అమెరికాకు తలవంచను.. ఉక్రెయిన్ కు ద్రోహం చేయను.. జెలన్ స్కీ కి సంచలన నిర్ణయం
కీవ్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై అమెరికా ప్రతిపాదించిన 'పీస్ ప్లాన్' చుట్టూ అంతర్జాతీయ రాజకీయాలు వేడెక్కుతున్నాయి.;
కీవ్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై అమెరికా ప్రతిపాదించిన 'పీస్ ప్లాన్' చుట్టూ అంతర్జాతీయ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ ప్రణాళికపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్‌స్కీ తాజాగా దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రకటన పెను సంచలనంగా మారింది. ఆ ప్రణాళికను అంగీకరించబోమంటూ అవసరమైతే అమెరికా మద్దతును కూడా వదులుకోవడానికి సిద్ధమని ఆయన పరోక్షంగా స్పష్టం చేశారు. అమెరికా 'పీస్ ప్లాన్' ఉక్రెయిన్ పై తీవ్ర ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో జెలెన్‌స్కీ దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్లిష్ట పరిస్థితిని విశ్లేషించారు. "ఉక్రెయిన్ చరిత్రలో అత్యంత ప్రమాదకర పీరియడ్స్ లో ఒకదాన్ని మనం ఎదుర్కొంటున్నాం. మనం ఎంచుకునే దాన్ని బట్టి గౌరవం, స్వేచ్ఛను కోల్పోవడమో, అమెరికా మద్దతు చేజార్చుకోవడమో జరుగుతుంది." అని స్పష్టం చేశారు. దేశ ఆత్మగౌరవం.. సార్వభౌమత్వానికే తమ ప్రాధాన్యత అని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. అమెరికా మద్దతు కోల్పోయే ప్రమాదం ఉన్నప్పటికీ, వెనుకడుగు వేయబోమనే గట్టి సంకేతమిచ్చారు. "మనం గౌరవాన్ని ఎంచుకుంటున్నాం," అని ఆయన దృఢంగా ప్రకటించారు. "2022లో ఉక్రెయిన్‌కు ద్రోహం చేయలేదు. ఇప్పుడూ చేయబోను " అంటూ ఆయన తమ నిర్ణయాన్ని తేల్చి చెప్పారు.
ట్రంప్ అల్టిమేటం: ఉక్రెయిన్ పై తీవ్ర ఒత్తిడి
మూడేళ్లకు పైగా రక్తసిక్తమైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 28 సూత్రాల శాంతి ప్రణాళిక ప్రపంచ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యంగా ఈ ప్రణాళికపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్‌స్కీ చేసిన తాజా వ్యాఖ్యలు దౌత్యపరమైన ఉద్రిక్తతను అమాంతం పెంచాయి. శాంతి ప్రతిపాదనలను కేవలం వారం రోజుల్లో అంగీకరించాలని ఉక్రెయిన్ ను ట్రంప్ గట్టిగా డిమాండ్ చేశారు. ఈ ప్రణాళికను అంగీకరించకపోతే, యుద్ధం నిరంతరాయంగా కొనసాగుతుందని ఆయన హెచ్చరించారు. ఈ కఠిన అల్టిమేటం ఉక్రెయిన్‌ను ఇరకాటంలో పడేసింది.
జెలెన్‌స్కీ ఆవేదన: మిత్రుడిని కోల్పోవడానికైనా సిద్ధమే!
ట్రంప్ షరతులపై స్పందించిన జెలెన్‌స్కీ, ప్రపంచం ముందు ఒక అత్యంత క్లిష్టమైన ప్రశ్నను ఉంచారు. "మా దేశం చరిత్రలోనే అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ సమయంలో ఆత్మగౌరవాన్ని కోల్పోవాలా? లేక మిత్రుడిని (అమెరికా) కోల్పోవాలా?" ఉక్రెయిన్ జాతీయ ప్రయోజనాలే తమ నిర్ణయాలకు అత్యంత ముఖ్యం అని స్పష్టం చేసిన జెలెన్‌స్కీ, అవసరమైతే అమెరికా వంటి కీలక మిత్రుడితో సంబంధాలను కూడా పునఃపరిశీలించేందుకు వెనుకాడబోమని సూచించడం అంతర్జాతీయ దౌత్య వర్గాలను ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతానికి ట్రంప్ ప్రతిపాదనకు ప్రత్యామ్నాయంగా కీవ్ సొంత ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో చర్చలు జరిగాయి. ట్రంప్‌తో జెలెన్‌స్కీ త్వరలో భేటీ కానున్నారు.
