నిలబడే నిద్రపోతున్నాడు.. ఇండియాలో జాంబీ డ్రగ్ కలకలం!
భారతదేశంలోని ప్రధాన నగరాల్లో డ్రగ్స్ వినియోగం భయాందోళనలు పెంచుతున్న సంగతి తెలిసిందే.;
భారతదేశంలోని ప్రధాన నగరాల్లో డ్రగ్స్ వినియోగం భయాందోళనలు పెంచుతున్న సంగతి తెలిసిందే. డ్రగ్స్ కల్చర్ పెరుగుతున్న వేళ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. బెంగళూరులోని బాగలూరు ప్రాంతంలో నిట్టే కాలేజీ సమీపంలో ఒక వ్యక్తి ఎటువంటి కదలిక లేకుండా, పరిసరాల స్పృహ కోల్పోయి విగ్రహంలా నిలబడి ఉన్న దృశ్యాలు నెట్టింట కలకలం రేపాయి. ఒక మనిషి నిలబడిన చోటే గంటల తరబడి నిశ్చలంగా ఉండిపోవడం చూస్తుంటే, ఇది ప్రమాదకరమైన 'జాంబీ డ్రగ్' ప్రభావమేనని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ భయానక పరిస్థితి వెనుక `జైలజైన్` అనే పదార్థం ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాథమికంగా జంతువులకు మత్తు ఇవ్వడానికి ఉపయోగించే ఈ మందును మనుషులు వాడటానికి ఏ దేశంలోనూ అనుమతి లేదు. అయితే విదేశాల్లో దీనిని `ఫెంటానిల్` వంటి ఇతర డ్రగ్స్‌తో కలిపి తీసుకోవడం వల్ల మనుషులు స్పృహ కోల్పోయి, వింతగా ప్రవర్తిస్తూ 'జాంబీస్' లా మారిపోతారని సమాచారం. ఈ మందు ప్రభావంతో శ్వాస నెమ్మదించడం, గుండె వేగం తగ్గడం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
కేవలం బెంగళూరులోనే కాకుండా, కొద్దిరోజుల క్రితం చండీగఢ్‌లో కూడా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. అక్కడ ఒక డెలివరీ బాయ్ రోడ్డుపై సుమారు రెండు గంటల పాటు కదలకుండా ఒకే స్థితిలో నిలబడి ఉండటం గమనార్హం. ఈ పరిణామాలను గమనిస్తున్న సామాజిక విశ్లేషకులు, నగరం 'ఉడ్తా బెంగళూరు'గా మారుతోందని విమర్శిస్తున్నారు. పబ్బులు, బార్లు విద్యాసంస్థలకు సమీపంలో ఉండటం వల్లే యువత ఇలాంటి ప్రమాదకరమైన అలవాట్లకు బానిసలవుతున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైద్యం పరంగా చూస్తే... ఈ డ్రగ్ ఒక పెద్ద సవాలుగా మారింది. ఇది సాధారణ ఓపియాయిడ్ కాకపోవడం వల్ల డ్రగ్ ఓవర్ డోస్ అయినప్పుడు ప్రాణాలు కాపాడేందుకు ఇచ్చే `నలోక్సోన్` వంటి మందులు కూడా దీనిపై పనిచేయవు. ప్రస్తుతం ఈ ఘటనలకు సంబంధించి పోలీసుల నుండి ఎటువంటి అధికారిక ధృవీకరణ రాలేదు. చండీగఢ్ బాధితుడిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ల్యాబ్ రిపోర్టులు వస్తే తప్ప ఈ పరిస్థితికి అసలు కారణం డ్రగ్సా లేక మరేదైనా ఆరోగ్య సమస్యనా అనేది స్పష్టమవ్వదు.
అయితే ఈ వైరల్ వీడియోలు సమాజానికి ఒక హెచ్చరికగా నిలుస్తున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లల స్నేహాల పట్ల, ప్రవర్తన పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. యువతను డ్రగ్స్ బారి నుండి రక్షించేందుకు విద్యాసంస్థల్లో ధ్యానం, విపాసన వంటి నైతిక విలువలను పెంచే కార్యక్రమాలను ప్రవేశపెట్టాలని సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు. పుకార్లను నమ్మకుండా వాస్తవాలు తెలిసే వరకు వేచి చూడాలని కోరుతూనే.. సమాజం అంతా కలిసి ఈ మహమ్మారిపై పోరాడాలని పిలుపునిస్తున్నారు.