బంగారం ధర పెరగటం ఇక ఆగదా..?

Update: 2015-08-08 05:36 GMT
గత కొద్ది రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర.. శుక్రవారం ఒక్కరోజే కాస్త ఎక్కువే పెరిగింది. మొన్నటి వరకూ 10 గ్రాముల బంగారం ధర పాతిక వేల రూపాయిల కంటే తక్కువకు రావటం.. రానున్న రోజుల్లో ఇది మరింత తగ్గుతుందన్న అంచనాలు వ్యక్తమయ్యాయి.

అదేమంటే.. ప్రపంచ వ్యాప్తంగా బంగారం డిమాండ్ తగ్గటం.. చైనా ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవటం లాంటి కారణాలు చూపించి 10 గ్రాముల బంగారం ధర 22 వేల రూపాయిలకు పడిపోతుదంటూ పలు విశ్లేషణలు వ్యక్తమయ్యాయి. మీడియాలోనూ కథనాలు భారీగానే వచ్చాయి.

 ఒకపక్క బంగారం ధర భారీగా పడిపోతుందని.. సరికొత్త రికార్డులు నమోదవుతాయన్న ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి వాదనలకు వ్యాపార వర్గాల స్పందన మరోలా ఉంది. అందరూ ఊహించినట్లుగా బంగారం ధర పది గ్రాములు రూ.22వేలకు పడిపోవటం సాధ్యం కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

తాజాగా శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి బంగారం 10 గ్రాముల ధరలో ఒక్కరోజులోనే రూ.190 పెరిగింది. దీంతో.. ధర ఒక్కసారి 10 గ్రాములు రూ.25,170కు చేరుకుంది. విదేశీ మార్కెట్ల నుంచి సానుకూలత.. నగల వ్యాపారులు.. పారిశ్రామిక యూనిట్ల.. నాణేల తయారీదారులు కొనుగోళ్లు చేపట్టటంతో బంగారం ధర పెరిగిందని చెబుతున్నారు.

మరోవైపు.. బంగారం మార్కెట్ విశ్లేషకుల మాట మరోలా ఉంది. తాజాగా పెరిగిన పెరుగుదల.. బంగారం ధర పెరగటానికి ఆరంభమని.. శనివారం మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటివరకూ వినిపించినట్లుగా బంగారం ధర తగ్గటం తర్వాత.. పెరగటమే ఉంటుందని చెబుతున్నారు.

అషాడ మాసం ముగుస్తుందని.. శ్రావణమాసంతో పండగల సీజన్ మొదలవుతుందని.. అది మొదలు దీపావళి వరకూ బంగారం డిమాండ్ భారీగా ఉంటుందని.. కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయని.. ఈ నేపథ్యంలో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉండదని.. పెరగటమే ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి.. మీడియా రిపోర్టులు నిజం అవుతాయో.. లేక.. మార్కెట్ విశ్లేషకుల మాట నిజం అవుతుందో చూడాలి.
Tags:    

Similar News