న్యూయార్క్ అగ్ని ప్రమాదం : మరో తెలుగు విద్యార్థి దుర్మరణం
అమెరికాలోని అల్బనీలో ఇటీవల సంభవించిన ఘోర అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య రెండుకు చేరింది.;
అమెరికాలో భారతీయ విద్యార్థులు, భారతీయుల మరణపరంపర ఆగడం లేదు. అయితే రోడ్డు ప్రమాదాలు లేదంటే.. అగ్ని ప్రమాదాలు.. మరే ఇతర కారణాలతోనో అసువులు బాస్తూనే ఉన్నారు. తాజాగా మరో తెలుగు విద్యార్థి దుర్మరణం చెందారు. అమెరికాలోని అల్బనీలో ఇటీవల సంభవించిన ఘోర అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య రెండుకు చేరింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన అన్వేష్ సారపల్లి చికిత్స పొందుతూ మరణించినట్లు న్యూయార్క్ లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ధ్రువీకరించింది. డిసెంబర్ 4న జరిగి ఈ అగ్ని ప్రమాదంలో ఇప్పటికే సహజారెడ్డి ఉడుముల (24) అనే తెలుగు విద్యార్థిని చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే.
అమెరికాలోని క్వైల్ స్ట్రీట్ సమీపంలోని ఒక ఇంట్లో మంటలు చెలరేగినప్పుడు అందులో సహజారెడ్డి, అన్వేష్ తోపాటు మొత్తం నలుగురు ఉన్నారు. పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని బాధితులను చికిత్స నిమిత్తం అల్బనీ మెడికల్ సెంటర్ ఆస్పత్రికి తరలించారు. బలమైన గాలుల కారణంగా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఆ నివాసం పూర్తిగా అగ్నికి ఆహుతైంది.
తాజాగా చనిపోయిన అన్వేష్ సారపల్లి స్వస్థలం ఆంద్రప్రదేశ్ లోని తాడేపల్లి గూడెం. ప్రస్తుతం వీరి కుటుంబం హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో నివాసం ఉంటోంది. ఈ మేరకు అన్వేష్ కుటుంబ సభ్యులకు భారత రాయబార కార్యాలయం సమాచారం అందించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.
ఈ ప్రమాదంలో ఇప్పటికే సహజారెడ్డి ఉడుమల మృతిచెందింది. ఈమె తెలంగాణలోని ఉప్పల్ వాసి. ఆమె యూనివర్సిటీ ఎట్ అల్బనీ లో పోస్ట్ గ్రాడ్యూయేషన్ పూర్తి చేసి నగరంలో పనిచేస్తున్నారు. ఈ ప్రమాదంలో 90శాతం కాలిన గాయాలతో ఈమె చికిత్స పొందుతూ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ తో మరణించారు.
ఈ అగ్ని ప్రమాదం వల్ల యూనివర్సిటీ ఎట్ అల్బనీకి చెందిన అనేక మంది విద్యార్థులతో సహా 13 మందికి పైగా నివాసితులు నిరాశ్రయులయ్యారు. అన్వేష్ మృతి పట్ల భారత రాయబార కార్యాలయం తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ.. మృతదేహాలను స్వదేశానికి తరలించడానికి.. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందించడానికి కృషి చేస్తామని తెలిపింది.