పుతిన్ స్పందన: "ఇంకా భ్రమలోనే ఉన్నారు!"
ఈ పరిణామాలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విమర్శనాత్మకంగా స్పందించారు. ఉక్రెయిన్, నాటో దేశాలు ఇప్పటికీ భ్రమల్లోనే జీవిస్తున్నాయని, రష్యాను యుద్ధంలో ఓడించగలమని కలలు కంటున్నాయని ఎద్దేవా చేశారు. అయితే ట్రంప్ ప్రణాళికపై చర్చలకు రష్యా సిద్ధంగా ఉందని తెలిపిన పుతిన్, చర్చలు విఫలమైతే మాత్రం యుద్ధం కొనసాగుతుందని హెచ్చరిక జారీ చేశారు.
ట్రంప్ ప్రణాళికలో కీలక అంశాలు: రష్యాకు అనుకూలమేనా?
మూడేళ్ల యుద్ధానికి పరిష్కారంగా ట్రంప్ ముందుకు తెచ్చిన 28 సూత్రాల ప్రణాళికలో కీలక అంశాలు ఉన్నాయి. దొనెట్స్క్ సహా పలు కీలక ప్రాంతాలను రష్యా నియంత్రణకు అప్పగించడం. ఉక్రెయిన్ సాయుధ దళాల సంఖ్యను గణనీయంగా తగ్గించడం.యుద్ధానంతర పునర్నిర్మాణానికి పాశ్చాత్య దేశాల మద్దతు ఇవ్వడం ముఖ్యంగా ప్రణాళికలో ఉన్నాయి.
అంతర్జాతీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ ప్రణాళికలో రష్యాకు అనుకూల అంశాలు అధికంగా ఉన్నాయి. ఇది ఉక్రెయిన్ భౌగోళిక సమగ్రతను దెబ్బతీసేలా ఉందని విమర్శలు వస్తున్నాయి.
ఇజ్రాయెల్ మోడల్: ఉక్రెయిన్‌పై అమలు యత్నం
ట్రంప్ ఇటీవల ఇజ్రాయెల్–హమాస్ ఘర్షణకు కూడా ఇదే తరహా శాంతి ప్రణాళికను ప్రతిపాదించారు. ఆ ప్రణాళికను ఇరుపక్షాలు అంగీకరించడం ద్వారా ప్రస్తుతం అక్కడ కాల్పుల విరమణ అమల్లో ఉంది. విశ్లేషకులు ట్రంప్ 28 సూత్రాల ప్రణాళికను, ఇజ్రాయెల్ మోడల్‌ను ఉక్రెయిన్‌పై కూడా అమలు చేయాలనే యత్నంగా చూస్తున్నారు. ట్రంప్ శాంతి ప్రణాళిక రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగిస్తుందా? లేక జెలెన్‌స్కీ వైఖరి కారణంగా మరిన్ని భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలకు దారి తీస్తుందా? జెలెన్‌స్కీ–ట్రంప్ భేటీ తర్వాతే దీనిపై స్పష్టత రానుంది. ఏదేమైనా, ఉక్రెయిన్ ఇప్పుడు ఆత్మగౌరవం... అత్యంత కీలకమైన మిత్రబంధం మధ్య ఒక సంక్లిష్టమైన సంధి దశలో నిలిచింది.
జెలెన్‌స్కీ చేసిన ఈ ప్రకటన దౌత్యపరంగా కీలక పరిణామంగా మారింది. రష్యాకు అనుకూలంగా ఉన్నట్టు భావిస్తున్న అమెరికా పీస్ ప్లాన్‌ను ఉక్రెయిన్ పూర్తిగా తిరస్కరించడం, అమెరికా-ఉక్రెయిన్ల మధ్య సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఇప్పుడు ప్రపంచం ఎదురుచూస్తున్న ప్రశ్న.
ట్రంప్‌తో భేటీ తర్వాతే ఈ వివాదంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే, ఉక్రెయిన్ తన జాతీయ ప్రయోజనాల విషయంలో రాజీ పడబోదని జెలెన్‌స్కీ ప్రకటన స్పష్టం చేస్తోంది.