ఉంది. సాధారణంగా, SEVIS యాక్టివ్‌గా ఉందంటే విద్యార్థి అమెరికాలో చట్టబద్ధంగా F-1 స్టేటస్‌లో ఉన్నారని అర్థం.

*చదువు కొనసాగించవచ్చా? నిపుణుల సలహా!

ఇమ్మిగ్రేషన్‌ లాయర్‌ చెప్పిన వివరాల ప్రకారం.. SEVIS రికార్డ్‌ యాక్టివ్‌గా ఉన్నంతవరకు, విద్యార్థి అమెరికాలో చట్టబద్ధంగా చదువు కొనసాగించవచ్చు. అతను OPT (Optional Practical Training) కు దరఖాస్తు చేసుకోవచ్చు లేదా ఉద్యోగదాత ద్వారా H-1B వీసా కోసం ఫైల్‌ చేయించుకోవచ్చు. విద్యార్థి తప్పనిసరిగా అన్ని F-1 నిబంధనలను కచ్చితంగా పాటించాలి.

* అమెరికా విడిచి వెళ్లలేని చిక్కు!

ప్రస్తుతం ఆ విద్యార్థికి ఉన్న అతిపెద్ద సమస్య ప్రయాణం గురించే.. అతను అమెరికా విడిచి బయటకు వెళ్తే తిరిగి రావడం దాదాపు అసాధ్యం. రద్దయిన వీసాతో అతన్ని తిరిగి అనుమతించరు. తిరిగి రావాలంటే కొత్త వీసాకు దరఖాస్తు చేసి, ఇంటర్వ్యూ పూర్తి చేయాలి. ఈ ప్రక్రియకు నెలల తరబడి సమయం పట్టే అవకాశం ఉంది.

* లాయర్‌ కీలక సలహా: “దేశం విడవొద్దు!”

న్యాయవాది విద్యార్థికి స్పష్టమైన సలహా ఇచ్చారు. “చదువు పూర్తి చేసి, OPT ప్రాసెస్‌ పూర్తయ్యే వరకు అమెరికాలోనే ఉండండి. ఆ తరువాతే ప్రయాణం గురించి ఆలోచించండి.”

ట్రంప్‌ ప్రభుత్వంలో ఇమ్మిగ్రేషన్‌ నియంత్రణలు కఠినతరం కావడంతో, చిన్న చిన్న న్యాయపరమైన సమస్యలు కూడా పెద్ద వీసా సంక్షోభాలకు దారితీస్తున్నాయి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

* భారతీయ విద్యార్థులకు హెచ్చరిక

ఈ సంఘటన భారతీయ విద్యార్థులందరికీ ఒక గుణపాఠం. చిన్న తప్పు చేసినా వీసా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు వీసా నియమాలు తెలుసుకోవాలి. లీగల్‌ అడ్వైజర్‌తో సంప్రదించాలి. తమ SEVIS రికార్డ్‌ స్థితిని నిరంతరం చెక్‌ చేస్తూ ఉండాలి. తాత్కాలిక ఉపశమనం లభించినా, విద్యార్థులు నిర్లక్ష్యం వహించడం ప్రమాదకరం. ప్రతి చిన్న లీగల్‌ ఇష్యూను తీవ్రంగా పరిగణించాలి.

Tags:    

Similar News