కెనడాలో 19 లక్షల మందికి ‘ఎగ్జిట్’ ముప్పు.. సగం మంది భారతీయులే!
కెనడా.. ఒకప్పుడు వలసదారుల స్వర్గధామం. కానీ ఇప్పుడు అదే దేశం విదేశీయులకు కఠిన సవాలుగా మారుతోంది.;
దూరపు కొండలు నునుపు అంటారు. అందుకే ఆ కొండలను చేరుకునేందుకు దేశాన్ని దాటి మన వాళ్లు వెళుతుంటారు. కానీ అక్కడికి వెళ్లాక కొందరు బాగుపడుతారు.. మరికొందరు బలహీనపడి తిరిగొస్తారు. అయితే రోజులు అన్నీ ఒకేలా ఉండవు కదా.. అప్పుడే సమస్యలు ఎదురవుతుంటాయి. ప్రస్తుతం వలసవాదులను తరిమికొట్టే పనిలో విదేశాలున్నాయి. ముఖ్యంగా అమెరికా, యూరప్ దేశాలు, ఇప్పుడు కెనడా కూడా అందులో చేరింది.
కెనడా.. ఒకప్పుడు వలసదారుల స్వర్గధామం. కానీ ఇప్పుడు అదే దేశం విదేశీయులకు కఠిన సవాలుగా మారుతోంది. రాబోయే రెండేళ్లలో దాదాపు 19 లక్షల మంది తమ చట్టబద్ధ నివాస హోదాను కోల్పోయే ప్రమాదంలో ఉన్నారని తాజా గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. ఇందులో అత్యధికంగా భారతీయ యువత, కార్మికులు ఉండటం గమనార్హం.
ఇమిగ్రేషన్, రిఫ్యూజీస్ అండ్ సిటిజన్ షిప్ కెనడా (ఐఆర్.సీసీ) డేటా ప్రకారం.. 2025 చివరి నాటికి సుమారు 10 లక్షల మంది వర్క్ , స్టడీ పర్మిట్లు ముగియనున్నాయి. 2026 నాటికి మరో 9 లక్షల మందికి ఇదే పరిస్థితి ఎదురుకానుంది. ఈ భారీ సంఖ్యలో 50 శాతం మంది భారతీయులే ఉన్నారని అంచనా.. అంటే దాదాపు 9 నుంచి 10 లక్షల మంది భారతీయుల కెరీర్ ఇప్పుడు త్రిశంకు స్వర్గంలో ఉంది.
కెనడా ప్రభుత్వం ఇటీవల కఠిన ఇమిగ్రేషన్ నిబంధనలతో తాత్కాలిక నివాసితుల సంఖ్యను తగ్గించాలని నిర్ణయించింది. గతంలో సులభంగా వచ్చే పర్మనెంట్ రెసిడెన్సీ ఇప్పుడు గగనమైంది. స్కోరింగ్ పద్ధతి భారీగా పెరగడంతో చాలా మంది అర్హత సాధించలేకపోతున్నారు. విద్యార్థులు చదువు పూర్తయ్యాక పొందే పోస్ట్ గ్రాడ్యూయేషన్ వర్క్ పర్మిట్ నిబంధనలలో మార్పులు రావడం వల్ల వర్క్ ఎక్స్ పీరియన్స్ సంపాదించడం కష్టమవుతోంది.
భారతీయులపై ప్రభావం..
కెనడాలోని ఐటీ, హెల్త్‌కేర్, లాజిస్టిక్స్ , హాస్పిటాలిటీ రంగాల్లో భారతీయుల పాత్ర కీలకం. పర్మిట్ల గడువు ముగిస్తే ఉద్యోగాలు ఊడిపోతాయి. వర్క్ పర్మిట్ లేనిదే కంపెనీలు ఉద్యోగాల్లో ఉంచుకోవు. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులతో లక్షలాది రూపాయల రుణాలు తీసుకుని వెళ్లిన విద్యార్థులు ఇప్పుడు తిరుగు ప్రయాణం కావాల్సి వస్తే ఆర్థికంగా చితికిపోయే ప్రమాదం ఉంది. చట్టబద్ధ హోదా లేకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ వంటి ప్రాథమిక సదుపాయాలు కూడా నిలిచిపోతాయి.
అక్రమ వలసలు పెరిగే ఛాన్స్
పర్మిట్లు ముగిసినా దేశం విడిచి వెళ్లడానికి ఇష్టపడని వారు 'అక్రమ నివాసితులు'గా మారిపోయే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల కార్మిక దోపిడీ పెరిగి.. తక్కువ వేతనానికి పని చేయించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. మానసిక ఒత్తిడి, అభద్రతా భావం పెరిగి.. నగరాల్లో భద్రతా పరమైన సమస్యలు తలెత్తే ప్రమాదం వాటిల్లుతుంది.
ఈ క్రమంలోనే జనవరిలో వలసదారుల హక్కుల సంఘాలు భారీ నిరసనలకు పిలుపునిచ్చాయి. "మేము ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచాం, మమ్మల్ని ఇప్పుడు గాలికి వదిలేయకండి" అన్నది వారి ప్రధాన డిమాండ్. కెనడా ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి నిబంధనలను సడలిస్తుందా? లేక కఠినంగానే వ్యవహరిస్తుందా? అన్నది వేచి చూడాలి.